YSRCP Visakha: సార్వత్రిక ఎన్నికలు దగ్గర పడుతున్న నేపథ్యంలో వైసీపీ సీనియర్ నేత, టీటీడీ బోర్డు మాజీ చైర్మన్ వైవీ సుబ్బారెడ్డి సేవలను పూర్తిగా పార్టీకి వినియోగించుకోవాలని పార్టీ అధినేత, సీఎం వైఎస్ జగన్మోహనరెడ్డి భావిస్తున్నారు. సీఎం వైఎస్ జగన్మోహనరెడ్డికి సమీప బంధువైన వైవీ సుబ్బారెడ్డి వైసీపీ ఆవిర్భావం నుండి ఆ పార్టీలో కీలక నేతగా క్రియాశీల భూమికను పోషించారు. 2014, 2019 ఎన్నికల్లో జగన్మోహనరెడ్డి కోటరీలో ముఖ్యనేతగా ఉన్నారు. వైసీపీ అధికారంలోకి వచ్చిన తర్వాత రెండు టర్మ్ లు టీటీడీ బోర్డు చైర్మన్ గా బాధ్యతలు నిర్వహించారు. గత నెలలో ఆయన చైర్మన్ పదవీ కాలం ముగియడంతో ఇక పూర్తి స్థాయిలో ఉత్తరాంధ్ర జిల్లాల పార్టీ రీజనల్ కోఆర్డినేటర్ బాధ్యతలు నిర్వహిస్తున్నారు.

ఇప్పటి వరకూ మంగళగిరి, హైదరాబాద్ నుండి విశాఖకు షటిల్ సర్వీస్ చేస్తూ పార్టీ కార్యక్రమాలను పర్యవేక్షిస్తున్న వైవీ సుబ్బారెడ్డి ఇకపై పూర్తి స్థాయిలో విశాఖలో పార్టీ శ్రేణులకు అందుబాటులో ఉండాలని భావిస్తున్నారుట. ఆ క్రమంలో త్వరలో తన నివాసాన్ని విశాఖలో ఏర్పాటు చేసుకోవడానికి సన్నాహాలు చేస్తున్నట్లు తెలుస్తొంది. సీఎం జగన్మోహనరెడ్డి సూచనల మేరకే ఆయన త్వరలో విశాఖకు తన మకాంను మార్చుకోనున్నట్లు తెలుస్తొంది. ఉత్తరాంధ్ర జిల్లాల్లో పార్టీ క్షేత్ర స్థాయి పరిస్థితులపై ఎప్పటికప్పుడు పార్టీ అధిష్టానంకు తెలియజేస్తూ తదనుగుణంగా చర్యలు చేపడుతున్నారు వైవీ సుబ్బారెడ్డి. నియోజకవర్గాల్లో పరిస్థితులను పరిశీలిస్తూ ఇన్ చార్జిల మార్పులు, చేర్పులపై అధిష్టానంతో చర్చించి నిర్ణయాలు తీసుకుంటున్నారు.

