NewsOrbit
బిగ్ స్టోరీ

దిగ్బంధంలో ‘మామూలు’ జీవితం!

జమ్మూ కశ్మీర్ బయట నివసిస్తున్న నా సోదరుడి నుండి చివరిసారిగా ఆగస్ట్ 4 సాయంత్రం నాడు నాకు వాట్స్‌ఆప్ లో సందేశం వచ్చింది. తన గొంతులో ఆందోళన ధ్వనించింది. ప్రభుత్వం అధికారికంగా నిర్ణయం తీసుకోకముందే ఆన్‌లైన్‌లో ప్రభుత్వ ఆదేశాలు లీకు అవ్వటంతో ఎటు చూసినా అనిశ్చితి, భయం, గాభరా. “కనీసం ఇరవై రోజులకి సరిపడా సరుకులని ఇంట్లో పెట్టుకో” అని చెప్పాడు.

ఈ సందేశానికి నేను సమాధానం ఇచ్చే లోపలే ఇంటర్నెట్ సదుపాయం కట్ అయింది. లాండ్ లైన్, మొబైల్, బ్రాడ్ బ్యాండ్ సదుపాయాలు అన్నీ తొలగించారు. ఒక్క సారిగా బయట ప్రపంచంతోనూ, మాలో మాకు సంబంధాలు తెగిపోయాయి.

నిరవధిక కర్ఫ్యూ విధించటంతో అందరం ఇళ్లకే పరిమితం అయ్యాం. అలాగే సమాచార సాధనాలు ఏవీ అందుబాటులో లేకపోవడంతో మా చుట్టూ ఉచ్చు మరింతగా బిగిసుకుంది. మా తల్లితండ్రులు ఈ దిగ్బంధనానికి కొద్ది రోజుల క్రితమే హజ్ యాత్రకు వెళ్ళారు. కమ్యునికేషన్ సదుపాయాలు తొలగించాక వారికి మాతో మాట్లాడటం కుదరలేదు. వారితో మేము మాట్లాడి ఇప్పటికి పది రోజులు దాటింది. వాళ్ళు అక్కడ ఎలా ఉన్నారు అనే విషయం నేటికీ మాకు తెలియదు. ఫోన్ సదుపాయాలు తొలగించటంతో ఈద్ రోజున కూడా ఒకరికి ఒకరం శుభాకాంక్షలు చెప్పుకోలేకపోయాము. బయట ప్రపంచంలో ఏం జరుగుతుందో తెలుసుకోవటానికి నాకు ఉన్న ఒకే ఒక మార్గం కొన్ని టీ.వి ఛానళ్ళు. స్థానిక కేబుల్ నెట్‌వర్క్‌ని కూడా మూసేశారు. అయితే మా సెట్ టాప్ బాక్స్ ఎలాగోలా పని చేస్తున్నది.

ఆగస్ట్ 5 నాడు ఉదయం మేల్కొని టి.వి పెడితే తెలిసింది విషయం. ఆర్టికల్ 370ని నీరుకార్చడానికి, రాష్ట్రాన్ని రెండు కేంద్రపాలిత పాలిత ప్రాంతాలుగా విభజించడానికి భారతీయ జనతా పార్టీ ఆకస్మికంగా బిల్లుని పార్లమెంట్‌లో ప్రవేశపెట్టింది అని. ఇదంతా కూడా స్థానిక ప్రజలకి తెలుపకుండా, అందరినీ ఇళ్ళల్లో బంధించి చేసింది.

కర్ఫ్యూ విధించి, ప్రధాన స్రవంతి రాజకీయ నాయకులను, మాజీ ముఖ్యమంత్రులను కూడా నిర్బంధించి తీసుకున్న ఈ ఏకపక్ష నిర్ణయం దిగ్భ్రాంతికి గురి చేసింది. అయితే ఈ ప్రభుత్వం కుటిల ప్రయత్నాలు ఏవో చేస్తున్నదని  గ్రహించిన ఇక్కడి జనాలను ఇదేమి ఆశ్చర్యానికి గురి చెయ్యలేదు. ఏదో జరుగుతున్నది అనే విషయాన్ని గవర్నర్ పలుమార్లు ఖండించాడు. అయితే అధికారికంగా ఆర్టికల్ 370ని నీరుకార్చక ముందే ఆన్‌లైన్‌లో కొన్ని ప్రభుత్వ ఆదేశాలు లీక్ అవ్వటం, అటు తరువాత అమరనాథ్ యాత్రికులని, పర్యాటకులని, బయట రాష్ట్రం విద్యార్ధులని రాష్ట్రం బయటకి తరలించటం ఇవన్నీ ఏదో జరగబోతున్నది అనే సంకేతాలు ఇచ్చాయి.

