బోయపాటి సినిమాలంటే యాక్షన్ కు కేరాఫ్ అడ్రెస్. అయితే.. అప్పుడప్పుడూ కాస్త శృతి మంచి అతి అనిపిస్తాయి. ఇప్పుడు వీటిని మించి బాలీవుడ్ లో ఓ సినిమా హడావిడి చేస్తోంది. సినిమా ఒక అందమైన అబద్ధమని.. దానిని అందంగా చూపించాలనే కాన్సెప్టే మర్చిపోతున్నారు. పాటలు, డ్యాన్సులు, ఫైట్లు, భారీ బాంబ్ బ్లాస్టింగ్స్, కామెడీ, పేరడీ.. ఇలా ఎన్నో అంశాలు సినిమాల్లో ఉంటాయి. ప్రేక్షకులకు సినిమా నచ్చాలంటే ఇవి ఉండాల్సిందే. అది నమ్మేంతగా ఉండాలే కానీ.. ఎబ్బెట్టుగా కాదు. అయితే.. కొందరు దర్శకులు చేసే జిమ్మిక్కులు నవ్వు తెప్పించడమే కాదు విమర్శలకు దారి తీస్తాయి. ప్రస్తుతం ఓ హిందీ సినిమా ఇదే చేస్తోంది. వరుణ్ ధావన్ హీరోగా డేవిడ్ ధావన్ దర్శకత్వంలో వచ్చిన సినిమా కూలీ నెం.1ను ఇటివలే అమెజాన్ ప్రైమ్ లో వదిలారు.
1995 హిట్ మూవీ కూలీ నెం.1కు ఇది రీమేక్. ఈ సినిమాలోని యాక్షన్ సన్నివేశాలు మరీ ఘోరంగా ఉన్నాయి. ఒక సన్నివేశంలో రైల్వే స్టేషన్ ట్రాక్ పై చిన్న పిల్లాడు ఆడుకుంటూ ఉండిపోతాడు. దూరంగా ట్రైన్ వచ్చేస్తూ ఉంటుంది. ప్లాట్ ఫామ్ పై నుంచుని కుటుంబసభ్యులు అరుస్తూ ఉంటారు. దిగి పిల్లాడిని తీసుకురారు. కానీ.. దూరంగా ఫుట్ బ్రిడ్జిపై ఉన్న వరుణ్ ఇది చూసి పైనుంచి ఆ ట్రైన్ పై దూకేస్తాడు. దూకడమే కాదు.. ఏకంగా ఆ ట్రైన్ పై వేగంగా పరిగెత్తేస్తాడు.. ట్రెయిన్ కంటే వేగంగా. పరుగెత్తి ఇంజిన్ మీద నుంచి ట్రాక్ పై దూకేసి.. ఆ పిల్లాడ్ని ఒక్క ఉదుటున పక్కకి తీసుకెళ్లిపోతాడు. పావు సెకను కాలంలో ట్రైన్ వెళ్లిపోతుంది. కొసమెరుపు.. ఆ ట్రెయిన్ ఎలక్ట్రిక్ ట్రైయిన్. విద్యత్ తీగలేవి.. వరుణ్ ఎలా పరిగెత్తాడు? అంటే.. పరిగెత్తాడు.
ఈ ఫైట్ పై సోషల్ మీడియాలో వస్తున్న విమర్శలు అన్నీ ఇన్నీ కావు. నెటిజన్ల ట్రోలింగ్ ఓ రేంజిలో ఉంది. దీనికి రోబో 2.0 బ్యాక్ గ్రౌండ్ పెట్టి ఓ ఆట ఆడుకుంటున్నారు. తెలుగులో కొన్ని బాలకృష్ణ సినిమాల్లో చేసిన ఫీట్లు, రామ్ చరణ్ తో బోయపాటి చేయించిన జిమ్మిక్కులు గుర్తోస్తాయి. ఏకంగా రైలుపై, రైలు కంటే వేగంగా.. అదీ కరెంట్ ట్రెయిన్ పై విద్యత్ తీగలు ఉంటాయనే స్పృహ కూడా లేకుండా దర్శకుడు తీసిన ఈ సీన్ నవ్వు తెప్పించడమే కాదు.. మరీ ‘అతి’గా అనిపిస్తోంది. సౌత్ ను విమర్శించే బాలీవుడ్.. ఇదా నువ్వు చేసేది అంటూ నెటిజన్లు కామెంట్లు చేస్తున్నారు.