Children’s Story: అనగనగా రెండు పిల్లులు ఒక రొట్టె ముక్క కోసం వాదులాడుకుంటున్నాయి. నాదంటే .. నాదని హోరా హోరీ గా గొడవపడుతున్నాయి. ఇలా రెండు పిల్లులు రొట్టె ముక్క కోసం దెబ్బలాడుకోవడం ఒక కోతి చూసింది. ఎంత సేపటికి వాటి గొడవ తీరడం లేదు. ఈ సమస్యకు పరిష్కారం వాటికి తోచలేదు. దీంతో కోతి కల్పించుకుంది. మొత్తానికి కోతి వాటిని విడతీసింది. ఇంతోటి దానికి ఎందుకు దెబ్బలాడుతున్నారు. మీ సమస్యకి ఒకటే పరిష్కారం. ఈ రొట్టె ముక్కని మీరు చెరి సగం పంచుకోండి. కావాలంటే మీ ఇద్దరికీ సమానంగా నేను పంచి పెడతాను అని చెప్పింది కోతి.
కోతి చెప్పిన మాట ఆ పిల్లులకు నచ్చింది. సరే అంటూ ఆ రొట్టి ముక్కను కోతికి అందించాయి. కోతి ఆ ముక్కను రెండు గా చేసింది. ఒక ముక్క పెద్దగా, మరో ముక్క చిన్నగా ఉండటంతో..అయ్యో! ఒక ముక్క పెద్దగా వుందే అని కోతి ఆ పెద్ద ముక్క ను కొంచం కొరికి తినేసింది. ఆ తర్వాత అరెరే! ఇప్పుడు ఈ ముక్క పెద్దగా అయిపొయింది అని రెండో ముక్కలో కొంచం తినేసింది కోతి. ఛ.. ఇప్పుడు ఇది పెద్దగా అయిపొయింది! అని మళ్ళి మొదటి ముక్కలో కొంచం తినేసింది కోతి. ఇలా కొంచం కొంచం చేసి మొత్తం రొట్టె ముక్క కోతి తినేసి తుర్రున చెట్టెక్కి పడుక్కుంది.
ఈ పరిణామానికి పిల్లులు రెండూ నోరు వెళ్లబెట్టి చూస్తూ వుండి పోయాయి. నిరాశగా వాటి దారిన అవి వెళ్లి పోయాయి. అందుకే, పెద్దలు మనకి ఎప్పుడు చెపుతూ వుంటారు, ఇద్దరి మధ్య గోడవ జరిగినప్పుడు లాభం ఎప్పుడు మూడో వారికి చెందుతుంది అని. ఇప్పుడు కూడా మారు మూల గ్రామాల్లో నిరక్షరాస్యుల మధ్య పంచాయతీలు ఇలానే జరుగుతూ ఉంటాయి. ఇద్దరి మధ్య పంచాయతీని తీరుస్తున్నట్లుగా ఓ పెద్ద మనిషి లాభం పొందుతూ ఉంటాడు. కోతి లాంటి పెద్ద మనుషులు ఉంటారు.
కథలు.వరల్డ్ ప్రెస్.కామ్ సౌజన్యంతో….