ప్రధాన స్రవంతి రాజకీయ పార్టీలకు, మెహబూబా ముఫ్తీ, ఫరూక్ అబ్దుల్లా, ఒమర్ అబ్దుల్లా లాంటి ప్రధాన స్రవంతి రాజకీయ నాయకుల విషయానికి వస్తే వారికి తెలియకుండా – వారి అనుమతి తీసుకోవటం సంగతి దేవుడెరుగు- ఢిల్లీ పాలకులు ఊహించరాని పని చేసిపడేశారు. పార్లమెంట్‌లో అమిత్ షా ప్రవేశపెట్టిన కొన్ని గంటలలోనే బిల్లుకు ఆమోదం లభించటంతో ఒక్క దెబ్బతో కశ్మీర్‌లో ప్రధాన స్రవంతి రాజకీయాలు చెల్లని కాణీలు అయిపోయాయి. ప్రధాన స్రవంతి రాజకీయ నాయకులని తక్షణమే గృహ నిర్బంధంలో పెట్టారు. ఈ క్రమంలో పట్టింపుకి నోచుకోని, అవమానానికి గురయ్యిన ప్రధాన స్రవంతి రాజకీయ నాయకులకి ఇచ్చిన సందేశం చాల స్పష్టం- మీ అవసరం ఇంకెంత మాత్రం లేదు. ఢిల్లీకి మీరు ఇక అనవసరం.

ఈ దిగ్భ్రాంతికరమైన సంఘటనలు జరుగుతుండగా దాదాపు అన్ని హిందీ, ఇంగ్లీష్ వార్తా ఛానళ్ళు ఆర్టికల్ 370ని నీరుకార్చడం, రాష్ట్రాన్ని కేంద్రపాలిత ప్రాంతాలుగా విభజించడంపై ప్రభుత్వ భజన చేశాయి. స్థానిక ప్రజలని సంప్రదించకుండా, రాష్ట్ర శాసనసభని సంప్రదించకుండా బిజెపి ప్రభుత్వం ఈ బిల్లుని, తీర్మానాలను ఏకపక్షంగా ఎలా నెత్తిన రుద్దుతుంది లాంటి ప్రశ్నలు ఏమీ లేవదీయలేదు. కొంత మంది యాంకర్లు అయితే ఆర్టికల్ 370ని రద్దు చెయ్యడం జమ్మూ కశ్మీర్‌కే లాభదాయకం అని అజ్ఞానంగా చెబుతూ పాలక ప్రభుత్వంతో బహిరంగంగానే అంటకాగారు.

ఎటువంటి సమాచార సదుపాయాలు లేకుండా కోటికి మందికి పైగా ప్రజలని గృహ నిర్బంధంలో పెట్టారన్న విషయం మీద రిపోర్టింగే చెయ్యలేదు. చేసినా ఎక్కడో ఒక మూలాన వేశారు. రద్దుకి అనుకూలంగా మాట్లాడే మంత్రులకి, వారి ప్రతినిధులకి, బిజెపి, ఆర్ ఎస్ ఎస్ నాయకులకే ఎక్కువ ఎయిర్ టైం కేటాయించారు. రద్దుని వ్యతిరేకించిని వారిని, లేదా లోయలో పూర్తి దిగ్బంధనం గురించి మాట్లాడిన వారిని ఆ కార్యక్రమాలలో గేలి చేశారు, కొట్టి పారేశారు.

