స్కెచ్ వేసినా వర్కౌట్ గాని ఫేక్ ఫేస్బుక్ ప్లాన్!ఆ అధికారి మిత్రులు అదృష్టవంతులే!!

ప్రకాశం జిల్లా రెవెన్యూ అధికారి గాను, కనకదుర్గమ్మ,సింహాచలం ఆలయాల కార్యనిర్వహణాధికారి గాను పనిచేసి ఇటీవలే పదవీ విరమణ చేసిన రిటైర్డ్ జాయింట్ కలెక్టర్ చిగిలిపల్లి నర్సింగ రావును సైబర్ నేరస్థులు టార్గెట్ చేశారు.

సోషల్ మీడియాలో యాక్టివ్గా ఉండే నర్సింగరావుకు ఫేస్బుక్ ఖాతా ఉండగా..కేటుగాళ్లు ఆయన పేరిట నకిలీ ఫేస్బుక్ ఖాతా తెరిచి అందినంత దండుకొనే ప్లాన్ వేశారు.అయితే నర్సింగరావుకి మంచి ఫ్రెండ్ సర్కిల్ ఉండటంతో వారి ఎత్తుగడలు ఫలించలేదు.కొద్దిగా పేరుమార్చి చిగిలేపల్లి నర్సింగరావు పేరిట నకిలీ ఫేస్బుక్ ఖాతా తెరిచిన ఆగంతకులు ఆయన అసలు ఫేసుబుక్కు లో ఉన్న స్నేహితులకు ఫ్రెండ్ రిక్వెస్ట్లు పంపారు.పైగా నకిలీ ఫేస్ బుక్ లో నర్సింగరావు తన మనవడితో ఉన్న ఫొటోను పెట్టడంతో ఎవరికీ అనుమానం రాకుండా పోయింది.చాలామంది ఇది నర్సింగరావు అకౌంటే అనుకుని అందులో కూడా ఫ్రెండ్స్ గా చేరిపోయారు.

అప్పుడు ఆగంతకులు తమ డ్రామా మొదలెట్టారు.తనకు అర్జెంటుగా పదివేల రూపాయలు కావాలని వెంటనే గూగుల్ పే ద్వారా పంపించమంటూ నర్సింగరావు కోరినట్లు వారు కొందరికి మెసి౦జరు లో మెసేజులు పెట్టారు.కానీ నర్సింగరావు ఏ రోజూ ఇలా ఎవరినీ ఆర్థిక సాయం అడిగిన వాడు కాకపోవడంతో అతని స్నేహితులు కొందరికి ఈ ఫేస్బుక్ ఖాతా పై అనుమానం వచ్చింది. పైగా ఏ గూగుల్ పే అకౌంట్ కైతే డబ్బు పంపమన్నారో ఆ ఫోన్ నెంబర్ శైలేంద్ర అనే వ్యక్తికి చెందినదని ట్రూకాలర్లో రావడంతో ఇది నకిలీల వ్యవహారమని వారు కనిపెట్టేశారు.

వెంటనే విషయాన్ని నర్సింగరావుకు తెలియజేశారు.ఆయన అప్రమత్తమై ఫేస్బుక్కులోనే తన పేరిట నకిలీ ఖాతా ఎవరో తెరిచారని, తాను ఎవరినీ డబ్బు అడగలేదని,ఎవరికీ నగదు పంపవద్దని మిత్రులకు తెలియజేయడమే కాకుండా స్థానిక పోలీసులకు కూడా సమాచారం అందించారు.శైలేంద్ర అనేవాడు ఎవడో పోలీసులు కనిపెట్టాలని నర్సింగరావు కోరారు.ఇదిలా ఉండగా ఎప్పుడైతే తమ ప్లాన్ వర్కౌట్ కాలేదో సైబర్ నేరగాళ్లు తమ ఫేక్ ఫేస్బుక్ అకౌంట్ లో తాము పెట్టిన ఫోన్ నంబర్లు తీసేసారు.ఇది ఉత్తరాది ముఠా చర్యగా పోలీసులు భావిస్తున్నారు.బీహార్లో ఇలాంటి గ్యాంగ్ ఉందని వారికి సమాచారం అందింది.కాగా ఫేస్బుక్లో యాక్టివ్గా ఉండే వాళ్లు జాగ్రత్త వహించాలని పోలీసులు సూచించారు. మొత్తం మీద ఈ వ్యవహారం సంచలనంగా మారింది.