అమరావతి: నాలుగేళ్ల వరకు ఎన్నికలు లేవు కాబట్టి సినిమాలు చేసుకుంటేనే మంచిదని జనసేన అధినేత పవన్ కళ్యాణ్ నిర్ణయం తీసుకుని ఉంటారని మాజీ ఎంపి ఉండవల్లి అభిప్రాయపడ్డారు. పవన్ కల్యాణ్ సినిమాల్లో నటించడం కరెక్టేననీ, అదే సరైన నిర్ణయంగా భావిస్తున్నాననీ అయన అన్నారు. గురువారం మీడియా సమావేశంలో పవన్ సినీ రీ ఎంట్రీపై విలేఖరులు అడిగిన ప్రశ్నకు పై విధంగా వ్యాఖ్యానించారు.
పవన్ సినిమాల్లో నటించాలని మొట్ట మొదట కలిసినప్పుడే చెప్పానన్నారు ఉండవల్లి. అయన ప్రధాన వృత్తి అదే కాబట్టి సినిమాలు మాత్రం ఆపొద్దని సూచించానన్నారు. రాజకీయాలు, సినిమాలు రెండూ కుదరవని నాడు పవన్ చెప్పాడనీ, కానీ ఇప్పుడు కుదురుతోందనీ అన్నారు.
అప్పట్లో తాను సీఎం అయ్యే అవకాశాలున్నాయని భావించి సినిమాలు వద్దనుకునుంటాడనీ, ఇప్పుడు నాలుగేళ్ల వరకు ఎన్నికలు లేవు కాబట్టి సినిమాలు చేసుకుంటేనే మంచిదని నిర్ణయం తీసుకుని ఉంటాడనీ ఉండవల్లి అభిప్రాయపడ్డారు.
జనసేన, బీజేపీల మధ్య పొత్తు గురించి స్పందిస్తూ, పవన్ అధికారంలో లేడు కాబట్టి ఎవరితో పొత్తు పెట్టుకున్నా ఫర్వాలేదని అన్నారు. పొత్తులకు సిద్ధాంతాలతో పని ఉండవల్లి వ్యాఖ్యానించారు. చంద్రబాబుకు ఈ ఎన్నికల్లో కమ్యూనిస్టులు, వచ్చే ఎన్నికల్లో బీజేపీతో పొత్తు ఉండొచ్చనీ అదే విధంగా పవన్ కల్యాణ్ పరిస్థితీ పెద్దగా తేడా లేదని ఉండవల్లి అన్నారు.