ప్రజల మీద ఈ రాజ్యం అమలు చేసిన కర్ఫ్యూ, సమాచార వ్యవస్థల దిగ్బంధం ఏ విధమైన ప్రభావం చూపుతున్నదన్న సంగతి దిగ్బంధనం విధించిన మొదటి రోజుల్లో కవర్ చేసిన వాళ్ళే లేరు. ఆసుపత్రులకు చేరుకోవటానికి వందల మంది రోగులు పడుతున్న ఇబ్బందులు, కనీసం అంబులెన్స్‌లను పిలవటానికి కూడా కుదరని పరిస్థితి గురించి తెలిసిన వాళ్ళే లేరు. దాదాపుగా అన్ని హిందీ, ఇంగ్లీష్ ఛానళ్ళు ఈ రాజ్యంగ వంచనని, అటు పిమ్మట చోటు చేసుకున్న దిగ్బంధనాన్ని ఎదో ఒక సంక్షేమ కార్యక్రమంగా, కశ్మీరీ ప్రజల అభివృద్ధి కోసం తీసుకున్న నిర్ణయంగా ప్రచారం చెయ్యటంలో పూర్తిగా నిమగ్నమయ్యాయి.

కొద్ది మంది కశ్మీరీ పండిట్లు, జమ్మూ, ఢిల్లీ వీధులలో సంబారాలు చేసుకుంటున్న విషయాన్ని చూపించటంలో మాత్రం వార్తా ఛానళ్ళు చాలా వేగంగా కదిలాయి. ఈ చర్యకి వ్యతిరేకంగా లోయలో జరిగిన నిరసనలలో ఒక్కటంటే ఒక్కదాన్ని కూడా కవర్ చెయ్యలేదు. కోటికి పైగా మంది అత్యంత దారుణమైన దిగ్బంధనానికి,  మానవతా సంక్షోభానికి గురవుతుంటే వాళ్ళ బాధలని “ముందస్తు చర్యలు”, “ఆంక్షలు” పేరు మీద కొట్టిపారేశారు. రాజ్యం కథనాన్ని ఎలుగెత్తి ప్రచారం చెయ్యడంలో ప్రధాన స్రవంతి మీడియా చాలా ఉత్సాహం చూపించింది. కశ్మీర్‌లో “సాధారణ పరిస్థితులు” ఎలా తిరిగి వస్తున్నాయో చూపించడంలో కూడా ఎక్కడలేని ఉత్సాహం ప్రదర్శించింది మీడియా.

ఇండియా టుడే నిర్వహణ సంపాదకుడు రాహుల్ కన్వల్ నిర్వహించే ఒక చర్చా కార్యక్రమంలో ఒక ప్యానలిస్ట్ జమ్మూ కశ్మీర్ లో ప్రజలు ఎటువంటి సమాచార సదుపాయం లేకుండా గృహ నిర్బంధంలో ఉన్నారు, వారికి తెలియకుండానే వారికి సంబంధించిన అతి పెద్ద నిర్ణయం తీసుకున్నారు అని గుర్తు చేసినపుడు, “వారికి టి.వి ఉందిగా వార్తలు చూస్తారులే” అని చాల చులకనగా మాట్లాడాడు రాహుల్ కన్వల్.

అదే ఛానల్‌లో అదే యాంకర్ బిజెపి జమ్ము కశ్మీర్ నిపుణుడు రాం మాధవ్‌ను ఇంటర్వ్యూ చేస్తూ, ప్రధాన స్రవంతి రాజకీయ నాయకులను కూడా గృహనిర్బంధంలో ఉంచారని అన్నపుడు,  “ఇది ముందస్తు చర్య. ఇలా జరగటం ఇదే మొదటి సారి కాదు” అని పళ్లికిలిస్తూ అన్నారాయన. వారిని నిర్భందించి, బయటకి వెళ్ళనివ్వకుండా చేసి వారికేదో సహాయం చేస్తున్నట్టు! “గతం లో చాలా సార్లు జరిగింది ఇలా. ఇతర ప్రభుత్వాలు కూడా చేశాయి.”

మరొక రాష్ట్ర బిజెపి నాయకుడు, మాజీ ఉప ముఖ్యమంత్రి ఒక వార్తా ఛానల్‌తో ఎటువంటి హావభావాలు లేని మొఖం పెట్టుకుని మాట్లాడుతూ ఒమర్ అబ్దుల్లా, మెహబూబా ముఫ్తీ లని నిర్భందించలేదు, వారికి “ఏడు నక్షత్రాల సదుపాయాలు” కలిపిస్తున్నారని అన్నారు.

