Pawan Kalyan: జనసేన అధినేత పవన్ కళ్యాణ్ కు కృష్ణాజిల్లా పోలీసులు నోటీసులు జారీ చేశారు. వారాహి యాత్ర బహిరంగ సభ ఇవేళ కృష్ణాజిల్లా పెడనలో జరగనున్న సంగతి తెలిసిందే. అయితే పెడనలో జరిగే వారాహి యాత్ర సభ రౌడీ మూకలు రాళ్ల దాడికి ప్లాన్ చేశారంటూ పవన్ కళ్యాణ్ నిన్న సంచలన ఆరోపణలు చేశారు. పవన్ కళ్యాణ్ సంచలన ఆరోపణలు చేసిన నేపథ్యంలో ఆయన చేసిన ఆరోపణలకు ఏమైనా సాక్ష్యాలు ఉన్నాయా అని నోటీసులు ఇచ్చినట్లు కృష్ణాజిల్లా ఎస్పీ జాషువా వెల్లడించారు. దాడులు జరుగుతాయనే సమాచారం ఎక్కడ నుండి వచ్చిందనేది తెలియపర్చాలని పవన్ కు నోటీసులో కోరామని చెప్పారు.

అయితే తాము పంపిన నోటీసులకు పవన్ నుండి ఎలాంటి రిప్లై రాలేదన్నారు. రిప్లై ఇవ్వలేదంటే ఆయన నిరాధార ఆరోపణలు చేస్తున్నారని అనుకోవాలా అని ప్రశ్నించారు. ఎటువంటి సమాచారంతో పవన్ ఈ వ్యాఖ్యలు చేశారని ప్రశ్నించారు. పవన్ రెచ్చగొట్టే వ్యాఖ్యలు చేశారనీ, అందుకే నోటీసులు ఇచ్చామని ఎస్పీ తెలిపారు. సరైన ఆధారాలు లేకుండా వ్యాఖ్యలు, ఆరోపణలు చేయకూడదని హితవు పలికారు. బాధ్యతారాహిత్యంగా ఆరోపణలు చేస్తే పర్యవసానాలు ఉంటాయన్నారు.
రెచ్చగొట్టే భాష, సైగలు మానుకుని మాట్లాడాలని ఎస్పీ సూచించారు. పవన్ కంటే నిఘా వ్యవస్థ పోలీస్ శాఖకు బలంగా ఉందన్నారు. అసాంఘీక శక్తులుంటే కచ్చితంగా చర్యలు తీసుకుంటామని ఎస్పీ జాషువా తెలిపారు. పెడన పోలీస్ స్టేషన్ పరిధిలో తోటమూల సెంటర్ లో బహిరంగ సభకు అనుమతి కోసం పవన్ దరఖాస్తు చేశారని చెప్పారు. పవన్ చేసిన ఆరోపణల నేపథ్యంలో అక్కడ పూర్తి విచారణ, పరిశీలన చేశామన్నారు ఎస్పీ.
పెడనలో జరుగుతున్న వారాహి యాత్రలో అలజడి సృష్టించేందుకు కుట్ర జరుగుతోందని పవన్ ఆరోపణలు చేశారు. నిన్న మచిలీపట్నంలో జరిగిన జనవాణి కార్యక్రమంలో పవన్ ఈ సంచలన ఆరోపణలు చేశారు. జనసేన, టీడీపీ పొత్తును విచ్చిన్నం చేయడానికి కుట్రలు చేస్తున్నారని కూడా పవన్ ఆరోపించారు. తన సభలో రాళ్ల దాడి జరిగితే అందుకు ప్రభుత్వం, పోలీసులు బాధ్యత వహించాల్సి ఉంటుందని కూడా పవన్ అన్నారు. పవన్ చేసిన ఆరోపణలు చర్చనీయాంశంగా మారాయి.
YS Viveka Case: సీబీఐ కోర్టులో వైఎస్ భాస్కరరెడ్డికి మరోసారి ఊరట.. ఎస్కార్ట్ బెయిల్ పొడిగింపు