Telangana Assembly Polls: తెలంగాణ అసెంబ్లీ ఎన్నికలు దగ్గర పడుతున్న వేళ టీడీపీ అధినేత చంద్రబాబు మరో సారి యూటర్న్ తీసుకున్నారు. ఇంతకు ముందు తెలంగాణ ఎన్నికల్లో టీడీపీ పోటీ చేస్తుందని, పూర్వ వైభవం సాధిస్తామని పేర్కొన్న చంద్రబాబు .. తెలంగాణ పార్టీ పగ్గాలను కాసాని జ్ఞానేశ్వర్ కు అప్పగించారు. పాపం.. చంద్రబాబు ఏ సమయంలో ఎటువంటి నిర్ణయాలు తీసుకుంటారో తెలియని కాసాని జ్ఞానేశ్వర్ తెలంగాణలో పార్టీ బలోపేతానికి తన వంతు కృషి చేశారు. అసెంబ్లీ ఎన్నికల్లో అభ్యర్ధులను నిలిపేందుకు ధరఖాస్తులు స్వీకరించారు.

స్కిల్ డెవలప్ మెంట్ స్కామ్ కేసులో అరెస్టయి రాజమండ్రి సెంట్రల్ జైల్ లో ఉన్న టీడీపీ అధినేత చంద్రబాబుతో నెల రోజుల క్రితం కాసాని జ్ఞానేశ్వర్ ములాఖత్ అయ్యారు. ఆ సమయంలో అభ్యర్ధుల ఎంపిక, ప్రచార కార్యక్రమాలపై దృష్టి సారించాలని చంద్రబాబు సూచించడంతో జ్ఞానేశ్వర్ వివిధ నియోజకవర్గాల నుండి అభ్యర్ధుల ఎంపికకు దరఖాస్తులు స్వీకరించారు. టీడీపీ పొలిట్ బ్యూరో సభ్యుడు, హిందూపూర్ ఎమ్మెల్యే నందమూరి బాలకృష్ణ కూడా గత నెలలో హైదరాబాద్ ఎన్టీఆర్ ట్రస్ట్ భవనంలో ముఖ్యనేతలతో సమావేశం నిర్వహించి, అసెంబ్లీ ఎన్నికల్లో టీడీపీ పోటీ చేస్తుందనీ, పార్టీ శ్రేణులకు తాను అండగా ఉంటాననీ, ప్రచారం కూడా చేస్తానని హామీ ఇచ్చారు. ఆ తర్వాత మళ్లీ అటు వైపు లుక్ వేయలేదు.
దీంతో పాటు ఏపీలో టీడీపీతో పొత్తులో ఉన్న జనసేన పార్టీ తెలంగాణలో టీడీపీతో పొత్తు పెట్టుకోకుండా బీజేపీతో కలిసి వెళుతుండటంతో టీడీపీ ఒంటరి అయ్యింది. అటు చంద్రబాబు జైల్ లో ఉండటం, మరో పక్క జనసేన బీజేపీతో జత కట్టడం, బీఆర్ఎస్, కాంగ్రెస్ మధ్యే హోరాహోరీ పోరు నెలకొని ఉండటం తదితర పరిణామాల నేపథ్యంలో తెలంగాణలో టీడీపీ పోటీపై సందేహాలు నెలకొన్నాయి. ఈ క్రమంలోనే టీడీపీ పార్టీ ఆవిర్భావం నుండి పని చేసిన కీలక నేత రావుల చంద్రశేఖరరెడ్డి ఇటీవల పార్టీని వీడి అధికార బీఆర్ఎస్ పార్టీలో చేరారు. టీటీడీపీ అధ్యక్షుడుగా ఉన్న కాసాని జ్ఞానేశ్వర్ కూడా అధికార బీఆర్ఎస్ లో చేరనున్నారంటూ ప్రచారం జరిగింది.
కాగా నిన్న కాసాని జ్ఞానేశ్వర్ రాజమండ్రి సెంట్రల్ జైల్ లో చంద్రబాబుతో ములాఖత్ అయ్యారు. ఏపీలోని ప్రస్తుత పరిస్థితుల్లో తెలంగాణపై దృష్టి పెట్టలేమని చంద్రబాబు చెప్పారు. ఏ పరిస్థితుల్లో ఎన్నికల్లో పోటీకి దూరంగా ఉండాల్సి వస్తుందో తెలంగాణ నేతలకు వివరించాలని కాసానికి చంద్రబాబు సూచించారు. అయితే కాసాని .. చంద్రబాబుతో ములాఖత్ తర్వాత ఈ విషయాన్ని మీడియాకు చెప్పలేకపోయారు. తెలంగాణలో టీడీపీ ఒంటరిగా పోటీ చేస్తుందని అన్నారు. ఆదివారం లోకేష్ తో సమావేశం అయిన తర్వాత తెలంగాణలో పోటీకి సంబంధించి వివరాలు తెలియజేస్తామని తెలిపారు. అయితే తెలంగాణలో ఎన్నికల్లో పోటీకి దూరంగా ఉండాలని చంద్రబాబు తీసుకున్న నిర్ణయంపై కాసాని జ్ఞానేశ్వర్ గుర్రుగా ఉన్నట్లు తెలుస్తొంది.

నేడు నారా లోకేష్ తో సమావేశంలో కాసాని తాడోపేడో తేల్చుకోనున్నట్లు సమాచారం. ఇన్నాళ్లు పార్టీ పోటీ చేస్తుందంటూ మభ్య పెట్టి చివరి నిమిషంలో ఇటువంటి నిర్ణయం తీసుకోవడం ఏమిటంటూ ఆయన ఆవేదనలో ఉన్నట్లు తెలుస్తొంది. ఇప్పటి వరకూ పార్టీ కోసం చాలా కష్టపడ్డాననీ, చాలా ఖర్చు కూడా పెట్టానని ఇప్పుడు పోటీ చేయవద్దని నిర్ణయిస్తే తన పరిస్థితి ఏమిటని, ఇన్నాళ్లు తాను పడ్డ శ్రమ, పెట్టిన ఖర్చు ఫలితం ఏంటని కాసాని ప్రశ్నిస్తున్నారు. ఏపీ రాజకీయాలకు తెలంగాణను ముడిపెట్టడం సరికాదని ఆయన ఆవేదన వ్యక్తం చేసినట్లు సమాచారం.

మరో పక్క కాంగ్రెస్ కు మేలు చేయడం కోసమే తెలంగాణలో పోటీకి టీడీపీ దూరంగా ఉందని ప్రచారం జరుగుతోంది. చంద్రబాబు అరెస్టును ఖండిస్తూ హైదరాబాద్ తో సహా తెలంగాణలోని పలు ప్రాంతాల్లో పెద్ద ఎత్తున నిరసన కార్యక్రమాలు జరగడంతో ఈ సారి ఎన్నికల్లో టీడీపీ ఖచ్చితంగా పోటీ చేస్తుందని అనుకున్నారు. టీడీపీ అధిష్టానం తీసుకున్న ఈ కీలక నిర్ణయంతో తెలంగాణలోని పార్టీ కీలక నేతలు ఏ విధంగా స్పందిస్తారో వేచి చూడాలి.
MP Vijayasai Reddy: పురందేశ్వరికి విజయసాయి హెచ్చరిక..ఎందుకంటే..?