మాజీ మంత్రి వైఎస్ వివేకానంద రెడ్డి హత్య కేసుపై మరో కొత్త కోణం వెలుగులోకి వచ్చింది. సీబీఐ విచారణ సందర్భంలో వైఎస్ అవినాష్ రెడ్డి .. వివేకానంద రెడ్డి మతం మార్చుకుని ఒక ముస్లిం మహిళను వివాహం చేసుకున్నారనీ, ఆమెకు ఒక కుమారుడు కూడా ఉన్నారనీ, వారి కుటుంబంలో ఉన్న విబేధాల నేపథ్యంలో హత్య జరిగి ఉండవచ్చని చెప్పారు. ఇప్పుడు వైఎస్ భాస్కరరెడ్డి తరపు న్యాయవాది మరో కొత్త విషయాన్ని కోర్టు దృష్టికి తీసుకువచ్చారు. హత్య కేసులో నిందితుల్లో ఒకరైన సునీల్ యాదవ్ తల్లిని వివేకా లైంగిక వేధింపులకు గురి చేశారని దీంతో కక్షకట్టి సునీల్ యాదవ్ వివేకా తలపై దాడి చేసి హత్య చేశాడని తెలిపారు.

దస్తగిరి అప్రూవర్ గా అనుమతించడాన్ని సవాల్ చేస్తూ బాస్కరరెడ్డి వేసిన పిటిషన్ పై జరిగిన విచారణ సందర్భంలో ఆయన తరపు న్యాయవాది ఈ వాదనలు వినిపించారు. అలాగే ఈ కేసులో ఎస్పీ రాంసింగ్ వ్యవహారంపై సుప్రీం కోర్టుకు వెళ్లారనీ, రాంసింగ్ వ్యక్తిగతంగా టార్గెట్ చేసి తన భర్తను ఇరికిస్తున్నారంటూ శివశంకర్ రెడ్డి భార్య తులసమ్మ వాదనలు వినిపించిందనీ, దీంతో రామ్ సింగ్ వ్యవహారంపై అనుమానాలు రావడంతో కొత్త ఐవోను నియమించారని చెప్పారు.

కొత్తగా నియమించిన సిట్ వివరాల ఆర్డర్ కాపీ ఉందా అని వాదనలు విన్న న్యాయస్థానం ప్రశ్నించగా నూతనంగా నియమించిన సీబీఐ సిట్ టీమ్ అధికారుల వివరాలను పిటిషనర్ తరపు న్యాయవాది ధర్మాసనానికి ఇచ్చారు. గుగుల్ టేక్ ఔట్ ను ఆధారంగా చేసుకుని ఎలా తమను కేసులో పెడతారని ప్రశ్నించారు. సీబీఐ, సునీత కలిసిపోయి దస్తగిరిని అప్రూవర్ గా మార్చారని ఆరోపిస్తూ వాదనలు వినిపించారు. తదుపరి విచారణను కోర్టు గురువారంకు వాయిదా వేసింది.
ప్రభుత్వ పాఠశాల విద్యార్ధులకు మరో వరం ‘టోఫెల్’