YS Jagan: ఏపి ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహనరెడ్డి స్త్రీ శిశు సంక్షేమ శాఖ ఉద్యోగులకు గుడ్ న్యూస్ చెప్పారు. స్త్రీ శిశు సంక్షేమ శాఖలో ఖాళీగా ఉన్న పోస్టుల భర్తీతో పాటు పదోన్నతుల ప్రక్రియ ను వీలైనంత త్వరగా పూర్తి చేయాలని సీఎం జగన్ ఆదేశించారు. ఈ శాఖపై మంగళవారం నిర్వహించిన సమీక్షా సమావేశంలో సీఎం జగన్ ..63 సీడీపీఓ పోస్టుల భర్తీకి గ్రీన్ సిగ్నల్ ఇచ్చారు. వీటిని వీలైనంత త్వరగా భర్తీ చేయాలని ఆదేశించారు. అంగన్ వాడీల్లో నాడు నేడు కార్యక్రమాలకు ప్రభుత్వం దాదాపు రూ.1500 కోట్లకుపైగా ఖర్చు చేస్తుందనీ, మూడు విడతల్లో చేపట్టాలని ఆదేశించారు. మౌలిక సదుపాయాలు గణనీయంగా మెరుగుపర్చాలని చెప్పారు. పనుల్లో నాణ్యత ఉండాలనీ, చిన్నారులకు మంచి వాతావరణం అందించాలని తెలిపారు.

అంగన్ వాడీలలో నిరంతర పర్యవేక్షణ ఉండాలని, పిల్లలకు పాలు, గుడ్లు లాంటి ఆహారం పంపిణీలో ఎలాంటి సమస్యలు ఉండకూడదని సీఎం జగన్ పేర్కొన్నారు. నూటికి నూరు శాతం పిల్లలకు పాలు పంపిణీ కావాలని చెప్పారు. అలాగే పిల్లలకు ప్లేవర్డ్ పాలు పంపిణీని పైలట్ ప్రాజెక్టుగా ప్రారంభించాలని ఆదేశించారు. మూడు నెలల తర్వాత పూర్తి స్థాయిలో ప్లేవర్డ్ మిల్క్ పంపిణీ కావాలనీ ఈ మేరకు ప్రణాళిక రూపొందించుకోవాలని అధికారులను ఆదేశించారు. అదే విధంగా అంగన్ వాడీలలో బోధనపైనా ప్రత్యేక దృష్టి పెట్టాలన, ఉత్తమ భోధనలను అందుబాటులోకి తీసుకురావాలని చెప్పారు. అంగన్ వాడీలలో స్మార్ట్ టీవీల ద్వారా డిజిటల్ పద్దతిలో బోధనపై అలోచన చేసి ప్రతిపాదనలు రూపొందించాలని అధికారులను ఆదేశించారు. పిల్లల ఆరోగ్యంపైనా ప్రత్యేక శ్రద్ద తీసుకోవాలని అన్నారు. అంగన్ వాడీలు, విలేజ్ క్లినిక్స్, వైద్య ఆరోగ్య శాఖలు సమన్వయంతో పని చేయాలని తెలిపారు.
ఈ సమీక్షా సమావేశంలో మహిళా, శిశు సంక్షేమ శాఖ మంత్రి ఉషశ్రీ చరణ్. సీఎస్ కేఎస్ జవహర్ రెడ్డి, మహిళా శిశు సంక్షేమ శాఖ ముఖ్య కార్యదర్శి ముద్దాడ రవిచంద్ర, ఎపీ డెయిరీ డెవలప్ మెంట్ కార్పోరేషన్ ఎండీ ఏ బాబు, పాఠశాల మౌలిక వసతుల శాఖ కమిషనర్ కాటమనేని భాస్కర్, పౌరసరఫరాల శాఖ ఎండీ వీరపాండ్యన్ తదితరులు పాల్గొన్నారు.