గత ఎన్నికల్లో రాష్ట్ర వ్యాప్తంగా వైసీపీ గాలి వీచినా విశాఖ పట్టణంలోని నాలుగు నియోజకవర్గాల్లో టీడీపీ అభ్యర్ధులు విజయం సాధించారు. ఇప్పుడు వైసీపీ సర్కార్ విశాఖను పరిపాలనా రాజధాని చేయాలని దృఢ నిశ్చయంతో ఉన్న కారణంగా అక్కడ క్లీన్ స్వీప్ చేయాలని వైసీపీ భావిస్తొంది. ఈ క్రమంలో గెలుపు గుర్రాలకే టికెట్ లు కన్పర్మ్ చేసేందుకు కసరత్తు చేస్తొంది. వైవీ సుబ్బారెడ్డి ఇచ్చిన నివేదికల కారణంగానే తాజాగా విశాఖ తూర్పు నియోజకవర్గంలో ఇన్ చార్జి మార్పు జరిగిందని భావిస్తున్నారు. అక్కడ ఇన్ చార్జిగా ఉన్న అక్రమాని విజయ నిర్మలను మార్చేసి ఆమె స్థానంలో విశాఖ ఎంపీగా ఉన్న ఎంవీవీ సత్యనారాయణ కు బాధ్యతలు అప్పగించారు.
అదే విధంగా విశాఖ దక్షిణ నియోజకవర్గంలో వైసీపీ నేతల మధ్య ఉన్న అంతర్గత పోరును వైవీ పరిష్కరించారని అంటున్నారు. గత ఎన్నికల్లో టీడీపీ నుండి గెలిచి వైసీపీలో చేరిన వాసుపల్లి గణేష్ కే టికెట్ ఖాయమని కూడా వైవీ ప్రకటించారు. ఆ నియోజకవర్గంలో టికెట్ ఆశిస్తూ వాసుపల్లి గణేష్ కు గట్టి పోటీగా ఉన్న కోలా గురువులుకి విశాఖ పార్టీ అధ్యక్ష బాధ్యతలు అప్పగించారు. అలాగే డీసీసీబీ చైర్మన్ పదవి కూడా ఇచ్చారు. ఈ నియోజకవర్గంలో గణేష్ కు సహకరించడం కోసం వైవీ సుబ్బారెడ్డి సూచనల మేరకే గురువులుకు ఈ పదవులు అప్పగించారని అనుకుంటున్నారు. ఇదే క్రమంలో పని తీరు బాగోలేని నియోజకవర్గాల్లో ఇన్ చార్జిలను మార్చేస్తామని కూడా ఇటీవల వైవీ హెచ్చరించారు. దీంతో పలు నియోజకవర్గాల్లోని ఆశావహులు తమకు అవకాశం కల్పించాలంటూ వైవీ చుట్టూ ప్రదక్షిణలు చేస్తున్నారు.
వైవీ సిఫార్సు చేస్తే జగన్మోహనరెడ్డి ఒకే అంటారన్న భావనతో ఉత్తరాంధ్ర ప్రాంతంలోని వైసీపీలో సీనియర్ (తోపులు) లు చాలా మంది వైవీ ఆశీస్సుల కోసం ప్రయత్నాలు చేస్తున్నారు. టీడీపీలో దశాబ్దాల కాలం పాటు పని చేసి మూడేళ్ల క్రితం వైసీపీలో చేరిన మాజీ ఎమ్మెల్యే ఎస్ఆర్ రహమాన్ రాబోయే ఎన్నికల్లో పోటీ చేయాలని ఆశిస్తున్నారు. విశాఖ దక్షిణ లేదా ఉత్తర నియోజకవర్గం నుండి పోటీ చేయాలని భావిస్తున్నారు. అయితే విశాఖ దక్షిణ నియోజకవర్గం సిట్టింగ్ ఎమ్మెల్యే వాసుపల్లి గణేష్ కు కన్ఫర్మ్ చేసినందున విశాఖ ఉత్తర నియోజకవర్గం నుండి పోటీ చేయాలని అనుకుంటున్నారు. ప్రస్తుతం ఆ నియోజకవర్గంలో ఇన్ చార్జిగా కేకే రాజు ఉన్నారు. ఆయన పనితీరు పట్ల విమర్శలు ఏమీ లేనప్పటికీ వచ్చే ఎన్నికల్లో సామాజిక సమీకరణాల నేపథ్యంలో ముస్లిం మైనార్టీల నుండి అభ్యర్ధిని ఎంపిక చేయాల్సి వస్తే తమకు చాన్స్ లభిస్తుందని ఎస్ ఆర్ రహమాన్ అనుకుంటున్నారు. ఈ ఆలోచనలో ఉన్న రహమాన్ వైవీ సుబ్బారెడ్డిని కలుస్తూ తన పేరు అధిష్టానానికి సిఫార్సు చేయాలని కోరుతున్నారుట.

ఇలా పలు నియోజకవర్గాల్లోని మాజీ ఎమ్మెల్యేలు, టీడీపీ నుండి వైసీపీలో చేరిన వారు పలువురు వైవీ చుట్టూ ప్రదక్షిణలు చేస్తూ తమ గురించి చెప్పుకుంటున్నారు. సీఎం జగన్మోహనరెడ్డికి వైవీ సుబ్బారెడ్డి దగ్గరి బంధువు (బాబాయ్) కావడంతో ఆయన సిఫార్సు చేస్తే టికెట్ కన్ఫర్మ్ అవుతుందన్న ఆశలో ఆశావహులు ఆయన ఆశీస్సుల కోసం ట్రై చేస్తున్నారుట. అయితే వైవీ సిఫార్సు చేసినా హైకమాండ్ సర్వేలో పేరు వస్తేనే టికెట్ కన్ఫర్మ్ అవుతుందని అంటున్నారు.
YS Jagan: బాలయ్య నియోజికవర్గం హిందూపురం లో అతిపెద్ద స్కెచ్ వేసిన జగన్ .. టీడీపీ ఓటమి గ్యారెంటీ ?