వైసీపీ బీసీ నేతలకు పదవుల పందేరం..!

(అమరావతి నుండి “న్యూస్ ఆర్బిట్” బ్యూరో)

బీసీ నేతలకు వైసీపీ పదవుల పంపిణీ కార్యక్రమం చేపడుతోంది. వైఎస్ జగన్మోహనరెడ్డి నేతృత్వంలోని ప్రభుత్వం గతంలో ఎన్నడూ లేని విధంగా మొట్టమొదటి సారిగా బీసీల్లో ఉప కులాలకు కార్పోరేషన్‌లు ఏర్పాటు చేస్తూ నిర్ణయం తీసుకున్న విషయం తెలిసిందే. బీసీలలో ఉన్న 56 కులాల కార్పోరేషన్‌ల నామినేటెడ్ పోస్టులకు ప్రభుత్వం బుధవారం ప్రకటన విడుదల చేయనున్నది.

వన్నికుల క్షత్రియ, అగ్నికుల క్షత్రియ, బెస్త, ఈడిగ, నాగ వంశీయులు, పులనాటి వెలమ తదితర 30వేల జనాభా ఉన్న వారందరకీ కార్పోరేషన్లను ఏర్పాటు చేస్తున్నది. చైర్మన్, డైరెక్టర్ ‌పదవుల్లో 50 శాతం మహిళలకు అవకాశం కల్పిస్తున్నారు. మొత్తం 56 కులాల కార్పోషన్‌లలో 29 చైర్మన్ పదవులు మహిళలకు, 27 పురుషులకు కేటాయిస్తున్నారు. చైర్మన్, డైరెక్టర్ పదవుల నియామకంలో అన్ని జిల్లాలకు ప్రాధాన్యం ఉండే విధంగా చర్యలు తీసుకుంటున్నారు.

ఇటు వైసీపీ..అటు టీడీపీ రెండు బీసీ జపం

జనాభాలో సగ భాగం ఉన్న బీసీల ప్రాపకం కోసం ప్రధాన రాజకీయ పక్షాలైన వైసీపీ, టీడీపి పోటీ పడుతున్నాయి. ఇటీవల టీడీపీ పార్లమెంటరీ నియోజకవర్గ అధ్యక్షులు, సమన్వయకర్తల నియామకంలో టీడీపీ అధినేత చంద్రబాబు బీసీ నేతలకు అధిక ప్రాధాన్యత ఇచ్చిన విషయం తెలిసిందే. ఇది జరిగి 48 గంటలు తిరగక ముందే వైసీపీ ప్రభుత్వం వందలాది మంది బీసీ నేతలకు కులాల కార్పోరేషన్‌లలో చైర్మన్, డైరెక్టర్ పదవులు కేటాయిస్తున్నది.