NewsOrbit
బిగ్ స్టోరీ

కశ్మీర్‌లో అంతర్గత వలసవాద ప్రయోగాలు!

భారత రాజ్యాంగంలో తాత్కాలిక ఏర్పాటుగా చేర్చిన జమ్మూ కశ్మీర్‌కు ప్రత్యేక హోదా అనే భయంకర వికారాన్ని తొలగించాల్సిందే అని ప్రధాన మంత్రి, హోం శాఖ మంత్రి ఇద్దరూ పట్టుబట్టారు. కశ్మీర్ భారతదేశంలో అంతర్భాగం కాబట్టి మిగతా రాష్ట్రాలకి వర్తించేవే దీనికీ వర్తిస్తాయి అని వాళ్ళ ఉవాచ.

ఆర్టికల్ 370ని రద్దు చెయ్యటం ద్వారా కశ్మీర్ ని మిగతా రాష్ట్రాలతో సమాన స్థాయికి తీసుకొచ్చామని వాళ్ళు వాదిస్తున్నారు. ఈ క్రమంలో వాళ్ళు ఒక ప్రామాణిక వలసవాద వ్యూహాన్ని అమలు చేశారు: వలస పాలిత ప్రాంతాన్ని ప్రత్యేకంగా పరిగణించకుండా ఉండటాన్ని సమర్ధించుకోవడానికి వలస దేశంలో ఉన్న శాసనాలనే పాలిత ప్రదేశంలో అమలు చెయ్యటం.

ఆర్టికల్ 370, ఆర్టికల్ 371లని భారత రాజ్యాంగంలో చేర్చటానికి కొన్ని నిర్దిష్ట కారణాలు ఉన్నాయి. ఈ అధికరణల తాత్కాలిక ప్రత్యేక సదుపాయలకి కారణం కేవలం జమ్మూ కశ్మీర్ మాత్రమే కాదు. జూన్ 1947లో మౌంట్ బాటన్ తన దేశ విభజన ప్రణాళికను ప్రకటించినప్పుడు ట్రావెన్‌కోర్, హైదరాబాద్, భోపాల్ లాంటి పెద్ద సంస్థానాలు ఇటు భారతదేశంలోనూ, అటు పాకిస్థాన్‌లోనూ చేరకుండా స్వతంత్ర సార్వభౌమ రాజ్యాలుగా కొనసాగేందుకు ఆలోచనలు చేస్తున్నాయి. మౌంట్‌బాటన్ దీనిని గట్టిగా వ్యతిరేకించారు. భారతదేశం లేదా పాకిస్థాన్‌లో విలీనం కోసం నిబంధనల మీద ఒక్కొక్క సంస్థానంతో తీవ్రమైన చర్చలకి ఇది దారితీసింది. తమ సార్వభౌమ అధికారాలు కోల్పోతాము అనే సంస్థానాల భయాన్ని తొలగించడానికి కేవలం మూడు అంశాలకు సంబంధించిన (భారతదేశం లేదా పాకిస్థాన్ ప్రభుత్వాల) చట్టాలు మాత్రమే ఈ సంస్థానాలలో అమలు అవుతాయి అని ప్రకటించడం జరిగింది. అవి రక్షణ, సమాచారం, విదేశీ వ్యవహారాలు. మిగతా అంశాలకు సంబంధించి ఈ సంస్థానాలు ఏ దేశంలో విలీనం అయితే ఆ దేశంతో తమకి నచ్చిన విధంగా ఒప్పందం చేసుకోవచ్చు అని ప్రకటించడం జరిగింది.

భారతదేశంలో విలీనం అవ్వటానికి అంగీకారం తెలిపిన సంస్థానాల మొదటి విలీన ఒప్పందానికి సంబంధించిన షరతులు ఇవి. ఈ సంస్థానాలు ఐదు వందలకు పైచిలుకే ఉన్నాయి. అయితే ఇందులో చాలా వాటిని కలిపి సౌరాష్ట్ర, మధ్య భారత్, ట్రావెన్ కోర్-కొచ్చిన్, రాజస్థాన్, పాటియాలా, తూర్పు పంజాబ్ లాంటి నాటి రాష్ట్ర యూనియన్లను ఏర్పాటు చేశారు. అలాగే చిన్న సంస్థానాలను  పొరుగు రాష్ట్రాలలో కలిపివేశారు. సంస్థానాధీశులు రాజ్ ప్రముఖ్‌లుగా మారారు. ప్రధాన మంత్రి  అధినేతగా మంత్రివర్గాలు ఏర్పాడ్డాయి. అప్పటికి ఢిల్లీలో రూపొందుతున్న భారత రాజ్యాంగాన్ని తమ రాష్ట్రంలో ఎంత వరకు అమలు చెయ్యదలుచుకున్నారో నిర్ణయించుకోవడానికి ఈ రాష్ట్రాలు తమ సొంత రాజ్యంగ పరిషత్‌లను ఏర్పాటు చేసుకోవాల్సిఉండింది. సంస్థానాల విలీనానికి ఒక ప్రజారంజక ఆమోదాన్ని నిర్మించడం కోసం, అలాగే ఈ సంస్థానాధీశుల కోరికలను అదుపులో ఉంచేందుకు ఈ ప్రజామోదాన్ని వాడుకోవటానికి నాటి భారతదేశ రాజకీయ నాయకత్వం ఈ చర్యలు చేపట్టింది.

