Basavaraj Bommai: కర్ణాటక అసెంబ్లీ ఎన్నికల్లో కాంగ్రెస్ విజయ దుందుభి మోగించింది. కాంగ్రెస్ పార్టీ 136 స్థానాల్లో విజయం సాధించింది. బీజేపి కేవలం 64 స్థానాలకే పరిమితం అవ్వగా, కింగ్ మేకర్ అవుతామని భావించిన కుమార స్వామి పార్టీ జేడీఎస్ మరీ ఘోరంగా 20 స్థానాలకే పరిమితం అయ్యింది. ఘన విజయంతో కాంగ్రెస్ పార్టీ సంబరాలు చేసుకుంటోంది. కాగా ఓటమిపై కర్ణాటక ముఖ్యమంత్రి బసవరాజు బొమ్మై స్పందించారు.

కర్ణాటక ఎన్నికల్లో తాము అనుకున్న మేర స్థానాలు సాధించలేకపోయామన్నారు. శుక్రవారం ఎన్నికల కౌంటింగ్ సరళిపై విశ్లేషించిన తర్వాత ఆయన మీడియాతో మాట్లాడారు. ఓటమిని ఆయన హుందాగా అంగీకరించారు. ఈ ఎన్నికల్లో ఓటమిపై తాము విశ్లేషించుకుంటామని చెప్పారు. ప్రజా తీర్పును శిరసావహిస్తామని ఆయన అన్నారు. ఈ ఎన్నికల ఫలితాలను దృష్టిలో పెట్టుకి లోక్ సభ ఎన్నికల నాటికి పార్టీని ఎలా బలోపేతం చేయాలన్న దానిపై దృష్టి పెడతామని తెలిపారు. పార్టీ ఓటమికి గల కారణాలపై విశ్లేషించుకుని ముందుకు వెళతామని అన్నారు. ఈ ఓటమికి తాము కుంగిపోవడం లేదనీ, రెట్టించిన ఉత్సాహంతో పని చేస్తామని బొమ్మై పేర్కొన్నారు.
కాగా అసెంబ్లీ ఎన్నికల్లో ఓటమికి పూర్తి బాధ్యత వహిస్తూ సీఎం బసవరాజు బొమ్మై తన పదవికి రాజీనామా చేయనున్నారు. సాయంత్రం గవర్నర్ ను కలిసి తన రాజీనామా పత్రం సమర్పించనున్నట్లు తెలుస్తొంది.