జనసేన ఎన్నికల గుర్తు ‘గాజు గ్లాసు’

(న్యూస్ ఆర్బిట్ బ్యూరో)

జనసేన పార్టీకి ఈసీ ఎన్నికల గుర్తును కేటాయించింది. గాజు గ్లాసును జనసేనకు ఎలక్షన్ సింబల్‌గా కేటాయిస్తూ ఉత్తర్వులు వెలువడ్డాయి. దీనిని జనసేన శనివారం అర్ధరాత్రి తన సోషల్ మీడియా సైట్లలో పోస్ట్ చేసింది. గుర్తు కేటాయింపుతో 2019 ఎన్నికల పోరుకు సంబంధించి జనసేన మరో అడుగు ముందుకేసినట్లయింది. గ్లాసు గుర్తు తేలికగా గుర్తుపట్టగలిగేది, కామన్ మ్యాన్‌కు సింబల్ కావడంతో జనసేన పార్టీ వర్గాలు సంతృప్తి వ్యక్తం చేస్తున్నాయి. ఎన్నికల ప్రచారంలో జనానికి గ్లాసును కొనివ్వడం, పంచడం చాలా తేలిక అని పార్టీ వర్గాలు అంటున్నాయి.

ఎన్నికల గుర్తుల (రిజర్వేషన్ అండ్ అలాట్‌మెంట్) నిర్దేశాలు, 1968 ప్రకారం ఎన్నికల కమిషన్ ఆయా పార్టీలకు, అభ్యర్థులకు గుర్తులు కేటాయిస్తుంది. ప్రస్తుతం 164 గుర్తుల నుంచి ఎన్నికల గుర్తును ఎంచుకునే వీలుంది.  గుర్తింపు కలిగిన పార్టీల అభ్యర్థులకు పార్టీ గుర్తులు కేటాయిస్తారు. అయితే ఇండిపెండెంట్ అభ్యర్థులు, గుర్తింపు పొందవలసి ఉన్న పార్టీలు ఫ్రీ సింబల్స్ జాబితా నుండి గుర్తును ఎంచుకోవలసి వుంటుంది.

నామినేషన్ వేసే ముందు అభ్యర్థి గుర్తుల జాబితా నుండి మూడు గుర్తులను సూచించాలి. వాక్యూన్ క్లీనర్, టూత్ బ్రష్, కాప్సికమ్ వంటివాటిని ఎవరైనా ఎంచుకోవచ్చు. ఇంకా గుర్తింపు పొందవలసి వున్నందున ఉమ్మడి గుర్తు కేటాయింపు కోసం జనసేన ఎన్నికల కమిషన్‌కు విజ్ఞాపన చేసింది. ఈ నేపథ్యంలో జనసేనకు గాజు గ్లాసు గుర్తును కేటాయించారు.