NewsOrbit
వ్యాఖ్య

నిష్క్రమణ!

ఏదైనా భరించలేని సంఘటన జరిగినప్పుడు ఒక కథ రాయాలని ఎప్పటి నుంచో అనుకుంటున్నాను. కానీ ఆ కథ ఇప్పటి వరకూ మొదలు కాలేదు. మొన్న తొమ్మిది నెలల పసి మొగ్గ నెత్తురు తాగిన మగ జంతువు గురించి విన్నప్పుడు దిగాలు పడిపోయాను. సరిగ్గా అప్పుడే నేను రాయాలనుకుంటున్న కథలోని ముఖ్య పాత్ర నా ముందుకొచ్చి కూర్చున్నాడు.

‘’ ఎప్పటి నుండి అనుకుంటున్నావు నా కథ గురించి? అసలు షురూజేస్తావా లేదా? స్టార్టింగ్ ప్రాబ్లమా?  ఇప్పుడింత జరిగింది కదా కనీసం ఇప్పుడైనా నీ లోపలి కన్నీరు బయటకు ఉరకదా?  కన్నీటి నుండి అక్షరాలు వికసించవా? నేను నీ ఆలోచనల చీకటి గుయ్యారంలోనే ఉండిపోతానా? వెలుగు చూసేది లేదా?’’  ఇలా ఒకటే ప్రశ్నలు.  ఓరి వీడి దుంప తెగా. నేను రాయక ముందే నన్ను నిలదీస్తున్నాడు. రాశానంటే ఇంకేమంటాడో మరి. సరే చూద్దాం. కథ కొంచెం వీడితో డిస్కస్ చేద్దాం అనుకున్నాను.

‘’ చూడూ పెద్ద మనిషీ నేనేం రాయాలనుకుంటున్నానో నీకు తెలుసా?’’ తీరుబడిగా అతని వాలకం పరిశీలనగా చూస్తూ క్వశ్చనించాను.

‘’ అసలు నీకే ఒక క్లారిటీ లేదేమో అని నా అనుమానం. ఎప్పుడో గుజరాత్ అల్లర్లప్పుడు మొదలైంది నా క్యారెక్టర్ డిజైన్ చేయడం. ఇంకా పూర్తి కాలేదు. అసలు నన్నేం చేయాలనుకుంటున్నావ్. ముందే నా ముగింపు చెప్పు.’’ గదమాయించాడు. అతనికో పేరు పెడదాం. ఆ.. అనామకుడు అనేసుకుంటే సరి.

‘’ చూడు అనామక్ నిన్ను చంపేద్దామనుకుంటున్నాను.’’  అదిరిపడతాడనుకున్న అనామకుడు చిన్న స్మైలిచ్చుకున్నాడు.

‘’అది నాకు ముందే తెలుసు. నువ్వెప్పుడూ ఎండింగ్ ముందనుకుని కథ మొదలు గురించి ఆలోచిస్తావు.’’

ఓర్నాయనో వీడి తెలివితేటలు బర్నయిపోనూ.

‘’ఓహో అయితే నువ్వే చెప్పేయ్. నిన్ను నేను ఎలా క్రియేట్ చెయ్యాలనుకుంటున్నానో..నువ్వు ఎలా మరణించబోతున్నావో అన్నీ చెప్పేయ్. నా పని వీజీ అయిపోతుంది. కథ కాగితం మీదకెక్కి కూర్చుంటుంది.’’ నా మాటలకి నా వంక ఎగాదిగా పైకీ కిందకీ ఊపర్ నీచే చూశాడు.

‘’చెప్పమంటావా! నువ్వు నన్ను ముందు అల్జీమర్స్ రోగిని చెయ్యాలనుకున్నావు. ఎవరికైనా తెలియకుండా వస్తుంది ఆ వ్యాధి. నాకు తెలిసే వస్తుంది. రావడమేంటి నా పిచ్చి ఫేసూ. నేనే తెచ్చుకుంటాను. నిర్భయ ఘటన జరిగినప్పుడు ఇక లాభం లేదని  నీ మెదడు కంప్యూటర్ స్క్రీన్ ఓపెన్ చేసి నాకు కాలింగిచ్చుకున్నావు.’’

