పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ పొలిటికల్ గా బిజీ కావడానికి కంటే ముందు వీలైనన్ని ఎక్కువ సినిమాలను చేయడానికి ఫిక్స్ అయిన విషయం తెల్సిందే. ముందుగా బాలీవుడ్ హిట్ చిత్రం వకీల్ సాబ్ ను మొదలుపెట్టాడు. ఈ సినిమా షూటింగ్ లాక్ డౌన్ కు ముందు దాదాపు 75 శాతం పూర్తయింది. ఇక ఆరు నెలల తర్వాత రీసెంట్ గా మళ్ళీ వకీల్ సాబ్ షూట్ ను మొదలుపెట్టారు.
పవన్ కళ్యాణ్ ఇంకా షూటింగ్ లో చేరలేదు కానీ వచ్చే నెల నుండి షూట్ లో పాల్గొనే అవకాశాలు ఉన్నాయి. వకీల్ సాబ్ తర్వాత క్రిష్ దర్శకత్వంలో పీరియాడిక్ డ్రామాను చేస్తున్నాడు పవన్ కళ్యాణ్. లాక్ డౌన్ కు ముందు ఈ సినిమా షూటింగ్ దాదాపు 15 రోజులు పూర్తయింది. దీని తర్వాత పవన్ చేతిలో మరో మూడు సినిమాలు ఉన్నాయి. అందులో మలయాళం సినిమా అయ్యప్పనుమ్ కోశియుమ్ సినిమా కూడా ఉంది. దీని తర్వాత హరీష్ శంకర్ సినిమా ఉంటుంది. గబ్బర్ సింగ్ కాంబినేషన్ కాబట్టి హరీష్ శంకర్ – పవన్ కళ్యాణ్ సినిమాపై మంచి అంచనాలు ఉన్నాయి. పవన్ కళ్యాణ్ పుట్టినరోజు సందర్భంగా కాన్సెప్ట్ పోస్టర్ ను ఇప్పటికే విడుదల చేసిన సంగతి తెల్సిందే. ఆ కాన్సెప్ట్ పోస్టర్ లో బ్యాక్ గ్రౌండ్ లో ఇండియా గేట్, ముందు ఒక బైక్, సర్దార్ వల్లభాయ్ పటేల్, సుభాష్ చంద్రబోస్ చిత్రాలు ఉన్నాయి. ఓ బైక్ పై పెద్ద బాలశిక్ష పుస్తకం, రోజా పువ్వు వీటన్నిటితో కాన్సెప్ట్ పోస్టర్ ఆసక్తి రేకెత్తిస్తోంది. అలాగే మరోవైపు ఈ సినిమా గురించి ఆసక్తికర కథనాలు వస్తున్నాయి. ఈ చిత్రంలో పవన్ కళ్యాణ్ లెక్చరర్ పాత్రలో కనిపిస్తాడని ప్రచారం జరుగుతోంది. అలాగే మరోవైపు పవన్ పోలీస్ పాత్రలో కనిపిస్తాడని కూడా అంటున్నారు. మరి ఇందులో ఎంతవరకూ నిజముందో తెలియాలంటే మరికొంత కాలం ఆగక తప్పదు.