ఇంకొక వార్త ఛానల్ కరెస్పాండంట్ అయితే ప్రభుత్వం తరుపున ప్రచారాన్ని ఒక స్థాయికే తీసుకువెళ్ళాడు. సైనిక హెలికాప్టర్‌లో తిరుగుతూ శ్రీనగర్ పట్టణాన్ని ఆకాశం నుండి కొన్ని ఫోటోలు తీసి “పరిస్థితి సాధారణంగానే” ఉందని చెప్పారు.

పరిస్థితి “సాధారణం” గానే ఉంది అని నిరూపించటానికి చేసిన బహుశా అత్యంత సాహసవంతమైన చర్య జాతీయ రక్షణ సలహాదారుడు అజిత్ దోవల్ దక్షిణ కశ్మీర్ లోని అనంతనాగ్ , షోపియాన్ జిల్లాలలో పర్యటించి, అక్కడ స్థానికులతో “మాటా మంతి” కలిపి, రోడ్డు పక్కన వాళ్ళతో కలిసి ఉపాహారం తినడం. ఆర్టికల్ 370ని నీరుకార్చడం వల్ల వారికి ఎంత లాభమో ఆయన చెప్పుకొచ్చారు. కొన్ని కోట్ల మంది దిగ్బంధంలో ఉంటూ, తమ తమ ఇళ్ళకి పరిమితం అయిపోయిన పరిస్థితులు ఉండగా ఈ  అజిత్ దోవల్ కార్యక్రమం మొత్తాన్ని వీడియో తీసి అంతా బాగుంది అని చెప్పి వార్తా ఛానళ్ళకి ఇచ్చారు. “సాధారణ పరిస్థితులు” తిరిగి వచ్చాయి అని ఈ విధంగా చెప్పటానికన్నా వేరే దౌర్భాగ్యం లేదు.

మాజీ ప్రధానమంత్రి వాజ్ పేయి కాలం నాటి భారత రాజ్యంగ పరిధిలో “ఆకాశమే హద్దు” , “మనసులు, హృదయాలు” గెలుచుకోవాలి అనే సద్భావన సిద్ధాంతం, “ఇన్సానియత్”  కశ్మీర్, ప్రజాస్వామ్యం, ఐడియా ఆఫ్ ఇండియా నుండి చుట్టూ తిరిగి మోడీ రెండో పాలనలో జమ్మూ కశ్మీర్ పరిస్థితి ఇక్కడికి చేరుకుంది.

భారత రాజ్యంగ పరిధిలో- అది కూడా ప్రజాస్వామ్యం పేరు మీద- కశ్మీరీ ప్రజలకి భారతదేశం వంచన, వెన్నుపోటు తప్ప ఇంకేమి ఇవ్వదు అనే విషయాన్ని కేంద్ర ప్రభుత్వం మరొక్కసారి నిరూపించింది. ఐడియా ఆఫ్ ఇండియా అనే దాని నమ్మి, కశ్మీర్ లో దాన్ని ప్రచారం చేసి, తన జీవితాతం దానిని వెనకేసుకొచ్చి న వారు నేడు చెల్లని కాణీలు అయ్యారు, అవమానాలకి గురయ్యారు, అరెస్ట్ కూడా అయ్యారు.

దిగ్బంధానికి, క్రూరత్వానికి బలయిన కశ్మీరీలకి ఐడియా ఆఫ్ ఇండియా అంటే తమ వాక్ స్వాతంత్య్రాన్ని కోల్పోవటం, రాజకీయ కార్యకర్తలు అరెస్టులు కావడం, భారీ సంఖ్యలో సైనిక బలగాల మధ్య నివసించడం, సైనిక  దిగ్బంధం, పెల్లెట్ తుపాకులు, రాజ్యంగ వంచన, వ్యవస్థాగత అన్యాయం, కనీస మానవ, రాజకీయ హక్కుల నిరాకరణ.