మౌంట్‌బాటెన్, వల్లభాయి పటేల్ వాగ్దానాలు, బెదిరింపులు, అలాగే పటేల్ కుడిభుజం వి.పి.మీనన్ దౌత్యం అన్ని కలగలిసి, ఉదారమైన రాజభరణానికి బదులుగా దాదాపుగా అన్ని సంస్థానాలని భారతదేశంలో విలీనం చేసేందుకు సంస్థానాధీశులను ఒప్పించాయి.  కథియవార్ ప్రాంతంలో చిన్న రాజ్యమైన జునాఘడ్ విలీనం విషయంలో సమస్య తలెత్తింది. ఆ సంస్థానంలో ప్రజలు అత్యధికులు హిందువులు. అయితే ఆ సంస్థానం నవాబు పాకిస్థాన్‌లో కలవటానికి నిర్ణయించుకున్నాడు. స్థానిక కాంగ్రెస్ కార్యకర్తలు విజయవంతంగా తిరుగుబాటు చేసి తిరుగుబాటు ప్రభుత్వం ఏర్పాటు చేశారు. వీరికి భారతదేశ సైన్యం సహకరించింది. దీంతో జునాఘడ్ నవాబు తన దివాను షా నవాజ్ భుట్టో (జుల్ఫీకర్ ఆలీ భుట్టో తండ్రి)ను సంస్థానంలో ఉంచి పాకిస్థాన్ పరారయ్యాడు. ఆ దివాను విలీన ఒప్పందం గురించి భారతదేశంతో చర్చలు జరిపాడు. జునాఘడ్‌లో ప్రజాభిప్రాయ సేకరణ జరపగా 99 శాతం భారతదేశంలో ఉండటానికి మొగ్గు చూపారు.

హైదారాబాద్ నిజాం నవాబు ఒక సంవత్సరం పాటు ఎటూ తేల్చకుండా నెట్టుకు రాగలిగాడు. భారత్-పాకిస్థాన్ ఇద్దరినీ ఒకరి మీదకి ఒకరిని ఉసిగొల్పి తాను స్వతంత్రంగా ఉండగలనని నమ్మాడు. హైదరాబాద్ సంస్థానంలో ప్రజాభిప్రాయ సేకరణ జరపాలన్న భారతదేశ డిమాండ్‌కు అంగీకరించలేదు. హైదారాబాద్ సంస్థానంలో 85 శాతం మంది హిందువులే. కాబట్టి రిఫరెండం ఫలితం ఎలా ఉంటుందో అతనికి తెలుసు. ఒకానొక సమయంలో భారత ప్రభుత్వం దేశంలో ఉన్న ఏదో ఒక నౌకాశ్రయం వరకు రైల్వే లైను, హైదరాబాద్ రాజ్యంగ పరిషత్ లో ముస్లింలకు 45 శాతం రిజర్వేషను, తన సొంత సైన్యం ఉంచుకోవటానికి అవకాశం నిజాంకు ఇవ్వజూపింది. జమ్మూ కశ్మీర్‌కి ఇచ్చినదాని కంటే ఇది చాలా ఎక్కువ.  అయితే అప్పటికే నిజాం ఉస్మాన్ ఆలీ రజాకార్ల నాయకుడు అయిన మత ఛాందసవాది, కాశీం రజ్వీ చేతిలో కీలు బొమ్మ అయిపోయాడు. హైదరాబాద్‌ను పాకిస్థాన్‌లో కలపాలన్నది రజ్వీ ఆంకాంక్ష.

