Kesineni Nani: విజయవాడ టీడీపీ ఎంపీ కేశినేని నాని మరో సారి కీలక వ్యాఖ్యలు చేశారు. నిన్న అధికార వైసీపీ ఎమ్మెల్యే డాక్టర్ మొండితోక జగన్మోహనరావుతో కలిసి ఓ అభివృద్ధి కార్యక్రమంలో పాల్గొనడం, నియోజకవర్గంలో ఎమ్మెల్యే పనితీరుపై ప్రశంసించడం హాట్ టాపిక్ అయ్యింది. రాజకీయాలకు అతీతంగా అభివృద్ధి కార్యక్రమాల్లో అధికార విపక్ష సభ్యులు పరస్పర సహకారం అందించుకోవడం అభినందనీయమైనా ప్రస్తుత రాజకీయ వాతావరణంలో అధికార విపక్ష నేతలు ఒకే కార్యక్రమంలో పాల్గొనడం, పరస్పరం అభినందించుకోవడం రాజకీయ వర్గాల్లో చర్చనీయాంశం అయ్యింది. నిత్యం అధికార పార్టీ నేతలపై విమర్శలు చేసే టీడీపీ నేతలకు ఎంపీ తీరు మింగుడు పడటం లేదు. విజయవాడ టీడీపీ పార్లమెంట్ అభ్యర్ధిత్వంపై గత కొంత కాలంగా రగడ కొనసాగుతోంది. టీడీపీ అధిష్టానం తన అభిప్రాయాన్ని కాదని తన తమ్ముడైన కేశినేని చిన్నిని ప్రోత్సహిస్తుండటంపై కేశినేని నాని గుర్రుగా ఉన్నారు. రానున్న ఎన్నికల్లో విజయవాడ ఎంపీ సీటు కేశినేని చిన్నికి ఇస్తారనే ప్రచారం జరుగుతోంది.

టీడీపీలోని కొందరు మాజీ ఎమ్మెల్యేలు, సీనియర్ నేతలు చిన్నికి మద్దతుగా ఉంటున్నారు. అయితే రాష్ట్రంలో వైసీపీ వేవ్ లోనూ గెలిచిన ముగ్గురు ఎంపీల్లో కేశినేని నాని ఒకరు కావడంతో తనను కాదని వేరే వాళ్లకు ఎలా ఇస్తారనేది నాని వాదన. మొదటి నుండి ముక్కు సూటిగా వ్యవహరించే కేశినేని నాని ఒకొక్క సందర్బంలో పార్టీ అధినేత చంద్రబాబును సైతం లెక్క చేయకుండా తన అభిప్రాయాన్ని నిర్మోహమాటంగా చెబుతూ ఉంటారు. జిల్లాలోని టీడీపీ ముఖ్య నేతలు దేవినేని ఉమా, బొండా ఉమా, బుద్దా వెంకన్న తదితరులతో చాలా కాలంగా విభేదాలు ఉన్నాయి. అందుకే తనకు ఎంపీ టికెట్ ఇస్తే ఇస్తారు, లేకుంటే లేదు అన్నట్లు గా వ్యవహిస్తూ తన దైన శైలిలో ముందుకు వెళుతున్నారు. నిన్న వైసీపీ ఎమ్మెల్యేతో కలిసి కార్యక్రమంలో పాల్గొనడం, ఆయనను ప్రశంసించడంపై చర్చనీయాంశం అవుతున్న నేపథ్యంలో ఆ విషయంపై క్లారిటీ ఇస్తూ కీలక కామెంట్స్ చేశారు కేశినేని నాని.
తాను, తన కుటుంబం జీవితాంతం రాజకీయాల్లో ఉండాలని భావించే వ్యక్తిని కాదనీ అన్నారు. మంచి పనులు ఎవరు చేస్తే వారిని అభినందించడం తన నైజమన్నారు. ప్రతిపక్ష పార్టీగా అధికార పక్షం తప్పులు చేస్తే విమర్శిస్తాననీ, నిలదీస్తామని అన్నారు. ప్రజావేదిక కూల్చిన సమయంలో జగన్ నిర్ణయాన్ని తప్పుబట్టిన విషయాన్ని గుర్తు చేశారు. తనకు వైసీపీ ఎమ్మెల్యే మొండితోక జగన్మోహనరావు నాలుగేళ్లుగా తెలుసుననీ, అన్నదమ్ములు ఇద్దరూ మంచి పనులు చేస్తుండటం వల్లనే ప్రశంసించానని చెప్పుకొచ్చారు. అభివృద్ధి విషయంలో రాజకీయాలకు అతీతంగా సహకరించడంలో తప్పేముందన్నారు. తనకు విజయవాడ పార్లమెంటరీ నియోజకవర్గ అభివృద్ధే ముఖ్యమని అన్నారు.
చీకటి స్నేహాలు తనకు లేవని అంటూ అక్రమ క్వారీయింగ్ లలో వాటాలు రాకపోతే ధర్నాలు చేయడం తన నైజం కాదంటూ పరోక్షంగా తమ పార్టీ నేతలపై చురకలు వేశారు. తాను ప్రాతినిధ్యం వహిస్తున్న విజయవాడ పార్లమెంట్ కు ఎవరు మంచి చేస్తే వాళ్లతో కలుస్తానని అన్నారు. గతంలో కేసిఆర్ తెలంగాణ కోసం గొంగలి పురుగును ముద్దాడుతానన్న మాటలను కేశినేని గుర్తు చేస్తూ ఆ విధంగా తాను కూడా అభివృద్ధి కోసం ఎవరితోనైనా ముళ్ల పందితో అయినా కలుస్తానని పేర్కొన్నారు. నీచ రాజకీయాలు, కుటిల రాజకీయాలు చేయడం తన వల్ల కాదనీ అన్నారు. మళ్లీ నాటు టికెట్ వస్తుందా రాదా.. మళ్లీ ఎంపీ అవుతానా లేదా అన్న ఆలోచన లేదన్నారు. ప్రజా ప్రతినిధిగా అవకాశం లేకపోతే తన సొంత ఆఫీసు ద్వారా సేవా కార్యక్రమాలు చేస్తానని చెప్పుకొచ్చారు కేశినేని నాని.
CM YS Jagan: బందర్ పోర్టుకు శంకుస్థాపన చేసిన సీఎం జగన్ .. చంద్రబాబుపై మరో సారి విమర్శనాస్త్రాలు