Love Guru: గత వారం థియేటర్స్ లో విడుదలైన క్రేజీ చిత్రాల్లో లవ్ గురు ఒకటి. తమిళ హీరో విజయ్ ఆంటోని, మృణాలిని రవి ఈ సినిమాలో జంటగా నటించారు. వీటీవీ గణేష్, తలైవాసల్ విజయ్, ఇళవరసు, సుధ, శ్రీజ రవి తదితరులు కీలక పాత్రలను పోషించారు. వినాయక్ వైద్యనాథన్ దర్శకత్వం వహించిన ఈ చిత్రాన్ని విజయ్ ఆంటోనీ ఫిలిం కార్పొరేషన్ బ్యానర్‌పై మీరా విజయ్ ఆంటోనీ నిర్మించారు. భరత్ ధనశేఖర్ సంగీతం అందించాడు. బిచ్చగాడు హిట్ తర్వాత విజయ్ ఆంటోనీకు తెలుగులోనూ మంచి క్రేజ్ ఏర్పడింది. దీంతో తమిళంలో ఆయన చేసే సినిమాను తెలుగులో కూడా విడుదల చేస్తున్నారు.
ఈ నేసథ్యంలోనే లవ్ గురు చిత్రాన్ని ఏప్రిల్ 11న తెలుగు, తమిళ భాషల్లో గ్రాండ్ రిలీజ్ చేశారు. ఓ మోస్తరు అంచనాల నడుమ విడుదలైన లవ్ గురు సినిమాకు రెండు భాషల్లోనూ పాజిటివ్ టాక్ లభించింది. ఎలాంటి అశ్లీలత లేకుండా ఫ్యామిలీ అంతా కలిసి చూసి ఎంజాయ్ చేసే కామెడీ ఎంటర్టైనర్ గా ఈ చిత్రాన్ని రూపొందించారు. అరవింద్ పాత్రలో విజయ్ ఆంటోనీ ఒదిగిపోయాడు. ఎమోషనల్ సీన్స్ లో తనదైన హావభావాలతో ప్రేక్షకులను మెప్పించాడు. అలాగే లీల పాత్రకు మృణాలని రవి పూర్తి న్యాయం చేసింది.
కథలో భాగంగా వచ్చే ట్విస్టులు, క్లైమాక్స్, ఫ్లాష్ బ్యాక్ స్టోరీ సినిమాను మరో స్థాయికి తీసుకెళ్లాయి. స్టోరీ పాతదే అయినప్పటికీ.. డైరెక్టర్ కొత్తగా ప్రెజెంట్ చేయడంలో సూపర్ సక్సెస్ అయ్యాడు. టాక్ అనుకూలంగా ఉండడంతో ఈ సినిమాకు థియేటర్స్ లో మంచి ఆదరణ లభిస్తోంది. అయితే లవ్ గురు మూవీని మరింత జనాల్లో తీసుకెళ్లాలని భావించిన నిర్మాతలు.. తాజాగా సినీ ప్రియుల కోసం ఓ బంపర్ ఆఫర్ ను ప్రకటించారు. ఈ వేసవి కాలంలో మలేషియా, కశ్మీర్, ఊటి వంటి ప్రదేశాలకు హ్యామిలీతో ఫ్రీగా ట్రిప్ వేసేందుకు అవకాశాన్ని కల్పిస్తున్నారు.
ఇందులో భాగంలోనే లవ్ గురు ప్రదర్శించబడుతున్న అన్ని థియేటర్స్ లో ఒక బాక్స్ ను ఏర్పాటు చేశారు. లవ్ గురు చూసిన ప్రేక్షకులు తమ పేరు, ఫోన్ నెంబర్ మరియు టికెట్ వివరాలు రాసి థియేటర్స్ దగ్గర ఏర్పాటు చేసిన బాక్సుల్లో వేయాలి. ఒకవేళ ఆన్ లైన్ ద్వారా టికెట్స్ కొనుగోలు చేస్తే 9963466334 నెంబర్‌కు టికెట్ ఫొటోను వాట్సాప్ చేసి తమ వివారాలు పంపాలి. లవ్ గురు సినిమా చూసి తమ వివరాలు పంపిన ప్రేక్షకుల్లో ముగ్గురుని ఎంపిక చేసి సమ్మర్ హాలీడే టూర్ తీసుకెళ్తామని నిర్మాతలు ప్రకటించారు.
ఈ క్రేజీ ఆఫర్లో ఫస్ట్ ప్రైజ్ విన్నర్‌ను మలేషియా, సెకండ్ ప్రైజ్ విన్నర్ ను కాశ్మీర్, థర్డ్ ప్రైజ్ విన్నర్‌ను ఊటీకి ఫ్యామిలీ మెంబర్స్ తో సహా ఉచితంగా తీసుకెళ్లనున్నట్లు లవ్ గురు టీమ్ తమ ప్రకటనలో తెలియజేశారు. లవ్ గురు థియేట్రికల్ రన్ పూర్తి అయ్యాక ప్రేక్షకుల్లో ఆ ముగ్గురు లక్కీ విన్నర్స్ ఎవరో టీమ్ ప్రకటిస్తుంది. మరి ఆ ముగ్గురిలో మీరు ఒకరై.. పూర్తి ఉచితంగా సమ్మర్ హాలీడేస్ వెకేషన్ కు ఫ్యామిలీతో వెళ్లి ఎంజాయ్ చేయాలనుకుంటే వెంటనే లవ్ గురు సినిమా చూసేయండి.