శ్రీ సత్యసాయి జిల్లా పుట్టపర్తిలో తీవ్ర ఉద్రిక్తత పరిస్థితులు చోటుచేసుకున్నాయి. పుట్టపర్తి నియోజకవర్గ అభివృద్ధి, అవినీతిపై ఎమ్మెల్యే దుద్దుకుంట శ్రీధర్ రెడ్డి, మాజీ మంత్రి పల్లె రఘునాథరెడ్డి మధ్య సవాళ్లు, ప్రతి సవాళ్లు కొనసాగుతున్నాయి. ముందుగా సవాళ్లు చేసుకున్న సమయానికి ఇరు పార్టీల నేతలు ఇవేళ ఉదయం సత్తమ్మ దేవాలయానికి చేరుకున్నారు. ఈ క్రమంలో టీడీపీ, వైసీపీ వర్గీయులు రాళ్లు, చెప్పులతో పరస్పరం దాడి చేసుకున్నారు. దీంతో ఉద్రికత్త పరిస్థితి నెలకొంది. పోలీసుల సమక్షంలోనే ఇరువర్గాలు దాడులు చేసుకున్నారు. ఈ దాడుల్లో శ్రీధర్ రెడ్డి, రఘునాధరెడ్డి వాహనాలు ధ్వంసమయ్యాయి. పరిస్థితులు అదుపు తప్పేలా కనిపించడంతో పోలీసులు లాఠీ చార్జి చేసి ఇరువర్గాలను చెదరగొట్టారు.

టీడీపీ జాతీయ ప్రధాన కార్యదర్శి లోకేష్ పుట్టపర్తి లో పాదయాత్ర సందర్భంలో అభివృద్ధి పై ఎమ్మెల్యే శ్రీధర్ రెడ్డిని ఉద్దేశించి తీవ్ర వ్యాఖ్యలు చేశారు. దీనిపై స్పందించిన వైసీపీ ఎమ్మెల్యే శ్రీధర్ రెడ్డి సత్తెమ్మ ఆలయం వద్ద అభివృద్ధిపై చర్చకు సిద్దం గా ఉన్నానంటూ సవాల్ విసిరారు. శ్రీధర్ రెడ్డి సవాల్ ను పల్లె రఘునాథ రెడ్డి స్వీకరించారు. శ్రీధర్ రెడ్డి చేసిన అవినీతిని నిరూపించేందుకు సిద్దంగా ఉన్నానంటూ పల్లె ప్రతి సవాల్ చేశారు. సత్తెమ్మ దేవాలయంలో ప్రమాణం చేసేందుకు సిద్దంగా ఉన్నానని పల్లె చెప్పారు. ఈ క్రమంలో శ్రీధర్ రెడ్డి, పల్లె రఘునాథ్ రెడ్డి ఇవేళ సత్తెమ్మ ఆలయానికి వస్తున్న నేపథ్యంలో పోలీసులు అప్రమత్తమైయ్యారు. పుట్టపర్తిలో 30 పోలీస్ యాక్ట్ అమలులో ఉందని, రాజకీయ కార్యక్రమాలు చేయడానికి వీలులేదని పోలీసులు హెచ్చరించారు. సత్తెమ్మ ఆలయం వద్ద భారీ గా పోలీసులను మోహరించారు.
తొలుత పల్లె రఘునాధ రెడ్డిని ఇంట్లో నుండి బయటకు రావద్దని పోలీసులు ఆదేశాలు జారీ చేయడంపై ఆ పార్టీ నేతలు ఆగ్రహం వ్యక్తం చేశారు. ఎమ్మెల్యేని ఆలయం వద్దకు అనుమతించి, పల్లెను అనుమతించకపోవడం ఏమిటని ప్రశ్నించారు.
Media: జర్నలిజాన్ని భ్రష్టుపట్టిచేస్తున్నారు(గా)..! ఇదో ఉదాహరణ