ఆ ప్రచారంలో నిజం లేదు – ఉత్తమ్

 

హైదరాబాద్‌  డిసెంబర్ 28:  తెలంగాణాలో కాంగ్రెస్ ఓటమికి ఏపి సిఎం చంద్రబాబు కారణం అన్న ప్రచారంలో ఏమాత్రం నిజంలేదని  టిపీసీసీ అధ్యక్షుడు ఉత్తమ్ కుమార్‌రెడ్డి అన్నారు. శుక్రవారం ఆయన మీడియాతో  మాట్లాడుతూ పొత్తుల వల్లే ఓడిపోయామనేది సరికాదని, పొత్తులపై కొంత ముందుగా నిర్ణయం తీసుకుంటే  కూటమికి  ప్రయోజనం చేకూరేదని అభిప్రాయపడ్డారు. ఓటమిపై సమీక్షించుకుని, వచ్చే పార్లమెంటు ఎన్నికల్లో మంచి ఫలితాలు సాధిస్తామని ఆశాభావం వ్యక్తం చేశారు. పోలైన ఓట్లకు, లెక్కించిన ఓట్లకు తేడా ఉందని, ఒక్క శాతం ఓట్ల తేడా ఉన్నా కొన్ని నియోజకవర్గాల్లో ఎన్నికల అధికారులు వీవీప్యాట్ స్లిప్‌లను లెక్కపెట్టలేదన్నారు. ఎన్నికల్లో చోటుచేసుకున్న తప్పులను రాష్ట్ర ఎన్నికల కమిషన్, కేంద్ర ఎన్నికల సంఘానికి ఫిర్యాదు చేసినా కనీస స్పందన కరువైందని అన్నారు. సీఎం కేసీఆర్ ప్రమాణస్వీకారం చేసి రెండు వారాలు గడుస్తున్న ఇప్పటి వరకూ ఎమ్మెల్యేలు ప్రమాణ స్వీకారం చేయకపోవటం, అసెంబ్లీని సమావేశపర్చకపోవటం దారుణమని విమర్శించారు. లోక్‌సభ ఎన్నికల్లో పొత్తులపై అధిష్ఠానం చెప్పినవిధంగా నడుచుకుంటామన్నారు.