Dead Sea Scrolls: 11 గుహల్లో దాదాపు 800 వరకు పురాతన మాన్యుస్క్రిప్ట్స్.. రాగితో చేసిన స్క్రోల్స్.. డెడ్ సీ స్క్రోల్స్ ఇప్పటికీ ఇదొక మిస్టరీనే!
Dead Sea Scrolls: ప్రపంచవ్యాప్తంగా ఎన్నో ప్రాంతాల చారిత్రక వైభవానికి, ఉద్యమాలకు అణచివేతలకు రాగి రేకులు ప్రత్యక్ష సాక్ష్యాలుగా ఉన్నాయి. వాటి మీద చెక్కిన విషయాల ఆధారంగానే బయట ప్రపంచానికి అప్పటి విషయాలు తెలిశాయి. అయితే, ఇవి చరిత్రనే కాదు.. అప్పట్లో దాడిన నిధులకు కూడా తెలిపాయి. అలాంటి రాగి రేకులే ఇజ్రాయెల్, జోర్డాన్ మధ్యలోని డెడ్ సీ (మృత సముద్రం) ఒడ్డున ఉన్న కుమ్రాన్ గుహల్లో దొరికాయి. చరిత్ర, జ్ఞానాన్ని ముందు తరాలకు అందించేందుకు రాగి రేకులు ఎంతగానో సహాయపడ్డాయి. రాజులు, జమీందారుల కాలంలో తమ ఆస్తుల వివరాలను రాగి రేకుల మీద రాసుకునే వాళ్లు. అయితే ఇజ్రాయెల్, జోర్డాన్ దేశాల మధ్య ఉన్న డెడ్ సీ ఒడ్డున దొరికిన ఈ రాగి రేకులు నిధుల వివరాలను చెబుతున్నాయని చాలా మంది నమ్ముతున్నారు.

రాగి రేకులను ఎలా కనుగొన్నారు?
బెడౌయిన్‌కు చెందిన కొందరు యువకులు డెడ్ సీని ఆనుకుని ఉన్న కొండల్లో గొర్రెలు, మేకలు మేపడానికి వెళ్లారు. ప్రస్తుతం వెస్ట్ బ్యాంక్ అని పిలుస్తున్న డెడ్ సీ వాయువ్య ఒడ్డున ఉన్న‘కుమ్రాన్’ ప్రాంతానికి దగ్గరల్లో గొర్రెలు, మేకల్ని మేపుతున్నారు. అయితే ఒక గొర్రె తప్పిపోయింది. దాంతో కాపరి గొర్రె కోసం వెతకడం ప్రారంభించారు. గొర్రెల కాపరి కొండ పక్కన ఉన్న గుహలోకి రాయి విసిరాడు. అయితే గుహ లోపలి నుంచి ఏదో పగిలిపోయిన శబ్ధం వచ్చింది. దాంతో మిగిలిన గొర్రెల కాపరులను పిలిచాడు. అందరూ కలిసి గుహలోకి వెళ్లారు. అక్కడ పెద్ద పెద్ద మట్టి పాత్రలు కనిపించాయి. వాటిలో ఏడింటిలో తోలు, పాపిరస్ స్క్రోల్స్ ఉన్నాయి. విషయం తెలుసుకున్న పురావస్తు శాస్త్రవేత్తలు తవ్వకాలు జరపడం, వాటిపై రీసెర్చ్ చేయడం మొదలు పెట్టారు. 11 గుహల్లో కలిపి దాదాపు 8 వందల పురాతన మాన్యుస్క్రిప్ట్స్ దొరికాయి. వాటిని సేకరించేందుకు దాదాపు ఐదేళ్లు పట్టింది. అక్కడ దొరికిన మాన్యుస్క్రిప్ట్స్ అన్నీ చుట్టి చుట్టి ఉన్నాయి. అందుకే వాటిని ‘డెడ్ సీ స్క్రోల్స్’ అని పిలుస్తారు.
యూదుల మాన్యుస్క్రిప్ట్స్..