మంచి మాటలు ఏవీ వినకుండా హైదరాబాద్ నిజాం భారతదేశం ప్రతిపాదనని తిరస్కరించాడు. చివరికి సెప్టెంబర్, 1948లో జిన్నా చనిపోయిన రెండు రోజులకి వాయుసేన బాంబర్ల సహకారంతో భారతదేశం సైన్యం  హైదరాబాద్ మీద దండెత్తింది. నిజాం సైన్యం చాలా తొందరగానే లొంగిపోయింది. హైదరాబాద్ భారతదేశంలో విలీనం అయ్యింది. ఇరు సేనల మధ్య యుద్ధం అయితే పెద్దగా జరగలేదు కాని భారత సైన్యం రాక మత కల్లోలాలకి దారి తీసింది. దీన్ని మొదలుపెట్టింది రజాకార్లు. అయితే హిందువులు కూడా ఎదురుదాడికి దిగారు. హైదరాబాద్ సంస్థానం భారతదేశంలో విలీనం అవ్వటానికి ఎటువంటి రాజకీయ ఒప్పందం జరగలేదు. ఇది కేవలం సైనిక స్వాధీనం. అందుకనే అక్కడ ప్రజాభిప్రాయ సేకరణ కానీ, రాజ్యంగ పరిషత్ కానీ ఏమి లేవు. హైదరాబాద్ సంస్థానాన్ని ఒక సైనిక గవర్నర్ పాలనలో పెట్టారు.

జమ్మూ కశ్మీర్‌లో మహారాజు హరి సింగ్ విలీనం ఒప్పందం మీద 1947 అక్టోబర్‌లో పెట్టిన సంతకం, కశ్మీర్ లో భారతదేశ సైన్యం సైనిక చర్య ఐక్యరాజ సమితి నేతృత్వంలో 1949 జనవరి నాటి కాల్పుల విరమణకు దారి తీశాయి.  ఈ మధ్యలో ఒక రాజకీయ ఒప్పందం జరిగింది. దాని ప్రకారం షేక్ అబ్దుల్లాని ప్రధాన మంత్రిగా మహారాజు నియమించాడు. అలాగే రాజ్యంగ పరిషత్‌ని ఏర్పాటు చెయ్యడానికి ఒప్పుకున్నాడు. విలీనం ఒప్పందాన్ని “ప్రజల అభీష్టం” మేరకు ధృవీకరిస్తామని భారత్, పాకిస్థాన్ రెండూ మాట ఇచ్చాయి. తరువాత దీనిని భద్రతా మండలి కూడా ఆమోదించింది. విలీనానికి సంబంధించిన ఈ రాజ్యంగ షరతులు ఏవీ జమ్మూ కశ్మీర్‌కి మాత్రమే ప్రత్యేకం కావు.

1949 మధ్యలో ఢిల్లీలో రాజ్యంగ రచన ముగింపు దశకి చేరుకున్న నాటికి సౌరాష్ట్ర, ట్రావెన్ కోర్-కొచ్చిన్, మైసూరు, జమ్మూ కశ్మీర్ మాత్రమే తమ తమ రాజ్యంగ పరిషత్‌లను ఏర్పాటు చేసుకున్నాయి.

భారత ప్రభుత్వం అభ్యర్ధన మేరకు రాజ్యంగ నిపుణుడు బి.ఎన్. రావు ఈ రాష్ట్రాల కోసం ఒక నమూనా రాజ్యాంగాన్ని రచించారు. అయితే దీనికి పెద్ద ఆమోదం ఏమి దక్కలేదు. చివరకి ఈ రాష్ట్రాలకు- పార్ట్ బి రాష్ట్రాలు అనేవారు వీటిని- సంబంధించిన రాజ్యాంగ అంశాలు అన్నిటినీ భారత రాజ్యాంగంలో పొందుపరచాలని నిర్ణయించారు.

అప్పటికి సౌరాష్ట్ర రాజ్యంగ పరిషత్ భారత్ రాజ్యాంగాన్ని పూర్తిగా ఆమోదించి తనంతట తానే రద్దయిపోయింది. జనవరి, 1950 నాటికి భారత రాజ్యాంగం అమలులోకి వచ్చింది. అప్పటికి కేవలం మూడు రాష్ట్రాల రాజ్యంగ పరిషత్ లు మాత్రమే ఉన్నాయి. వాటి పని అప్పటికి ఇంకా పూర్తవ్వలేదు. ఆ కారణంగా జమ్మూ కశ్మీర్ రాజ్యంగ పరిషత్ తన సొంత రాజ్యాంగం రూపొందించుకునేవరకు భారత ప్రభుత్వం- జమ్మూ కశ్మీర్ మధ్య సంబంధాల కోసం ఆర్టికల్ 370ని భారత రాజ్యాంగంలో చేర్చారు.

