Arya Movie: ఐకాన్ స్టార్ అల్లు అర్జున్, క్రియేటివ్ డైరెక్టర్ సుకుమార్ కాంబినేషన్ లో వచ్చిన తొలి చిత్రం ఆర్య. ఇందులో అనురాధ మెహతా హీరోయిన్ గా యాక్ట్ చేస్తే.. శివ బాలాజీ, కృష్ణుడు, రాజన్ పి. దేవ్ తదితరులు కీలక పాత్రలను పోషించారు. దిల్ రాజు ఈ చిత్రాన్ని నిర్మించగా.. దేవీ శ్రీ ప్రసాద్ స్వరాలు అందించాడు. అల్లు అర్జున్ కు ఇది రెండో సినిమా కాగా.. సుకుమార్ కు దర్శకుడిగా ఇదే తొలి చిత్రం.
ఫీల్ గుడ్ లవ్ ఎంటర్టైనర్ గా రూపదిద్దుకున్న ఆర్య 2004 మే 7న విడుదలై మంచి విజయాన్ని అందుకుంది. ముఖ్యంగా యూత్‌ను ఈ మూవీ ఎంతగానో ఆకట్టుకుంది. మొదటి చిత్రం గంగోత్రి మంచి విజయం సాధించినప్పటికీ అల్లు అర్జున్ కు అనుకున్న స్థాయిలో గుర్తింపు రాలేదు. కానీ ఆర్య సినిమా అల్లు అర్జున్ ను ఇండస్ట్రీలో హీరోగా నిలబెట్టింది. యూత్ లో భారీ ఫాలోయింగ్ ఏర్పడేందుకు తోడ్పడింది.
అయితే చాలా మందికి తెలియని విషయం ఏంటంటే.. ఆర్య మూవీకి ఫస్ట్ ఛాయిస్ అల్లు అర్జున్ కాదు. సినిమాలపై ఉన్న మక్కువతో 2000వ సంవత్సరంలో ఇండస్ట్రీ వైపు అడుగులు వేసిన సుకుమార్.. మొదట్లో ఎడిటర్ మోహన్ దగ్గర సహాయకుడిగా పని చేశాడు. ఆ తర్వాత డైరెక్టర్ కావాలన్న కోరికతో సుకుమార్ ఆర్య కథ రాసుకున్నాడు. ఈ స్టోరీని ముందుగా రవితేజకు వినిపించారు. కానీ ఆయన మాత్రం ఆర్య స్టోరీ తనకు కాదని రిజెక్ట్ చేశారు.
ఆపై నితిన్ ను సంప్రదించగా.. డేట్స్ ఖాళీ లేకపోవడంతో నో అన్నాడు. అప్పుడప్పుడు ఇండస్ట్రీలో ఎదుగుతున్న ప్రభాస్ కు కూడా సుకుమార్ ఆర్య కథను నెరేట్ చేశాడు. అయితే ప్రభాస్ కూడా ఇంట్రెస్ట్ చూపలేదు. చివరకు గంగోత్రి మూవీతో అప్పుడే హీరోగా ఎంట్రీ ఇచ్చిన అల్లు అర్జున్ ను కలవగా.. ఆయనకు స్టోరీ నచ్చడంతో వెంటనే సినిమా చేసి బ్లాక్ బస్టర్ హిట్ ను ఖాతాలో వేసుకున్నాడు. ఇక ఆర్య తర్వాత అల్లు అర్జున్ వెనక్కి తిరిగి చూసుకోలేదు.