‘ఒరేయ్ మర్చిపోరా. అన్నీ కొంచెం కొంచెం మర్చిపోరా’ అని చెప్పావు. చెప్పావా లేదా? ‘మనమిక్కడేం చేయలేంరా. కొన్ని వార్తలు చూడలేం. చూసి తట్టుకోలేం. అలాంటివి జరక్కుండా ఆపలేం. జరిగినవి చూస్తే గుండె భరించలేదు. మరేం చేయాలిరా. అలాంటి వార్తలు వినొద్దు. చూడొద్దు. ఎవరైనా చెప్పినా పట్టించుకోవద్దు. అయినా అవి మనల్ని తరుముతూ వుంటాయి. అందుకే మతిమరుపు అంటే అల్జీమర్స్ రావాలి మనకు’  అన్నావు. నువ్వు చెప్పినట్టే వినుకున్నాను. అలాంటి వార్తలు చెవిన పడనివ్వలేదు. నువ్వు చెప్పినట్టే నడుచుకున్నాను. అలాంటి వార్తలు మర్చిపోయే ప్రయత్నం బలవంతంగా అభ్యసించాను. ఆ తర్వాత మళ్ళీ కొంత కాలం నన్ను నువ్వు పట్టించుకోలేదు. ఆ..ఒకసారి సముద్రపొడ్డున సిరియా బాలుడి శవాన్ని చూసినప్పుడు నేను నీకు గుర్తుకొచ్చాను. ఏరా నీ అభ్యాసం ఎంతదాకా వచ్చిందని అడిగావు. పేపర్లు చదవడం మానేశాను. టీవీ చూడ్డం ఆపేశాను. క్రమక్రమంగా తోటి మార్నింగ్ వాకర్లు చెప్పేవి వినడం బంద్ చేశాను. అయినా ఏవో ఒకటి గుర్తుకొస్తూనే ఉన్నాయి. ఏం చేయాలో తోచక నేను చస్తున్నాను. నువ్వు పట్టించుకోవడం మానేశావు. ఒక సలహా లేదు గిలహా లేదు.’’ అనామకుడు నా మీద ఎటాక్ మొదలు పెట్టాడు.

‘’ ఏం చేయనురా అనామక్. నిన్నేం చేయాలో నీ కథ ఎలా నడపాలో అర్థమై చావడం లేదే.’’ బుర్ర గోక్కుంటూ వాడి వంక అలా చూస్తూనే వున్నాను.