భవిష్యత్తులో ఏదైనా కశ్మీరీ ప్రధాన స్రవంతి రాజకీయ పార్టీ కానీ రాజకీయ నాయకులు కానీ ఐడియా ఆఫ్ ఇండియాని కశ్మీర్ లో మళ్ళీ ప్రచారం చేసే ప్రయత్నం చేస్తే వాళ్ళు ముందు ఆ ఐడియా ఆఫ్ ఇండియా తాజా ఎక్స్‌పైరీ తారీఖు చూడాలి. అది ఆగస్ట్ 5, 2019.

మజీద్ మక్బూల్

వ్యాసకర్త జర్నలిస్టు, రచయిత. శ్రీనగర్‌లో ఉంటారు

‘ద వైర్’ వెబ్‌సైట్ సౌజన్యంతో

Related posts

Telangana Lok Sabha Elections 2024: ఆ మూడు స్థానాల్లో కొనసాగుతున్న సస్పెన్స్ .. మరో సీఎం రేవంత్ హస్తినకు పయనం

sharma somaraju

ర‌ఘురామ సీటుకు ఎర్త్ పెడుతోందెవ‌రు… పాపం ఏమైపోతాడో …!

ఈ టీడీపీ సీనియ‌ర్ లీడ‌ర్‌కు టిక్కెట్‌…. మంత్రి ప‌ద‌వి కావాలి.. అయినా బాబు కంటే జ‌గ‌నే ఇష్టం…!

బొత్స త‌న భార్య ఝాన్సీని విశాఖ ఎంపీని చేస్తాడా.. చేతులెత్తేస్తారా…?

Chandrababu: ఢిల్లీ వెళుతున్న టీడీపీ అధినేత చంద్రబాబు .. అమిత్ షాతో కీలక భేటీ..? ఎన్డీఏలో చేరికకు మార్గం సుగమం అయినట్లే(గా)..!

sharma somaraju

YSRCP: ప్రత్యర్ధులకు అందని జగన్ వ్యూహం .. ఎంపీ ఆర్ఆర్ఆర్ కు ప్రత్యర్ధిగా మహిళా అడ్వకేట్ ఉమాబాల .. ఎవరీ ఉమాబాల..?

sharma somaraju

TDP: ఆ వాగ్ధాటి ఉన్న నేతకు టీడీపీలో టికెట్ టెన్షన్ .. బాబు గారు ఎక్కడ సర్దుబాటు చేస్తారో..!

sharma somaraju

JD Lakshminarayana: జేడీ కంఠశోష .. జగన్, చంద్రబాబుకు జేడీ కీలక సూచన

sharma somaraju

TDP – Janasena: చంద్రబాబు, పవన్ కళ్యాణ్ కు పెద్ద తలనొప్పిగా మారిన కడప అసెంబ్లీ సిగ్మెంట్ .. టీడీపీ కా ..? జనసేనకా..? మాధవి రెడ్డి వర్సెస్ సుంకర శ్రీనివాస్

sharma somaraju

YSRCP: ఎంపీ వద్దు .. ఎమ్మెల్యే సీటు ముద్దు.. వైసీపీ నేతల వేడుకోలు

sharma somaraju

YSRCP – Allagadda: ఆళ్లగడ్డలో అఖిలప్రియకు పోటీగా అవంతి ..? ఎవరీ అవంతి..?  

sharma somaraju

YS Sharmila: ఏపీలో వైఎస్ షర్మిల ఆపరేషన్ స్టార్ట్స్ .. రేపే పీసీసీ బాధ్యతల స్వీకరణ .. వెంటనే ఆ ఇద్దరు సిట్టింగ్ ఎమ్మెల్యేలు చేరిక..?

sharma somaraju

Janasena TDP: జనసేనలోకి మాజీ మంత్రి కొణతాల ..? అయ్యన్న ఆశలపై నీళ్లు..!

sharma somaraju

TDP Vs Janasena: టీడీపీకి బిగ్ ఝలక్ .. తిరగబడుతున్న తెనాలి తెలుగు తమ్ముళ్లు

sharma somaraju

YSRCP Vs TDP: ముందరి కాళ్లకు బంధం అంటే ఇదే కదా..? సంకటంలో టీడీపీ..!

sharma somaraju

Leave a Comment