Ravindra Jadeja Marwari Horses: టీమ్ ఇండియా ఆల్ రౌండర్ రవీంద్ర జడేజా గురించి ప్రత్యేకంగా చెప్పనక్కర్లేదు. అతడికి గుర్రాలంటే చాలా ఇష్టం. మ్యాచ్ నుంచి బ్రేక్ దొరికినప్పుడల్లా ఆయన గుర్రాలతో స్వారీ చేస్తూ ఉంటారు. వాటికి సంబంధించిన వీడియోలను మనం తరచూ సోషల్ మీడియాలో షేర్ చేస్తూ ఉంటాము. కత్తి సాము, గుర్రపు స్వారీ చేస్తూ రాజుగా కనిపిస్తుంటారు. జడేజాకు గుర్రాలలో మార్వారీ జాతి గుర్రాలంటే మరింత ప్రేమ ఎక్కువ. వన్డే ప్రపంచకప్‌లో భాగంగా రీసెంట్‌గా లక్నోలోని ఏక్నా స్పోర్ట్ సిటీ స్టేడియంలో భారత్-ఇంగ్లండ్ మధ్య మ్యాచ్ జరిగింది. ఈ మ్యాచ్‌లో భారత్ 100 పరుగుల ఆధిక్యంతో గెలిచింది. ఈ మ్యాచ్ జరిగే ముందు జడేజా సోషల్ మీడియాలో ఒక పోస్ట్ పెట్టారు. ఆ పోస్టులో జడేజా తన బ్యాట్‌ను చూపించారు. ఆ బ్యాట్‌పై మార్వారీ జాతికి చెందిన గుర్రపు చిహ్నం ఉంది. దీనికి సంబంధించిన పోస్ట్ నెట్టింట వైరల్ అవుతోంది. దాంతో నెటిజన్లు మార్వారీ జాతి గుర్రాల గురించి ఆసక్తిగా వెతుకుతున్నారు. ఇంతకీ మార్వారీ జాతి గుర్రాలేవి? వాటి ప్రాధాన్యత, చరిత్ర, మార్వారీ జాతి గుర్రాలలో ఉండే రంగుల రకాలు. తదితర విషయాల గురించి ఇప్పుడు తెలుసుకుందాం..

గతంలో రాజ కుటుంబీకులు గుర్రాలకు ఎంతో ప్రాధాన్యత ఇచ్చే వారు. మేలు జాతి గుర్రాలను ప్రత్యేకంగా శిక్షణ ఇచ్చే వారు. వివిధ ప్రాంతాల్లో ప్రత్యేకత చాటుకున్న అనేక జాతుల గుర్రాలు మన దగ్గర అశ్వదళాల్లో కనిపించేవి. అయితే ఇప్పుడు రాజవంశాలు లేకపోయినా.. గుర్రాల సంక్షేమం కోసం కొన్ని సంస్థలు ప్రత్యేక శ్రద్ధ తీసుకుంటున్నాయి. అలాంటి వాటిలో మార్వారీ జాతీ గుర్రాలు ఒకటి. భారత ప్రాంతమైన మార్వార్ తీరంలో మార్వారీ జాతి గుర్రాలను కనుగొన్నట్లు చరిత్ర చెబుతోంది. మార్వారీ చరిత్ర మధ్యయుగం నాటిది. ఈ జాతి గుర్రాల పెంపకం, సంరక్షణ రాజ్‌పుత్‌లు చేసే వారట. ముఖ్యంగా రాథోడ్ వంశానికి చెందిన రాజులు ఈ గుర్రాలను వినియోగించేవారు.
మార్వారీలో హార్డీ జాతికి చెందిన గుర్రాలు ఎంతో సున్నితంగా ఉంటాయి. శరీర ఆకృతి భిన్నంగా ఉంటుంది. కండలు తిరిగిన దేహధారడ్యం ఉంటుంది. యుద్ధ సమయంలో రాజులు ఈ గుర్రాలనే ఎంపిక చేసే వారు. ఇవి ఎక్కువ సేపు అలసిపోవు. ప్రమాదాన్ని ముందే పసిగడుతాయి. ఎడారి ప్రాంతాల్లోనూ ఎక్కువ దూరం ప్రయాణించగలవు. వీటి చెవులు ప్రత్యేకమైనవి. ఇవి వీటి చెవులను తాకినప్పుడు లోపలికి వంకరగా తిప్పగలవు. ఇవి ఎక్కువగా అధైర్య పడవు. వేగాన్ని అదుపు తప్పవు. ఈ జాతి గుర్రాలు రాజస్థాన్‌లో ఎక్కువగా ఉంటాయి.