కుమ్రాన్ ప్రాంతంలో దొరికిన డెడ్ సీ స్క్రోల్స్‌లో మాన్యుస్క్రిప్ట్స్ చాలా వరకు హిబ్రూ భాషలో ఉన్నాయి. వీటిపై పరిశోధనలు చేసిన చాలా మంది శాస్త్రవేత్తలు అవి యూదులకు సంబంధించినవే అని చెప్పారు. 1952లో మూడవ గుహలో వెతుకుతున్న పురావస్తు శాస్త్రవేత్తలకు రెండు లోహపు చుట్టలు ప్రత్యేకంగా దొరికాయి. అవి రాగితో చేసిన స్క్రోల్స్. అయితే ఈ రాగి స్క్రోల్స్‌లో మూడు సన్నని మెటల్ షీట్‌లు ఉన్నాయి. అవి పొడవైన స్ట్రిప్‌లా ఏర్పడ్డాయి. అయితే అప్పట్లో ఒక భాగం విరిగిపోవడంతో రెండు భాగాలు మాత్రమే స్క్రోల్స్ చేసి దాచారు. ఈ స్క్రోల్స్‌ను విప్పడం, అందులోని స్క్రిఫ్ట్‌ని చదవడం దాదాపు అసాధ్యం. ఎందుకంటే ఆక్సీకరణ వల్ల రాగి పూర్తిగా బిగుసుగా మారిపోయింది. ఆ చుట్టను విప్పాలంటే.. ఎక్కడికక్కడ విరిగిపోయే ప్రమాదం ఉంటుంది. దాంతో 1956లో ఆ స్క్రోల్స్‌ను మాంచెస్టర్ కాలేజ్ ఆఫ్ సైన్స్ అండ్ టెక్నాలజీకి పంపించారు. అక్కడ వాటిని చిన్న చిన్న ముక్కలుగా కత్తిరించారు. అలా 23 స్థూపాకార భాగాలు ఏర్పడ్డాయి. వాటిని అమ్మన్‌లో జోర్డాన్ మ్యూజియంలో ఉంచారు.

ఒక్కో భాగం.. ఒక్కో ప్రాంతం గురించి..
మాన్యుస్క్రిప్ట్స్‌లోని ఒక్కో భాగం.. ఒక్కో ప్రాంతం గురించి చెబుతుంది. ముఖ్యంగా ఆయా ప్రాంతాల్లో దాచిన విలువైన వస్తువుల గురించి అందులో రాసి ఉంది. మొదటి నాలుగు నిలువు వరుసల్లోని కొన్ని భాగాల చివరలో విచిత్రమైన కోడ్ ఉంది. పైగా ఆ విషయం అంతా హిబ్రూ భాషలో రాశారు. ముగింపులో ఉన్న కోడ్‌లు మాత్రం గ్రీకు అక్షరాల్లో ఉన్నాయి. అయితే ఇప్పటివరకు ఆ కోడ్‌లను ఎవరూ సరైన వివరణ ఇవ్వలేకపోయారు. అయితే అది కొందరు వ్యక్తుల పేర్లని భావిస్తున్నారు. ఆ వ్యక్తులు ఎవరు? అందులో వాళ్ల పేర్లు ఎందుకు రాశారు? వాళ్లకు ఆ నిధులతో సంబంధం ఏంటి? వంటి ప్రశ్నలకు సమాధానాలు దొరకడం లేదని సమాచారం.
జెరూసలేంలోని ప్రాంతాల గురించే..
ఈ స్క్రోల్స్‌లో చెప్పిన చాలా ప్రాంతాలు భౌగోళికంగా జెరూసలెంలో ఉన్నాయి. మిగతావి కుమ్రాన్, జెరిఖో చుట్టూ ఉన్నాయి. కొన్ని మాత్రం ఉత్తర పాలస్తీనాలో ఉన్నాయి. ఈ ప్రదేశాలు చాలా వరకు హిబ్రూ బైబిల్‌లో కూడా ఉన్నాయి. అందులో చెప్పిన ప్రదేశాల్లో శిథిల భవనాలు, సమాధులు, గుహలను మాత్రమే కనుగొన్నారు.

