Longest Run Movies: శుక్రవారం వచ్చిందంటే చాలు థియేటర్స్ వద్ద కొత్త సినిమాల హడావుడి గట్టిగా కనిపిస్తూ ఉంటుంది. ప్రతి శుక్రవారం ఎన్నో కొత్త సినిమాలు ప్రేక్షకులను పలకరిస్తూ ఉంటాయి. అయితే వాటిలో కొన్ని మాత్రమే విజయం సాధిస్తాయి. ఇకపోతే ఒకప్పుడు సినిమాలు నెలలు తరబడి థియేటర్స్ లో రన్ అయ్యేవి. కానీ ఇప్పటి రోజుల్లో ఎంత పెద్ద సినిమాలు అయినా కూడా వారం పది రోజులు సందడి చేసి ఆ తర్వాత సైలెంట్ అయిపోతున్నాయి. అది కూడా హిట్ టాక్ వస్తేనే.. ఒకవేళ టాక్ అనుకూలంగా రాకపోతే మాత్రం ఎలా వచ్చిన సినిమాలు అలానే వెళ్ళిపోతున్నాయి. ఇకపోతే ప్రస్తుతం థియేటర్స్ లో ఒక సినిమా నెల రోజులు ఆడటం గగనం అయిపోయింది. అందులోనూ పుట్టగొడుగుల్లా ఓటీటీలు పొట్టుకొచ్చిన తర్వాత థియేటర్స్ లో సినిమాలకు ఆదరణ తగ్గుతూ వస్తోంది. ఈ నేపథ్యంలోనే థియేటర్స్ లో అత్యధిక రోజులు ఆడిన టాప్ 5 తెలుగు సినిమాల గురించి ఇప్పుడు తెలుసుకుందాం.
ఈ జాబితాలో మొదటి స్థానంలో ఉన్న చిత్రం లెజెండ్. బోయపాటి శ్రీను, నటసింహం నందమూరి బాలకృష్ణ కాంబినేషన్ లో వచ్చిన రెండో సినిమా ఇది. ఈ సినిమాలో రాధిక ఆప్టే, సోనాలీ చౌహాన్ హీరోయిన్లుగా నటిస్తే.. జగపతిబాబు విలన్ గా అదరగొట్టేశాడు. 2014 మార్చి 28న విడుదలైన లెజెండ్ మూవీ సంచలన విజయాన్ని నమోదు చేసింది. బాక్సాఫీస్ వద్ద కాసుల వర్షాన్ని కురిపించింది. అంతేకాకుండా అప్పట్లో కర్నూలు జిల్లా ఎమ్మిగనూరులోని థియేటర్లో 1000 రోజులకు పైనే ఆడి సరికొత్త రికార్డును సెట్ చేసింది.
థియేటర్స్ లో అత్యధిక రోజులు ప్రదర్శించబడిన తెలుగు చిత్రాల్లో లిస్ట్ లో మగధీర రెండో స్థానంలో ఉంది. రాజమౌళి తెరకెక్కించిన ఈ చిత్రంలో మెగా పవర్ స్టార్ రామ్ చరణ్, కాజల్ అగర్వాల్ జంటగా నటించారు. అల్లు అరవింద్ నిర్మాణంలో రూపుదిద్దుకున్న మగధీర.. 2009లో విడుదలై ఇండస్ట్రీ హిట్ గా నిలిచింది. రిలీజ్ అయిన మొదటి రోజే రూ. 15 కోట్ల షేర్ రాబట్టి రికార్డులు తిరగరాసింది. ఫుల్ రన్ లో రూ. 60 కోట్లు వసూళ్లు సొంతం చేసుకున్న మగధీర చిత్రం కర్నూలు జిల్లాలోని విజయలక్ష్మి థియేటర్లో 1000 రోజులు ఆడటం మరొక విశేషం.
పోకిరి.. మహేష్ బాబును స్టార్ హీరోగా మార్చిన చిత్రమిది. పూరీ జగన్నాథ్ డైరెక్ట్ చేసిన ఈ యాక్షన్ ఎంటర్టైనర్ లో ఇలియా హీరోయిన్గా యాక్ట్ చేసింది. 2006లో రిలీజ్ అయిన పోకిరి సినిమా మగధీర విడుదల వరకు తెలుగు సినీ చరిత్రలో అత్యధిక వసూళ్ళు సాధించిన చిత్రంగా రికార్డులకెక్కింది. అలాగే అప్పట్లో ఈ చిత్రం ఓ థియేటర్ లో 580 రోజులు ఆడింది.
మంగమ్మగారి మనవడు.. థియేటర్స్ లో అత్యధిక రోజులు ఆడిన టాప్-5 తెలుగు చిత్రాల్లో నాలుగో స్థానాన్ని దక్కించుకుంది. కోడి రామకృష్ణ తెరకెక్కించిన ఈ ఫ్యామిలీ డ్రామాలో భానుమతి రామకృష్ణ, నందమూరి బాలకృష్ణ, సుహాసిని ప్రధాన పాత్రలను పోషించారు. 1984 లో విడుదలైన ఈ సినిమా భారీ విజయాన్ని అందుకుంది. అప్పట్లో మంగమ్మగారి మనవడు మూవీ హైదరాబాద్ లోని తారకరామ థియేటర్లలో ఏకంగా 565 రోజులు రన్ అయింది.
ఇక ఐదో స్థానంలో మరో చరిత్ర మూవీ ఉంది. కె. బాలచందర్ దర్శకత్వంలో వచ్చిన ఒక విషాదాంత ప్రేమకథా చిత్రమిది. ఇందులో కమల్ హాసన్, సరిత, మాధవి ప్రధాన పాత్రలను పోషించారు. 1978 లో రిలీజ్ అయిన మరో చరిత్ర ఘన విజయం సాధించింది. ఎన్నో రికార్డులను సృష్టించింది. అంతేకాకుండా ఒక థియేటర్ లో నిరంతరంగా 556 రోజుల పాటు ఆడి చరిత్రలో నిలిచింది.
https://www.instagram.com/urstrulymahesh/?hl=en