మాజీ జడ్జిపై కేసు నమోదు..! తమిళనాడులో ముదిరిన వివాదం..!!

 

నోరు అదుపు, మాట పొదుపు అన్న సామెత పెద్దలు ఊరికే చెప్పలేదు. ఈ సామెత ప్రతి ఒక్కరికీ తెలుసుకదా..! నోరు అదుపు తప్పి మాటలు పేలితే అది అనర్ధాలకు దారి తీస్తుంది. ఎవరో పామరుడు (నిరక్షరాశ్యుడు) నోటికి వచ్చినట్లు మాట్లాడాడు అంటే తెలియక మాట్లాడాడు అనుకోవచ్చు. కానీ అన్ని తెలిసిన వారు, చట్టం తెలిసిన వారు, న్యాయ శాస్త్రాన్ని అవపోసన పట్టిన వారు సైతం నేడు ఇష్టానుసారంగా మాట్లాడం, వ్యాఖ్యలు చేయడం చేసి అడ్డంగా బుక్ అవుతున్నారు. ఒ రిటైర్డ్ న్యాయమూర్తి చేసిన వివాదాస్పద వ్యాఖ్యలపై తీవ్ర దుమారం చెలరేగడంతో ఆయనపై పోలీసులు కేసు నమోదు చేయడం తమిళనాడులో సంచలనం అయ్యింది.

దేశంలోని న్యాయమూర్తులపై సంచలన ఆరోపణలు చేసిన మద్రాస్ హైకోర్టు విశ్రాంత న్యాయమూర్తి జస్టిస్ సీఎస్ కర్ణన్‌పై తాజాగా పోలీసులు కేసు నమోదు చేశారు. ఆయన ఇటీవల చెన్నై పోలీసులు, న్యాయమూర్తుల ప్రవర్తనపై అనుచిత వ్యాఖ్యలు చేస్తూ ఓ వీడియో విడుదల చేశారు. అది సోషల్ మీడియాలో వైరల్ అయ్యింది. ఇది తీవ్ర కలకలాన్ని రేపింది. వివాదాస్పద వ్యాఖ్యలు చేసింది మాజీ న్యాయమూర్తి కావడంతో పోలీసులు ఆయనపై కేసు నమోదు చేయడానికి సాహసించలేదు. ఈ నేపథ్యంలో కర్ణన్ చేసిన వ్యాఖ్యలపై హైకోర్టు సీనియర్ న్యాయవాదులు తీవ్రంగా స్పందించారు. మహిళలను అగౌరవపరిచే విధంగా జస్టిస్ కర్ణన్ ఆరోపణలు చేశారనీ ఆయనపై చర్యలు తీసుకోవాలని కోరుతూ సుప్రీం కోర్టు ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ బొబ్డేకు లేఖ రాశారు. దీంతో పోలీసులు కర్ణన్ పై కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.

విశ్రాంత న్యాయమూర్తి జస్టిస్ కర్ణన్ వివాదాస్పద వ్యాఖ్యలు చేయడం కొత్తేమి కాదు. గతంలోనూ వివాదాల్లో చిక్కుకున్నారు. కోర్టు దిక్కరణ, న్యాయ ప్రక్రియపై అనుచిత వ్యాఖ్యలు చేసిన కేసులో 2017లో ఆరు నెలల పాటు జైలు శిక్ష కూడా అనుభవించారు.