‘’ అవునోయ్ నాకు తెలుసు. నేను నీకు గుర్తు రావాలంటే ఏదో ఒకటి జరగాలి. ఆవు మాంసం తిన్నాడన్న అనుమానంతో  అఖ్లాక్ ని చంపేశారు కదా. అప్పుడు. మరో కుర్రాడిని కూడా అలాంటి అనుమానంతోనే రైలు బండిలో చంపేశారే అప్పుడూ. అక్కడెక్కడో నలుగురు కుర్రాళ్ళని ఆవు చర్మం సప్లయ్ చేస్తున్నారని గొడ్డును బాదినట్టు బాదేశారే అప్పుడూ. ఇలా ఏవోవో రిపీటెడ్ ఘటనలు రిపీటవుతూనే ఉన్నప్పుడు నువ్వు నన్ను పైకి తీస్తావు. నా అల్జీమర్స్ వ్యాధి ఎంత వరకూ వచ్చిందో టెస్ట్ చేసుకుంటావు. మళ్ళీ లోపలికి పంపేస్తావ్. నా కథ కాగితం మీదైతే పెట్టడం లేదు కాని నా పాత్రకు అన్ని నగిషీలూ చెక్కుతూనే ఉన్నావుగా. నీ కోరిక మేరకు నాకిప్పుడు ఏమీ గుర్తుండడం లేదు. జరిగిన ఘటనలే కాదు. జరుగుతున్నవి కూడా పట్టడం లేదు. ఇంటా బయటా ఎదురయ్యే మనుషులు మాట్లాడే మాటలు కూడా చెవులు దాటి లోపలికి జొరబడ్డం లేదు. నువ్వు  మొన్నటికి మొన్న ఆ ప్రణయ్ హత్య గురించి విని గిలగలా కొట్టుకున్నావే. ‘ ప్రేమించి పెళ్ళి చేసుకో అని పాటలెందుకు వినిపిస్తారు? ప్యార్ కియాతో డర్నా క్యా అని సినిమాలెందుకు చూపిస్తారు? చివరికి ప్రేమించినందుకు కత్తులతో ఇలా గొంతులెందుకు కోస్తారు ’ అని నువ్వెంత విలవిల్లాడిపోయావు? నాకప్పటికే నువ్వు కోరుకున్నట్టు పూర్తి అల్జీమర్స్ నిలువునా ముట్టడించింది. నన్ను ఆపాదమస్తకం ఆక్రమించింది. ఎవరేం జెప్పినా నాకేం అర్థం కాలేదు. ఇక ఇంట్లో వారు కూడా నాకు పూర్తి స్థాయి అల్జీమర్స్ అని నిర్ధారణకొచ్చేశారు. నీ క్రియేషన్ వండర్ఫుల్ కవీ. ఇంక నన్ను ఏ ఘటనా ఏం చేయలేదు. మరి నా మరణమే ఎప్పుడా అని ఎదురు చూస్తున్నాను.’’

‘’ తొమ్మిది నెలలు అమ్మ గర్భంలో వుంది. తొమ్మిది నెలలే బయట వుంది. ఇంకా ఆకాశాన్నీ నేలనీ ఈ ప్రాణికోటినీ వాటి వికట వికృత విన్యాసాలనీ చూసేంతగా కళ్ళు విచ్చుకోనే లేదు. ఆ క్రూరాడు బిడ్డను బలితీసుకున్నాడు. ఇంకా ఎందుకురా ఆలోచన? నన్ను చంపేయ్. నేనింక బతకలేను. చూడలేను.’’ అనామకుడు జలజలా తడిసిపోతున్నాడు.

‘’ నిన్ను అంతం చేయాలన్నదే నా కథ అంతిమ లక్ష్యం.  కానీ ఇలా లోకంలో జరిగేవి పట్టించుకోకుండా వాటిని వ్యతిరేకించి లోకాన్ని చక్కదిద్దే పనులేమైనా నేను సైతం అని చేయకుండా పారిపోవడం పిరికితనం కాదా? వీరమరణం పొందాలి గాని ఈ పిరికి మరణం ఏంటి. దీనితో నేనేం సందేశం ఇస్తున్నాను?  అని నన్నందరూ నిలదీస్తారేమో అని చిన్న డౌటొచ్చి హెజిటేటిస్తున్నానంతే. ‘’

నా మాటలు విన్న అనామకుడు. చెంగున లేచాడు. నా మీద ఆటవికంగా చూశాడు. నీ క్యారెక్టర్ మీద నీకే నమ్మకం లేదు. నీ ఆలోచనల మీద నీకే నమ్మకం లేదు. నాకింతగా స్లోపాయిజనిచ్చి..బతికుండగానే చంపేసి..ఇప్పుడు హెజిటేటింగా. ఓరి దుర్మార్గుడా. మీ రచయితల్ని అసలు నమ్మకూడదురా బాబూ.  పో. నీతో నాకేంటి పని? నా చావు నేను చస్తాను అని మాయమైపోయాడు. వెంటనే తేరుకుని కథ పూర్తిచేశాను. అనామకుడు రాను రాను ఇంట్లో వారితో కూడా మాట్లాడ్డం వినడం మానేశాడు కదా. ఒకరోజు బాత్ రూంలో గుండెపోటుతో కిందపడి కొట్టుకున్నాడు. ఎవరినీ పిలవ లేదు. అతను ఎవరినీ ఎలా పట్టించుకోవడం లేదో, అందరూ అతణ్ణి అలానే పట్టించుకోవడం మానేశారు.  ఇంట్లో అంతా ఎవరి పని మీద వారు బయటకు వెళ్ళిపోయారు. ఎప్పుడో రాత్రికి వచ్చి చూస్తే అతను బాత్ రూంలోనే ఉన్నాడు. తలుపులు బద్దలు కొట్టారు. అతని గుండె బద్దలు కొట్టే సాహసం ఎవరికుంది? అనామకుడు అనామకుడుగానే నిష్క్రమించాడు.

