అసిస్టెంట్ డైరెక్టర్ గా తెలుగు సినీ ఇండస్ట్రీలో అడుగుపెట్టి.. అష్టా చమ్మా అనే సినిమా తో వెండితెరకు పరిచయమైన నటుడు నాని. ఆ తరువాత చాలా సినిమాల్లో నటించి మంచి నటునిగా గుర్తింపు తెచ్చుకున్నాడు నాని. తనదైన శైలిలో నటిస్తూ ఇటు మాస్.. అటు క్లాస్ ఆడియన్స్ ను అలరిస్తూ న్యాచురల్ స్టార్ గా పేరు సంపాదించుకున్నారు. హిట్లు ప్లాపులతో సంబంధం లేకుండా ఆయనకు అవకాశాలు వస్తుండటంతో వరుసపెట్టి సినిమాలు చేస్తున్నారు.
సినిమాల్లో నటిస్తూనే ఢీ ఫర్ దోపిడీ అనే సినిమాను తీసి నిర్మాతగా మారారు. ఆ! అనే సినిమాతో నిర్మాతగా మంచి గుర్తింపు తెచ్చుకున్నారు. ఇటీవల నాని నటించిన “వీ” సినిమా భారీ అంచనాల మధ్య అమెజాన్ ప్రైమ్ లో విడుదల అయింది. అయితే ఏ సినిమా అనుకున్న స్థాయిలో విజయం సాధించలేకపోయింది. దీని ప్రభావం నాని సినీ అవకాశాల మీద ఉంటుందని అందరూ అనుకున్నారు. కానీ.. హిట్లు ప్లాపులతో సంబంధం లేకుండా ఆయనకు అవకాశాలు క్యూ కడుతున్నాయి. ఈ క్రమంలో నే ఆయన రెమ్యునరేషన్ సైతం భారీగా తీసుకుంటున్నారని టాలీవుడ్ టాక్.
ప్రస్తుత కరోనా పరిస్థితులు నేపథ్యంలో సినీ ఇండస్ట్రీలో రెమ్యూనరేషన్ లు భారీగా తగ్గించాలని నిర్మాతలు నిర్ణయం తీసుకున్న సంగతి తెలిసిందే. అయితే, చిత్రానికి హీరో… మరీ ముఖ్యంగా మార్కెట్ చేయడంలో వారి పాత్ర కీలకంగా ఉండటంతో వీరి రెమ్యునరేషన్ తగ్గించకుండా.. ఇతర నటుల పారితోషకాలు తగ్గిస్తున్నారట. ఈ నేపథ్యంలో నే హీరో నానికి సంబంధించి ఓ హాట్ టాపిక్ టాలీవుడ్ లో చక్కర్లు కొడుతోంది.
న్యాచురల్ స్టార్ నాని తదుపరి చిత్రం.. ప్రముఖ నిర్మాత వెంకట్ బోయినపల్లి తో చేస్తున్న శ్యామ్ సింగరాయ్ లో నటించేందుకు రికార్డ్ స్థాయిలో పారితోషికం తీసుకుంటున్నారట. సుమారు 30 కోట్ల రూపాయలు పెట్టి తీస్తున్న ఈ సినిమాకు రూ. 9 కోట్ల రెమ్యునరేషన్ ను నాని తీసుకుంటున్నారని సినీ వర్గాల్లో జోరు చర్చ జరుగుతోంది. అయితే, ఆయనకు ఉన్న డిమాండ్ అలాంటిది మరి అని కొందరు అంటుండగా.. ప్రస్తుత పరిస్థితుల్లో నిర్మాతలు సాహసమే చేస్తున్నారంటూ పలువురు పెదవి విరుచుతున్నారు.