ఆర్టికల్ 371 కూడా ఇటువంటి తాత్కాలిక అధికరణే. దీని కాల వ్యవధి పది సంవత్సరాలు. పార్ట్ బి రాష్ట్రాలలో భారత ప్రభుత్వం వారి ఏ చట్టాలు అమలు అవుతాయో, కావో ఈ అధికరణ ద్వారా కేంద్ర ప్రభుత్వం రాష్ట్రపతి ఆదేశం ద్వారా ప్రకటిస్తుంది. ఈ అధికరణని పొందుపరచడానికి ముఖ్య కారణం అప్పటికి ఇంకా మైసూరు, ట్రావెన్ కోర్-కొచ్చిన్ రాజ్యంగ పరిషత్ లు భారత రాజ్యాంగాన్ని ఆమోదించక పోవడం.

1952 సాధారణ ఎన్నికలలో అన్ని పార్ట్ బి రాష్ట్రాలలో కాంగ్రెస్ పార్టీ అధికారాన్ని కైవసం చేసుకుంది. దానితో ట్రావెన్ కోర్-కొచ్చిన్, మైసూరు రాజ్యంగ పరిషత్ లు భారత రాజ్యాంగాన్ని ఆమోదించి తమంతట తాము రద్దయ్యాయి. కాబట్టి 1952 నుండి ఆర్టికల్ 371, వి.పి. మీనన్ మాటల్లో చెప్పాలంటే, “మృత పత్రం”. అయితే జమ్మూ కశ్మీర్ లో నేషనల్ కాన్ఫరెన్స్ అధికారంలో ఉండింది. తొందరలోనే షేక్ అబ్దుల్లాకి ఢిల్లీ పాలకులతో చెడింది. దానితో ఆయన్ని గద్దె దించి అరెస్ట్ చేశారు. అబ్దుల్లా మంత్రివర్గ సభ్యుడు బక్షి గులాం మొహమ్మద్ ప్రధాన మంత్రి అయ్యాడు. తరువాత కాంగ్రెస్ పార్టీలో చేరాడు. 1956లో జమ్మూ కశ్మీర్ రాజ్యంగ పరిషత్ జమ్మూ కశ్మీర్ రాజ్యాంగాన్ని రచించి తనంతట తానే రద్దయ్యింది.

దీనితో భారత రాజ్యాంగంలో 370 అధికరణ ఒక శాశ్వత అధికరణ అయిపోయింది, ఏ అధికారం దీన్ని మార్చలేదు అన్నది న్యాయ కోవిదులలో ఒక వర్గం అభిప్రాయం. ఇప్పుడు ఇక జమ్మూ కశ్మీర్ రాజ్యంగ పరిషత్ లేదు కాబట్టి 370 అధికరణకి ఎటువంటి మార్పులు చేర్పులు చేసినా జమ్మూ కశ్మీర్ శాసనసభ ఆమోదం తప్పనిసరి అని మిగిలినవారి అభిప్రాయం. ఏది ఏమైనా జమ్మూ కశ్మీర్ రాష్ట్రానికి మిగతా భారతదేశానికి మధ్య సంబంధాలు అభివృద్ధి చెందటంలో కశ్మీరీ ప్రజల ఆమోదం ఎంతో కొంత అవసరం అనేదానికి ఆర్టికల్ 370 ఒక సాక్ష్యం. ప్రజాభిప్రాయ సేకరణ జరుపుతామన్న హామీ అమలు కాలేదు కాబట్టి దీనికి మరింత ప్రాధాన్యత ఉంది.

