సినిమా హిట్‌తో సంబంధం లేకుండా వైవిధ్యభరితమైన కథలతో ప్రయోగాలు చేస్తుంటాడు యంగ్ హీరో సందీప్ కిషన్. ఆయన హీరోగా లేటెస్ట్ గా నటించిన చిత్రం ‘మైఖేల్’. ఈ సినిమాతో పాన్ ఇండియా స్థాయిలో తన అదృష్టాన్ని పరీక్షించుకునేందుకు సిద్ధమయ్యాడు. యాక్షన్ ఎంటర్‌టైనర్‌గా తెరకెక్కిన ఈ చిత్రంలో స్టార్ హీరో విజయ్ సేతుపతి, వరలక్ష్మి శరత్ కుమార్, గౌతమ్ మేనన్ వంటి నటులు కీలక పాత్ర పోషించారు. సినిమా ట్రైలర్, టీజర్ ప్రేక్షకులను ఎంతగానో అలరించాయి. థియేటర్లలో రిలీజ్ అయిన ఈ సినిమా ప్రేక్షకులను అలరించిందా? పాన్ ఇండియా లెవల్‌లో సందీప్ సత్తా చాటాడా? సినిమా స్టోరీ ఎలా ఉంది? తదితర అంశాల గురించి ఇప్పుడు మనం తెలుసుకుందాం.

- సినిమా: మైఖేల్
- నటీనటులు: సందీప్ కిషన్, విజయ్ సేతుపతి, దివ్యాంశ కౌశిక్, గౌతమ్ మేనన్, వరలక్ష్మి శరత్ కుమార్, అనసూయ, వరుణ్ సందేశ్ తదితరులు.
- దర్శకత్వం: రంజిత్ జయకోడి
- నిర్మాతలు: భరత్ చౌదరి, పుస్కూర్ రామ్ మోహన్ రావు
- ఛాయాగ్రహణం: కిరణ్ కౌశిక్
- విడుదల తేదీ: 3 ఫిబ్రవరి 2023

సినిమా స్టోరీ
మైఖేల్ (సందీప్ కిషన్) జైలులోనే పుట్టి పెరుగుతాడు. చిన్నప్పటి నుంచి మైఖల్‌కు తండ్రిపై ధ్వేషం ఉంటుంది. జైలు నుంచి బయటికి వచ్చిన మరుక్షణమే తన తండ్రిని చంపాలనుకుంటాడు. అలా జైలు నుంచి రిలీజ్ అయిన మైఖేల్ తన తండ్రి చంపడానికి ముంబైకి వెళ్తాడు. ముంబైలో అడుగు పెట్టిన మరుక్షణమే అండర్ వరల్డ్ డాన్ గురునాథ్ (గౌతమ్ మేనన్’ను భారీ ఎటాక్ నుంచి కాపాడుతాడు. దాంతో గురునాథ్.. మైఖేల్‌ను తన దగ్గర పనిలో పెట్టుకుంటాడు. అలా స్టోరీ ముందుకు సాగుతుంది. గురునాథ్ తనపై ఎటాక్ చేయడానికి కుట్ర పన్నిన వారిని వరుసగా హత్య చేస్తాడు. చివర్లో రతన్ (అనీష్ కురువిల్లా), అతని కూతురు తీర (దివ్యాంశ కౌశిక్) చంపే కాంట్రాక్ట్ మైఖేల్‌కు ఇస్తాడు. రతన్‌ను పట్టుకునే క్రమంలో మైఖేల్.. తీరకు దగ్గర అవుతాడు. ఈ క్రమంలోనే ఆమెతో ప్రేమలో పడతాడు. రతన్‌కు మైఖల్ దొరికినా చంపకుండా వదిలేస్తాడు. అప్పుడు గురునాథ్ కొడుకు అమర్‌నాథ్ (వరుణ్ సందేశ్) గురించి ఓ నిజం మైఖేల్‌కు తెలుస్తుంది. అసలేంటా నిజం? మైఖేల్ జైలులో ఎందుకు పుట్టాడు? తన తండ్రిని ఎందుకు చంపాలని అనుకున్నాడు? కథలో విజయ్ సేతుపతి, వరలక్ష్మీ శరత్ కుమార్ ఎలాంటి పాత్రల్లో కనిపిస్తారు? తదితర విషయాల గురించి తెలియాలంటే తెరపై సినిమాను చూడాల్సిందే.

విశ్లేషణ
మగువ కోసం రాజులు కూడా యుద్ధాలు చేశారని చరిత్ర చెప్తుంది. ఈ చిత్ర నేపథ్యం కూడా అదేనని దర్శకుడు ప్రచార చిత్రాలతోనే స్పష్టతను ఇచ్చాడు. సినిమా ట్రైలర్‌లో ప్రేమించిన అమ్మాయి కోసం ఓ కుర్రాడు చేసిన మారణకాండగా చూపించారు. కానీ సినిమాలో మరో ఆసక్తికరమైన కథ కూడా దాగి ఉంది. 1980-90లో ఓ గ్యాంగ్‌స్టర్ స్టోరీ ఇది. కాకపోతే ఇందులో డైరెక్టర్ ప్రేమ, తల్లి సెంటిమెంట్‌ను యాడ్ చేశాడు. కాన్సెప్ట్ బాగున్నప్పటికీ.. సినిమాను ఇంప్లిమెంట్ చేసే క్రమంలో డైరెక్టర్ విఫలమైనట్లు కనిపిస్తోంది. స్టోరీకి తగ్గట్లే సినిమాను రెట్రో స్టైల్‌లో తెరకెక్కించాడు. మైఖేల్ పరిచయం, సంభాషణలతో కథను నడిపించిన విధానం ‘కేజీయఫ్’ సినిమాను గుర్తు చేస్తాయి.
గురునాథ్‌ను మైఖేల్ కాపాడటం.. గురు సామ్రాజ్యంలో మైఖేల్ చక్రం తిప్పడం.. వరకు సినిమా స్టోరీ రసవత్తరంగా సాగుతుంది. ఆ తర్వాత రతన్‌ను చంపేందుకు మైఖేల్ దిల్లీకి వెళ్లడం.. తీరుతో ప్రేమలో పడటం.. వరకు కొన్ని సీన్లు బోరింగ్‌గా అనిపిస్తాయి. ఫస్ట్ ఆఫ్‌లో ట్విస్ట్.. సెకండ్ ఆఫ్ మీద ఆసక్తి పెంచుతాయి. కానీ సెకండ్ ఆఫ్‌లో పూర్తిగా నిరుత్సాహ పర్చిందని చెప్పవచ్చు. మైఖేల్ గతం ఆసక్తికరంగా ఉండదు. విజయ్ సేతుపతి, వరలక్ష్మీ పాత్రలు ఎంట్రీ ఇచ్చాక.. సినిమా కాస్త రసవత్తరంగా సాగుతుంది. సినిమా చివరల్లో 15 నిమిషాల పాటు యాక్షన్, బుల్లెట్ల సౌండే వినిపిస్తుంది.

ప్లస్ పాయింట్స్:
కథా నేపథ్యం, కథనం నడిపిన తీరు, సందీప్ కిషన్ యాక్టింగ్, సంగీతం, యాక్షన్ సన్నివేశాలు
మైనస్ పాయింట్స్:
రొటీన్ స్టోరీ, హింసాకాండ
న్యూస్ ఆర్బిట్ రేటింగ్: 2.5/5
గమనిక: ఈ రివ్యూ సమీక్షకుడి వ్యక్తిగత అభిప్రాయం మాత్రమే.