మార్వారీ జాతి గుర్రాలు అద్భుతమైన వినికిడిని కలిగి ఉంటాయి. దీనిపై స్వారీ చేసే వ్యక్తి నియమాలను తూచా తప్పకుండా పాటిస్తాయి. తెలివి తేటలు ఎక్కువే. వీటిలో ఎరుపు, బూడిద, బే మార్వారీ, ఫైబాల్డ్ వంటి గుర్రాలు అత్యంత ఖరీదైనవి. నల్ల రంగు గుర్రాన్ని దురదృష్టకరంగా భావిస్తారు. ఒక వేళ గుర్రం నుదిపై తెల్లటి మచ్చ ఉన్నట్లయితే అది యజమానికి అదృష్టం, సంతోషాన్ని తీసుకొస్తాయని పలువురి నమ్మకం. అలాగే తెల్ల గుర్రాలు ఎంతో ప్రత్యేకమైనవి. వీటిని పవిత్రంగా భావిస్తారు. పురాణాల ప్రకారం మార్వారీ జాతి గుర్రాలను క్షత్రియుల అత్యున్నత కులానికి మాత్రమే కేటాయించేవారు. వేగం, ఓర్పు, అందం, తెలివితేటలను కలిగి ఉన్న ఈ గుర్రాలు భారత సైన్యంలో అంతర్భాగంగా మారాయి. మొఘలుల కాలంలో మార్వారీ గుర్రాలకు ప్రత్యేక హోదాతో గుర్తింపునిచ్చేవారు.

మార్వారీ జాతి గుర్రాలు శుభ్రతను ఎక్కువగా కలిగి ఉంటాయి. వీటికి ప్రత్యేక ఆహారాన్ని అందించేవారు. రాజస్థాన్‌లోని ఏడారి ప్రాంతంలో పుట్టిన ఈ దేశీ జాతి గుర్రాలను ఇతర దేశాలకు ఎగుమతి చేస్తూ ఉంటారు. వీటిని దేశ గౌరవంగా భావిస్తారు. ప్రత్యేక గుర్తింపు పొందిన గుర్రాల జాతుల్లో మార్వారీ గుర్రాలది అత్యుత్తమ జాతి. ఇవి అందంగా, బలంగా ఉంటాయి. ఎక్కువ కాలం బతికేవిగా ప్రసిద్ధి చెందాయి. దశాబ్ధ కాలంగా జోధ్‌పూర్‌లోని ఎంహఎచ్ఎస్ఆర్ఎస్ మార్వారీ గుర్రపు జాతిని పరిరక్షిస్తూ వస్తోంది. ఈ గుర్రాలను విదేశీ హార్స్ లవర్స్, హార్స్ రైడర్స్ కోసం ఎగుమతులకు ప్రయత్నిస్తోంది.
మార్వారీ జాతి గుర్రాలు జోధ్‌పూర్ రాజకుటుంబాలకు సంబంధించిన ఉమైద్ భవన్ ప్యాలెస్ పరిధిలోని బాల్ సమంద్ లేక్ ప్యాలెస్ మార్వార్ స్టడ్‌కు చెందినవి. ఇవి ఎంహెచ్ఎస్ఆర్ఎస్‌లో ‘మార్వారీ గుర్రాలు’గా నమోదయ్యాయి. వీటి ఎగుమతి కోసం ఎంహెచ్ఎస్ఆర్ఎస్, కేంద్ర యానిమల్ హస్బెండరీ డిపార్ట్‌మెంట్ నుంచి నో అబ్జెక్షన్ సర్టిఫికెట్ కూడా పొందింది. ఈ గుర్రాలను విదేశాలను ఎగుమతి చేయడానికి డైరెక్టర్ జనరల్ ఆఫ్ ఫారిన్ ట్రేడ్ నుంచి లైసెన్స్ కూడా పొందాయి.