అదే సమయంలో దేశంలో వివిధ ప్రాంతాలలో తరుచుగా రాజకీయ ఆందోళనలు చోటు చేసుకుండటంతో ఆయా రాష్ట్రాల కోసం ప్రత్యేక రాజ్యాంగ నియమాలు అమలులోకి వచ్చాయి. ఈ రాజ్యాంగ నియమాలు ఆయా రాష్ట్రాలకి-కేంద్రానికి నడుమ సంబంధాలకి సంబంధించినవి. దీని కారణంగా ఆర్టికల్ 371 కొనసాగుతూ వచ్చింది. దీని కారణంగా విదర్భ, మరాఠ్వాడా, కచ్ కోసం ప్రత్యేక అభివృద్ధి మండళ్ళు ఏర్పాటు చేసుకునే అవకాశం మహారాష్ట్ర, గుజరాత్ రాష్ట్రాలకి లభించింది. మతం, నాగా ప్రజల సామాజిక కట్టుబాట్లు, సాంప్రదాయ చట్టం, భూ యాజమాన్యానికి సంబంధించి రాష్ట్ర శాసనసభ ఆమోదం లేనిదే కేంద్ర చట్టాలు ఏవీ నాగాలాండ్‌లో చెల్లవు. అటువంటి ప్రత్యేక నిబంధనలే మిజోరంలో కూడా ఉన్నాయి. అస్సాం, మణిపూర్, అరుణాచల్ ప్రదేశ్, సిక్కిం, గోవా రాష్ట్రాలలో కూడా ఇటువంటి ప్రత్యేక నిబంధనలు ఉన్నాయి. ఈ రాష్ట్రాలలో అమలులో ఉన్న ప్రత్యేక నిబంధనలు ఏవీ దేశంలోని మిగతా రాష్ట్రాలకి వర్తించవు.

1975లో ఆత్యయిక స్థితి కాలంలో భారత దేశ సైన్యం సిక్కిం ని భారతదేశంలో విలీనం చేసినప్పుడు సిక్కిం కి ‘అసోసియేట్ రాష్ట్రం’ హోదాని ఇచ్చిన విషయం కొద్ది  మందికి జ్ఞాపకం ఉండుంటుంది. ఈ హోదా చాలా విలక్షణమైనది. ఇంకే రాష్ట్రానికి, ఏ నాడూ ఇటువంటి హోదా ఇవ్వలేదు. తరువాత సిక్కిం ప్రజలు ప్రజాభిప్రాయ సేకరణలో రాచరిక వ్యవస్థ రద్దునూ, విలీనాన్నీ ఆమోదించిన తర్వాత సిక్కిం రాష్ట్రం భారతదేశంలో సాధారణ రాష్ట్రం అయ్యింది. దీని బట్టి మనకి తెలుస్తుంది ఏమిటంటే దేశం అంతా చట్టబద్ద ఏకరూపత ఉండాలి అని కోరుకున్నా కూడా దేశంలోని వివిధ ప్రాంతాల ప్రజలు వివిధ రాజకీయ పరిస్థితుల నడుమ దేశంలో భాగం అయినందున భారత రాజ్యానికి ఇచ్చిపుచ్చుకోగల సమాఖ్య స్ఫూర్తి అవసరం ఉంది. అది లేకపోతే, రాజ్యం ఆధిపత్య బలం ద్వారా మాత్రమే ప్రజల ఆమోదం పొందగలదు.

ఇది జమ్మూ కశ్మీర్ విషయంలోనే చాలా స్పష్టంగా , విషాదకరంగా రుజువయింది. గత ఐదు దశాబ్దాలలో కీలు బొమ్మ ప్రభుత్వాల మద్దతుతో, రిగ్గింగ్ చేసిన ఎన్నికల ద్వారా, ప్రజాబాహుళ్య మద్దతుతో నడిచిన తిరుగుబాటు, సైనిక అణిచివేత, ఉగ్రవాదం మధ్య రాష్ట్రపతి ఆదేశాల ద్వారానో, జమ్మూ కశ్మీర్ శాసనసభ ఆమోదంతోనో ఆర్టికల్ 370ని నీరు కారుస్తూ వచ్చారు. గత ఐదు దశాబ్దాలలో ఎక్కువ భాగం కేంద్రంలో అధికారం చలాయించిన కాంగ్రెస్ ప్రభుత్వం దీనికి ముఖ్య కారణం. కశ్మీర్ అంశం అనేది పాకిస్థాన్-ఇండియా మధ్య వివాదం కావటం వల్ల విదేశీ విధానం, రక్షణ విషయాలే కేంద్రంలో అధికారంలో ఉన్న వారి ఆలోచనను నిర్దేశించాయి. కశ్మీర్ ప్రజల అభీష్టం లెక్కలో లేకుండా పోయింది.

