Premi Vishwanath: తెలుగు బుల్లితెరపై మెగా హిట్ అయిన సీరియల్స్ లిస్ట్ తీస్తే అందులో కార్తీకదీపం మొదటి స్థానంలో ఉంటుంది. దాదాపు ఆరేళ్లు ప్రసారమైన కార్తీకదీపం హైయెస్ట్ రేటింగ్ తో జాతీయ స్థాయిలో నెంబర్ వన్ సీరియల్ గా రికార్డ్ సృష్టించింది. బాహుబలి సినిమా టాలీవుడ్ స్థితి గతులను ఎలా అయితే మార్చిందో.. కార్తీకదీపం సీరియల్ కూడా అదే విధంగా బుల్లితెర స్థితి గతులు మార్చింది. అలాగే ఈ సీరియల్ ద్వారా డాక్టర్ బాబు, వంటలక్క అదేనండి మన నిరుపమ్ మరియు ప్రేమి విశ్వనాథ్ లు హీరో హీరోయిన్ల రేంజ్ లో పాపులారిటీ మరియు క్రేజ్ సంపాదించుకున్నారు. ఈ జంటకు ప్రత్యేకమైన ఫ్యాన్ బేస్ కూడా ఏర్పడింది. ముఖ్యంగా తెలుగు అమ్మాయి కాకపోయినప్పటికీ ప్రేమి విశ్వనాథ్ రెండు తెలుగు రాష్ట్రాల్లో ప్రతి ఇంటి ఆడపడుచు అయ్యింది.
తెలుగులో చేసింది ఒక్క సీరియలే అయినా కూడా భారీ స్థాయిలో నేమ్ అండ్ ఫేమ్ సంపాదించుకుంది. వంటలక్క పాత్రలో అద్భుతమైన నటన కనబరిచి గొప్ప నటిగా పేరు తెచ్చుకుంది. గత ఏడాది కార్తీకదీపం సీరియల్ ముగిసిన తర్వాత వంటలక్క మరియు డాక్టర్ బాబులను బుల్లితెర ప్రేక్షకులు ఎంతగానో మిస్ అయ్యారు. ఈ నేపథ్యంలోనే కార్తీక దీపం కు సీక్వెల్ గా ఇటీవల కార్తీక దీపం 2ను ప్రారంభించారు. కార్తీకదీపం పాత కథకి మరియు ఈ కొత్త కథకి సంబంధం లేకపోయినా.. నిరుపమ్ మరియు ప్రేమి విశ్వనాథ్లే ప్రధాన పాత్రలను పోషిస్తున్నారు.
కార్తీకదీపం 2- ఇది నవ వసంతం పేరుతో ఈ సీరియల్ ను మార్చి 25న స్టార్ట్ చేశారు. అయితే ఇలా వచ్చిందో లేదో అప్పుడే ఈ సీరియర్ రికార్డుల వేట మొదలు పెట్టేసింది. ప్రసారం స్టార్ట్ అయిన వారం రోజుల్లోనే కార్తీక దీపం 2 మిగతా సీరియల్స్ ను వెనక్కి నెట్టి టాప్ ప్లేస్ లో దూసుకుపోతుంది. భారీ టీఆర్పీ రేటింగ్‌ను సొంతం చేసుకుంటూ మళ్లీ పాత రికార్డ్స్‌నే రిపీట్ చేస్తుంది. ఇదిలా ఉంటే.. ఇప్పుడు ఈ సీరియల్ కు ప్రేమి విశ్వనాథ్ తీసుకుంటున్న రెమ్యునరేషన్ హాట్ టాపిక్ గా మారింది.
కార్తీక దీపం సీజన్ 1 మెగా హిట్ కావడం, పైగా తెలుగులో తనకు ఊహించని రీతిలో క్రేజ్ రావడంతో వంటలక్క తన రెమ్యునరేషన్ ను భారీగా పెంచేసిందట. సీజన్ 1 చేసేటప్పుడు ప్రేమి విశ్వనాథ్ ఒక్క రోజుకు రూ. 25 వేలు చొప్పున ఛార్జ్ చేసేది. అయితే కార్తీక దీపం 2 కోసం రోజుకు రూ. 35 వేల వరకు రెమ్యునరేషన్ అందుకుంటుందట. ఈ సీరియల్ కోసం ప్రేమి విశ్వనాథ్ నెలలో దాదాపు 20 రోజుల పాటు షూటింగ్ లో పాల్గొంటుంది. ఈ లెక్కన ఆమె కార్తీక దీపం 2 సీరియల్ ద్వారా నెలకు రూ. 7 నుంచి 8 లక్షలు వరకు సంపాదిస్తుందని నెట్టింట జోరుగా ప్రచారం జరుగుతోంది. ఇదే నిజమైతే బుల్లితెరపై హైయెస్ట్ పెయిడ్ యాక్ట్రస్ గా వంటలక్కనే అగ్ర స్థానంలో ఉంటుంది.