‘పని తీరు చూసి ఓటు వేయండి.. పొరుగు రాష్ట్రాల నేతల మాటలు నమ్మి మోసపోవద్దు’

 

ప్రభుత్వం పనితీరు, నాయకుడు పనితీరు చూసి ప్రజలు ఓటు వేస్తే మంచి నాయకులు రాజకీయాల్లో ఉంటారని ముఖ్యమంత్రి, టిఆర్ఎస్ అధినేత కెసిఆర్ అన్నారు. గ్రేటర్ ఎన్నికల నేపథ్యంలో ఎల్బీ స్టేడియంలో జరిగిన టిఆర్ఎస్ ప్రచార సభలో కెసిఆర్ ప్రసంగించారు. ఈ సందర్భంగా కేంద్రంలోని బిజెపి తీరును, ప్రచారం కోసం వస్తున్న నాయకుల వైఖరిని తీవ్రస్థాయిలో విమర్శించారు.

ప్రజలు ఓటు వేసే ముందు విజ్ఞతతో ఆలోచించాలన్నారు. చావు నోట్లో తల పెట్టి తెలంగాణ సాధించుకున్న విషయాన్ని గుర్తు చేస్తూ రాష్ట్రాన్ని సాధించిన తర్వాత ఏ విధంగా అభివృద్ధి ఆశిస్తున్నామో వివరించారు. దేశం నలుమూలల నుంచి హైదరాబాద్ వచ్చి పడిన వారిని తమ బిడ్డల గానే చూస్తున్నామని, ఆదరిస్తున్న మని అన్నారు. హైదరాబాదుకు చైతన్యవంతమైన చరిత్ర ఉందని పేర్కొన్నారు. తలసరి విద్యుత్ వినియోగం లో తెలంగాణ ప్రథమ స్థానంలో ఉందని కేంద్రమే అంగీకరించిందని, తెలంగాణ ఆవిర్భావం తర్వాత సాధించిన మొదటి ఘనత ఇది అని చెప్పారు. ఎంతో కృషి పట్టుదల తో కోతలు లేకుండా విద్యుత్ అందిస్తున్నామన్నారు.

దేశంలో వరదలు రాని రాష్ట్రమంటూ ఏదీ ఉండదని, ముంబై, చెన్నై, బెంగళూరు, ఢిల్లీ లకు వరదలు వచ్చాయని గుర్తు చేశారు. హైదరాబాద్ కు వరదలు వస్తే బాధితులను ఆదుకోవడానికి దేశంలో ఏ రాష్ట్రంలో ఇంతవరకూ ఇవ్వని విధంగా ఇంటికి పది వేల చొప్పున పంపిణీ చేపట్టామన్నారు. కేంద్రం నుంచి నయాపైసా కూడా సాయం అందించలేదు అని చెబుతూ ఈ సన్నాసులు వరద సాయం పంపిణీకి కిరికిరి పెట్టారని విమర్శించారు.వివిధ నగరాల్లో వరదలు వచ్చినప్పుడు వారికి సాయం చేసిన ప్రధాని మోడీ హైదరాబాద్ విషయంలో ఎందుకు ఇవ్వలేదని ప్రశ్నించారు. హైదరాబాద్ నష్టం వస్తే సాయం చేయలేని వారు ఇప్పుడు ఓట్ల కోసం ఎగబడి మరీ వస్తున్నారని కెసిఆర్ విమర్శించారు. హైదరాబాద్ నడిబొడ్డులో ఉన్న ఎన్నో పారిశ్రామిక సంస్థలను నగరం అవతలకి తరలించే ప్రణాళిక చేస్తున్నామని, మెట్రో రైలు ఎయిర్పోర్ట్ వరకు పొడిగిస్తామని హామీ ఇచ్చారు. హైదరాబాదులో ఎయిర్ క్వాలిటీ పెంచేందుకు అన్ని రకాల చర్యలు తీసుకుంటున్నామన్నారు. గోదావరి తో అనుసంధానం చేసి మూసీ నదిని అందమైన నదిగా మారుస్తామని పేర్కొన్నారు. హైదరాబాదులో శాంతిభద్రతలు ఎంత చక్కగా ఉన్నాయో అందరికీ తెలుసన్నారు. హైదరాబాదులో ఉన్నన్ని సీసీ కెమెరాలు దేశంలోనే ఏ నగరంలో లేవని అన్నారు. కేంద్రం తెలంగాణపై వివక్షత చూపుతుందని విమర్శించారు.

ఫ్రెంట్ పెడతానని తానేమైనా చెప్పానా, ఎందుకు వణికిపోతున్నారని ప్రశ్నించారు. కెసిఆర్ తలుచుకుంటే ఎలా ఉంటుందో దేశమంతా తెలుసునని అన్నారు. పక్క రాష్ట్రాల నుంచి వచ్చి ముచ్చట్లు చెప్పే వారి మాటలు నమ్మి మోసపోవద్దని హితవు పలికారు. యూపీ సీఎం ఆదిత్యనాథ్ దాస్ గురించి మాట్లాడుతూ 28వ స్థానంలో వచ్చిన ఆయన ఐదో ర్యాంకు లో ఉన్న మన దగ్గరకు వచ్చి మాట్లాడతారా విమర్శించారు. రెండు జాతీయ పార్టీలు దేశాన్ని పాలించడం లో విఫలమయ్యే అని అన్నారు. తాను ఢిల్లీ రాజకీయాల వైపు వస్తానని భయపడుతున్నారని, అందుకే వరదలా నేతలందరూ నగరానికి వస్తున్నారని విమర్శించారు. నగరంలో, రాష్ట్రంలో కులాలకు మతాలకు అతీతంగా సంక్షేమ పథకాలను అందిస్తున్నామని అన్నారు.అద్భుత నగరంగా తీర్చిదిద్దేందుకు అన్ని డివిజన్ లను టిఆర్ఎస్ అభ్యర్థులను అఖండ మెజార్టీతో ప్రజలు గెలిపించాలని ఈ సందర్భంగా విజ్ఞప్తి చేశారు.