ఢిల్లీలో ఉన్న నిర్ణేతలు పెంచి పోషించిన ఈ ఆలోచనా విధానం ఈ నాడు భారత దేశంలో సామాన్య ప్రజల ఆలోచన విధానంగా తయారయ్యింది.  కశ్మీర్ అనేది భారతదేశం ఆస్థి అని- పాకిస్థాన్ ఆక్రమించాలి అని చూస్తున్న విలువైన రియల్ ఎస్టేట్ సొత్తు- కశ్మీరీలు పెద్ద న్యూసెన్స్ అని, వాళ్ళకి తగిన రీతిలో బుద్ధి చెప్పాలి అని ఈ నాడు దేశంలోని సామాన్య జనం భావిస్తున్నారు. ఏదో అప్పుడప్పుడు ప్రజాస్వామ్యం పేరు మీద స్థానిక నాయకులతో చర్చలు జరపటం, కశ్మీరియత్ కి కట్టుబడి ఉన్నాము అని చెబుతూ ఉంటే సరి. అయితే కశ్మీర్‌లో ఎల్లప్పుడూ ఆత్యయిక స్థితి ఉండాలి, సైన్యం అక్కడ శాశ్వతంగా తిష్ట వేయడం అన్నది చాలా సాధారణ విషయం అయిపోయింది. ఇప్పుడు ఢిల్లీలో అధికారం వెలగబెడుతున్న ప్రభుత్వం జాతీయవాద భావజాలం మళ్ళీ ఊపు అందుకోవటంతో నామమాత్రంగా ఉన్న ఆ పాటి ముసుగులనూ వదిలేసింది.

పాత రోజుల్లో బ్రిటన్, ఫ్రాన్స్ లాంటి సామ్రాజ్యవాద దేశాలలోని ఉదారవాద ప్రభుత్వాలు తమ దేశంలో ప్రజాస్వామ్యం, పాలిత దేశంలో నిరంకుశ పాలన అనే ద్వంద్వ విధానాన్ని అమలు చేసేవి. ప్రజాస్వామ్యం అన్నిటికన్నా శ్రేష్టమైన పాలన అని చెబుతూనే, పాలిత ప్రజలు ప్రజాస్వామ్య పాలనకి ఇంకా సిద్ధంగా లేరు కాబట్టి వాళ్ళకి అధిరాజ్యమే సరైనది అని చెప్పేవారు. ఈ పాలిత ప్రజలు స్వాంతంత్ర్యానికి సంబధించిన హక్కులు అనుభవించే ముందు వికాసం చెందిన నిరంకుశ పాలన రుచి చూడాలి అని వీరి నమ్మకం. ఇప్పుడు కశ్మీర్‌లో అమలవుతున్న తీవ్ర నిర్బంధం గురించి బిజెపి నాయకులూ చెబుతున్న మాటలు ఇవే. అక్కడ పరిస్థితులు కఠినంగానే ఉన్నాయి అయితే అది కశ్మీరీల మంచి కొరకే అనేది వీరి ఉవాచ.

జాతీయవాదం అనే మాటకు ఇండియాలో అర్ధం మారడాన్ని ఈ మాటలు సూచిస్తున్నాయి. యాభయి ఏళ్ళ క్రిందట జనాలకి ఉన్న అవగాహన ఈ రోజు ఉన్న అవగాహన మధ్య తేడాను తెలియచేస్తున్నాయి. యాభై సంవత్సరాల క్రిందట భారత దేశ జాతీయవాదం ప్రాధమికంగా వలస పాలన వ్యతిరేక జాతీయవాదం. పాశ్చాత్య సామ్రాజ్యవాద దేశాలు కొనసాగిస్తున్న వలస పాలన దోపిడీకి, వివక్షకి వ్యతిరేకంగా పోరాడుతున్నాము అనే భావన ఆనాడు ఉండేది. అలాగే ఆఫ్రికాలోనూ, ఆగ్నేయ ఆసియాలోనూ చోటు చేసుకుంటున్న స్వాతంత్ర్య పోరాటాలకి సంఘీభావంగా భారతదేశం నిలిచేది. అయితే ఇప్పుడు ప్రపంచ అగ్ర రాజ్యాలలో తానొకటి అని భారతదేశం భావిస్తున్నది. జింబాబ్వే, సుడాన్, పాలస్తీనా ప్రజలతో మనకి సారూప్యత ఎముంది? అంతెందుకు, మిగతా అగ్ర రాజ్యాల లాగే మనకి కూడా కశ్మీర్ అనే వలస దేశ సమస్య ఉంది. ఆ సమస్యని ఇంతకుముందు ప్రభుత్వాలు చెయ్యటానికి సాహసించని రీతిలో నిర్దాక్షణ్యంగా ఇప్పుడు మనం పరిష్కరిస్తాం. ఇదీ ఇప్పటి వరస.