డా.ప్రసాదమూర్తి

Related posts

Holi celebrations: హోలీ కి తెలుపు రంగు దుస్తులనే ఎందుకు ధరిస్తారో తెలుసా.. దీని వెనక ఇంత కథ నడిచిందా..?

Saranya Koduri

Kia sonet: అతి తక్కువ ధరలో ఇండియాలో లాంచ్ అయిన కియా సోనెట్ కార్.. ఫెసిబిలిటీస్ ఇవే..!

Saranya Koduri

Oscar 2024: కొత్త సంవత్సరంలో ఆస్కార్ గెలుచుకోవడానికి సిద్ధమైన ఇండియన్ 12 సినిమాలు ఇవే..!

Saranya Koduri

Allu Arjun: బన్నీ కి భారీ షాక్ ఇచ్చిన శ్రీ లీల… ఫుల్ గా ఏకేస్తున్న ఫ్యాన్స్..!

Saranya Koduri

Venkatesh: వెంకీ మామా ఏంటి నీకు ఈ ఘోర అవ‌మానం… ఎంత పెద్ద త‌ప్పు చేశావ్‌..!

Saranya Koduri

Charmi: ” నీ హగ్గులు, లవ్ చాలా మిస్ అవుతున్నా.. తిరిగి మళ్లీ నా లైఫ్ లోకి రా “.. చార్మి సెన్సేషనల్ పోస్ట్..!

Saranya Koduri

Chiranjeevi: చిరు ఫామ్ హౌస్ ఖరీదు తెలిస్తే షాక్ అవ్వాల్సిందే… సీఎం కి కూడా ఈ రేంజ్ ఉండదేమో..!

Saranya Koduri

Balakrishna: బాల‌య్య ప‌క్క‌న ఆ హీరోయిన్… ప‌ర్‌ఫెక్ట్ ఫిగ‌ర్రా బాబు..!

Saranya Koduri

Junior NTR: నందమూరి ఫ్యామిలీ తారక్ ని అందుకే దూరం పెడుతుందా.. బయటపడ్డ అసలు నిజం..!

Saranya Koduri

Chiranjeevi: ప్రశాంత్ వర్మ దర్శకత్వంలో సినిమా వదులుకున్న చిరు.. ఎందుకో తెలుసా..!

Saranya Koduri

Samantha: జీవితంలో అతిపెద్ద తప్పు చేశాను అంటూ మరోసారి తన ఆవేదనను బయటపెట్టిన సమంత..!

Saranya Koduri

నీ ఓటు…మన ఓటు…ప్రతి ఓటు

Deepak Rajula

Google Discover: గూగుల్ డిస్కవర్ లో పొలిటికల్ కంటెంట్ అంతా రాజకీయ నాయకుల న్యూస్ మీడియా దే…ఎన్నికల తరుణం లో అక్కడా ఇక్కడా వీరే!

Deepak Rajula

ఎల్లో జర్నలిజం నడుమ జాతీయ పత్రికా దినోత్సవం…పత్రికా స్వేచ్ఛ ఒక భ్రమ

Deepak Rajula

TDP ChandraBabu: కార్యకర్తలపై కేసులు.. బాబోరీ వెరైటీ కూతలు..!!

sekhar

Leave a Comment