రాగి స్క్రోల్స్ దొరికినప్పటికీ కొన్ని ప్రశ్నలకు సమాధానాలు దొరకడం లేదు. పురాతన కాలంలో బహుశా కుమ్రాన్‌లో ఒక యూదు సంఘం ఉండేదని ఫిలో, జోసెఫ్‌లు చెప్పారు. అయితే యూదు సంఘం చాలా సంపదను కూడబెట్టుకుని ఉండొచ్చని అభిప్రాయపడ్డారు. సంఘంలోకి వచ్చేటప్పుడు సభ్యులు వాళ్ల ఆస్తి సంఘానికి అప్పగించాలనే నియమం ఉండేదని కొందరు చెబుతున్నారు. అందుకే సంఘం దగ్గర చాలా సంపద ఉండేదట. రోమన్లకు వ్యతిరేకంగా క్రీస్తు శకం 66-74 సంవత్సరాల మధ్య మొదటి యూదుల తిరుగుబాటు జరిగింది. ఆ సమయంలో కొందరు సభ్యులు సంపదను దాచి పెట్టుకుని ఉండొచ్చనే వాదనలు వినిపిస్తున్నాయి. మరికొందరేమో రాగి స్క్రోల్స్‌లో చెప్పిన విలువైన వస్తువులు జెరూసలేంలోని ఆలయ సంపదను సూచిస్తాయని చెబుతున్నారు. అయితే రాగి స్క్రోల్స్ సంపద ఒక సాహిత్య కల్పన అని చెప్పేవాళ్లు కూడా ఉన్నారు.
‘ఎస్తేర్’ పార్ట్ మినహా పాత నిబంధనలోని దాదాపు అన్ని విషయాలు ఇక్కడ దొరికిన స్క్రోల్స్‌లో ఉన్నాయి. యూదుల రాణి పెర్సియా కథను వివరించే భాగం కాలక్రమేణా విచ్ఛిన్నమైందని, వాటిని ఇంకా వెలికి తీయలేదని కొందరు భావిస్తున్నారు. ఈ మాన్యుస్క్రిప్ట్స్‌లో హిబ్రూ బైబిల్‌తో పాటు మరెన్నో విషయాలు ఉన్నట్లు తెలుస్తోంది. అలాగే కాపర్ స్క్రోల్స్‌లోని పదాల్లో ఎక్కువగా ‘మీరు’ అనే పదాన్ని వాడినట్లు శాస్త్రవేత్తలు చెబుతున్నారు. ఈ స్క్రోల్స్ ఎవరినో ఉద్దేశించి రాసినట్లు తెలుస్తోంది. కానీ వారు ఎవరో తెలియదు. కొన్ని ప్రదేశాల గురించి చెప్పినప్పుడు ప్రత్యేకంగా కొలతలతో సహా చెప్పినట్లు పరిశోధకులు తెలిపారు. అలాగే స్క్రిప్ట్‌లో ఎక్కువగా దాచి పెట్టిన నిధుల గురించి తిరిగి పొందడం గురించి రాసినట్లు పరిశోధకులు చెబుతున్నారు.

డెడ్ సీ అంటే ఏంటి?
ప్రపంచంలోని అనేక వింత ప్రదేశాలలో ‘డెడ్ సీ’ (మృత సముద్రం) ఒకటి. మృత సముద్రం అనేది ప్రపంచంలోనే అత్యల్ప సముద్రం. సముద్ర మట్టానికి 440 మీటర్ల దిగువన ఉంది. దీని విస్తీర్ణం కూడా తక్కువగా ఉంటుంది. ఈ సముద్రం లవణీయత కారణంగా ప్రసిద్ధి చెందింది. ఇజ్రాయెల్-జోర్డాన్ మధ్య ఉన్న డెడ్ సీ ప్రపంచంలోనే అత్యధిక ఉప్పునీరు ఉన్న సముద్రం ఇదే. ఈ సముద్రం చుట్టూ ఎలాంటి జీవరాశులు ఉండవు. దానికి కారణం ఉప్పు నీరే. ఈ నీటిలో ఏ జీవి మనుగడ సాధించలేదు. సాధారణ సముద్రపు నీటి కంటే 10 రెంట్లు ఎక్కువ ఉప్పగా ఉంటుంది. ఎందుకంటే జోర్డాన్ నదికి ఉన్న ప్రధాన ఉప నదులలో ఒక దాని నుంచి నీరు మృత సముద్రంలోకి ప్రవేశిస్తుంది. అలాగే ఈ నదిలో నీటి గాఢత ఎక్కువ ఉంటుంది. ఈ సముద్రంలో ఈతకు వెళ్లిన మనుషులు మునగలేరు.