బిజెపి ప్రభుత్వం ఇప్పుడే ఆర్టికల్ 370ని ఎందుకు రద్దు చేసి, జమ్మూ కశ్మీర్ రాష్ట్రాన్ని తన ప్రత్యక్ష పాలనలోకి  తెచ్చుకుంది అనే దాని మీద చాలా ఊహాగానాలు ఉన్నాయి. ఆఫ్ఘనిస్తాన్‌లో తాలిబాన్‌, అమెరికా మధ్య ఒప్పందం తుది దశకి చేరుకుంది. ఈ ఒప్పందం కుదిరితే అది పాకిస్థాన్‌కి వ్యూహాత్మకంగా లాభం చేకూరుస్తుంది. దాన్ని దృష్టిలో పెట్టుకునే ఇప్పుడు ఈ నిర్ణయం తీసుకుని ఉండవచ్చు. కశ్మీర్ రాజకీయ ముఖచిత్రాన్ని మార్చివేయడం, రియల్ ఎస్టేట్ అభివృద్ధి, అక్కడి జన విస్తరణ చిత్రం మార్పు కోసం ప్రణాళికలు రచిస్తూ ఉండవచ్చు. అయితే ఇవన్నీ సఫలం అవ్వటానికి చాలా సంవత్సరాలే పడుతుంది. లేదా విపక్షాల మధ్య ప్రస్తుతం నెలకొని ఉన్న అమోమయం, అనైక్యత ఈ బిల్లుని ఉభయ సభలలో ఆమోదింప చెయ్యటానికి పురిగొల్పి ఉండొచ్చు. ఈ చర్య చట్టబద్దత రానున్న రోజుల్లో తప్పక న్యాయ విచారణకి వస్తుంది. అయితే ఈ చర్య రాజకీయ పర్యవసానాలు భారతదేశ ప్రజలకి ఆందోళన కలిగించేవే కావు, చాలా ఆపద కలిగించేవి కూడా.

మొదటగా, కేంద్రానికి రాష్ట్రాలకి మధ్య సమాఖ్య సంబంధాల ప్రాధమిక చట్రాన్ని సూచిస్తున్న ఒక రాజ్యంగ నిబంధనను  ఆ రాష్ట్ర ప్రజా ప్రతినిధులతో, ప్రజలతో చర్చించకుండా ఒక ఎక్జిక్యూటివ్ ఆదేశం ద్వారా, పార్లమెంట్‌లో సాధారణ మెజారిటీతో తొలగించడం అనే ఒక సాంప్రదాయానికి నాంది పలికారు.

రెండవది, ఒక రాష్ట్రాన్ని ఆ రాష్ట్ర ప్రజలు, ప్రజా ప్రతినిధుల ఇష్టా ఇష్టాలతో సంబంధం లేకుండా విభజించే హక్కు కేంద్ర ప్రభుత్వానికి దాఖలు పడింది.

మూడవది, సమాఖ్య భాగాలను ఒక సమాఖ్యలో అనుసంధానించే సాధారణ ప్రక్రియకి పూర్తి వ్యతిరేకంగా, రాజ్యాంగం మొదలయిన నాటినుంచీ రాష్ట్రంగా ఉన్న ఒక రాష్ట్రం హోదాను కేంద్ర పాలిత ప్రాంతంగా తగ్గించారు. దానికి చెప్పిన కారణం అభివృద్ధి, ప్రజాస్వామ్యం కోసం అని. వలసవాద ఆలోచనా ధోరణికి ఇంతకన్నా మంచి ఉదాహరణ లేదు.

సమాఖ్య స్పూర్తికి ఈ చర్య ఏ విధంగా హాని చేస్తుందో అని ఆందోళన పడవలసిన పార్టీలూ, రాజకీయవేత్తలు కూడా మౌనంగా ఉండటం చాలా బాధాకరమైన విషయం. ఈ ఆక్రమిత జాతీయవాదం అనేది కశ్మీర్‌తో ఆగదు. ఒక ఏకరూప జాతీయతకి అడ్డు వచ్చే ఏ మైనారిటీ అస్థిత్వం అయినా సరే-  భాష కానీ, మతం కానీ, కులం కానీ, లింగం కానీ- దాడికి గురవ్వటం ఖాయం. కేవలం హిందీ భాష మాట్లాడే అగ్ర కుల హిందూ పురుషుడికే తన భారతీయత  నిరూపించుకోవాల్సిన అవసరం ఉండదు, మిగతా అందరు ఎప్పుడూ నిరూపించుకుంటానే ఉండాలి.

