రెడ్ మీట్ (గొర్రె మాంసం, పోర్క్, బీఫ్) తింటే గుండె జబ్బు, కాన్సర్ ప్రమాదం ఎక్కువ అవుతుందన్న మాట చాలాకాలంగా ప్రచారంలో ఉంది. అయితే దీనికి సంబంధించి ఖచ్చితమైన అధ్యయనాలు లేవు. మితి మీరకుండా ఎంత తినాలో అంతే తింటే రెడ్ మీట్ వల్ల వచ్చే ప్రమాదం ఏమీ లేదని కొంతకాలం క్రితం ఒక అధ్యయనంలో తేలింది.
ఈ నేపధ్యంలో అమెరికాలోని రెండు యూనివర్సిటీలలో తాజాగా జరిగిన అధ్యయనం ఫలితాలకు ప్రాధాన్యత ఏర్పడింది. బోస్టన్లోని హార్వర్డ్ చాన్ స్కూల్ ఆఫ్ పబ్లిక్ హెల్త్, వెస్ట్ లఫాయెటీలోని పర్డ్యూ యూనివర్సిటీ సైంటిస్టులు సంయుక్తంగా ఈ అధ్యయనం నిర్వహించారు.
గతంలో జరిగిన అధ్యయనాలకూ, దీనికీ మధ్య తేడా ఏమంటే శరీరంపై ఉత్త రెడ్ మీట్ ప్రభావం కాకుండా, ఇతర శాకాహారం మాంసకృత్తులు తీసుకుంటే తేడా ఏమన్నా ఉంటుందా అన్న కోణంలో పరిశోధన చేశారు. రెడ్ మీట్ కాకుండా శాకాహారం ప్రొటీన్లు తీసుకుంటే రక్తంలో చెడ్డ కొల్లెస్ట్రాల్ శాతం తగ్గింది. అదే రెడ్ మీట్ తీసుకున్నవారి రక్తంలో ట్రైగ్లిజరైడ్ల శాతం పెరిగింది.
ఈ రెండు గ్రూపుల మధ్యా టోటల్ కొల్లెస్ట్రాల్, లిపోప్రొటీన్స్ విషయంలో మాత్రం పెద్ద బేధం కనబడలేదు. అలాగే రక్తపోటులో కూడా పెద్ద తేడా లేదు. చెడ్డ కొల్లెస్ట్రాల్ విషయంలో తేడా ఎక్కువ కనబడింది. శాకాహారం అంటే జంక్ ఫుడ్ కాదనీ, కాయధాన్యాలు, నట్స్ వంటివి తీసుకోవాలనీ పరిశోధకులు అంటున్నారు.