పాత వలసవాదానికి ఇప్పుడు అంతర్జాతీయంగా ఆమోదం లేదు. దాన్ని అందరూ వ్యతిరేకిస్తారు. అయితే ఈ అంతర్గత వలసవాదం దేశీయ సమస్య, దీనికి నియమ-నిబంధనలు అటూ ఏమీ ఉండవు. అంతర్గత వలసవాదానికి రాజ్యంగ నియమాలు రూపొందించే దిశగా భారతదేశం పయనిస్తున్నదా? దురదృష్టవశాత్తు ఈ అంతర్గత వలసవాదానికి తదుపరి బలవ్వబోయే బాధితులకు ఇది పట్టడం లేదు.

పార్ధా చటర్జీ

వ్యాసకర్త సామాజిక శాస్త్రవేత్త, చరిత్రకారుడు

‘ద వైర్’ వెబ్‌సైట్ సౌజన్యంతో

Related posts

Telangana Lok Sabha Elections 2024: ఆ మూడు స్థానాల్లో కొనసాగుతున్న సస్పెన్స్ .. మరో సీఎం రేవంత్ హస్తినకు పయనం

sharma somaraju

ర‌ఘురామ సీటుకు ఎర్త్ పెడుతోందెవ‌రు… పాపం ఏమైపోతాడో …!

ఈ టీడీపీ సీనియ‌ర్ లీడ‌ర్‌కు టిక్కెట్‌…. మంత్రి ప‌ద‌వి కావాలి.. అయినా బాబు కంటే జ‌గ‌నే ఇష్టం…!

బొత్స త‌న భార్య ఝాన్సీని విశాఖ ఎంపీని చేస్తాడా.. చేతులెత్తేస్తారా…?

Chandrababu: ఢిల్లీ వెళుతున్న టీడీపీ అధినేత చంద్రబాబు .. అమిత్ షాతో కీలక భేటీ..? ఎన్డీఏలో చేరికకు మార్గం సుగమం అయినట్లే(గా)..!

sharma somaraju

YSRCP: ప్రత్యర్ధులకు అందని జగన్ వ్యూహం .. ఎంపీ ఆర్ఆర్ఆర్ కు ప్రత్యర్ధిగా మహిళా అడ్వకేట్ ఉమాబాల .. ఎవరీ ఉమాబాల..?

sharma somaraju

TDP: ఆ వాగ్ధాటి ఉన్న నేతకు టీడీపీలో టికెట్ టెన్షన్ .. బాబు గారు ఎక్కడ సర్దుబాటు చేస్తారో..!

sharma somaraju

JD Lakshminarayana: జేడీ కంఠశోష .. జగన్, చంద్రబాబుకు జేడీ కీలక సూచన

sharma somaraju

TDP – Janasena: చంద్రబాబు, పవన్ కళ్యాణ్ కు పెద్ద తలనొప్పిగా మారిన కడప అసెంబ్లీ సిగ్మెంట్ .. టీడీపీ కా ..? జనసేనకా..? మాధవి రెడ్డి వర్సెస్ సుంకర శ్రీనివాస్

sharma somaraju

YSRCP: ఎంపీ వద్దు .. ఎమ్మెల్యే సీటు ముద్దు.. వైసీపీ నేతల వేడుకోలు

sharma somaraju

YSRCP – Allagadda: ఆళ్లగడ్డలో అఖిలప్రియకు పోటీగా అవంతి ..? ఎవరీ అవంతి..?  

sharma somaraju

YS Sharmila: ఏపీలో వైఎస్ షర్మిల ఆపరేషన్ స్టార్ట్స్ .. రేపే పీసీసీ బాధ్యతల స్వీకరణ .. వెంటనే ఆ ఇద్దరు సిట్టింగ్ ఎమ్మెల్యేలు చేరిక..?

sharma somaraju

Janasena TDP: జనసేనలోకి మాజీ మంత్రి కొణతాల ..? అయ్యన్న ఆశలపై నీళ్లు..!

sharma somaraju

TDP Vs Janasena: టీడీపీకి బిగ్ ఝలక్ .. తిరగబడుతున్న తెనాలి తెలుగు తమ్ముళ్లు

sharma somaraju

YSRCP Vs TDP: ముందరి కాళ్లకు బంధం అంటే ఇదే కదా..? సంకటంలో టీడీపీ..!

sharma somaraju

Leave a Comment