NewsOrbit
వ్యాఖ్య

అనగనగా ఓ రాజరికం!

అనగనగా, ఓ దేశం.
అక్కడ పాలకులను ప్రజలే ఎన్నుకునేవారు.
అలా ఆ దేశానికి ఓ రాజు- ఓ మంత్రి- ఓ సేనాధిపతి ఎన్నికయ్యారు.
మంత్రికి పాలన వ్యవహారాల్లో అనుభవం పుష్కలంగా ఉంది.
సేనానికి సైనిక వ్యవహారాల్లో అపారమైన అనుభవముంది.
రాజుగారికే రాజ్యం చెయ్యడంలో అంతగా అనుభవం లేదు.
అయినప్పటికీ (లేదా, అందుచేతనే….) మంత్రీ, సేనాధిపతీ ఏమైనా చెప్పబోతే రాజు వినేవాడు కాదు.
“ఈ రాజ్యంలో విధాన నిర్ణయాలు చేసే అధికారం నాది.
మీరు నేనడిగితే సలహా చెప్పండి, చేయమన్న పని చెయ్యండి-
మిగతాది నేను చూసుకుంటా” అనేవాడు రాజు.
కొన్నాళ్లపాటు వేచిచూద్దామని అనుకున్నారు మంత్రీ, సేనాధిపతీ.
రాజుగారి ధోరణిలో ఎంతకూ మార్పు రాలేదు.
అంతలో ఎన్నికలు వచ్చేశాయి.
మంత్రీ, సేనాధిపతీ ఏకగ్రీవంగానే ఎన్నికయ్యారు.
రాజు మీద మాత్రం మరో ఇద్దరు రాజవంశీకులు పోటీకి దిగారు.
వాళ్లలో ఒకడికి చెవులు పనిచేయవు.
రెండోవాడికి చెవులూ, కళ్ళూ రెండూ పనిచేయవు.
కానీ, ఇద్దరూ కోతల రాయుళ్లు.
ఒకడు  “చక్ర “ఆయుధాన్ని నేనే కనిపెట్టానని బుకాయించేవాడు.
రెండోవాడు “గరుడ” వాహనం మీద తాను ప్రపంచ యాత్ర చేసివచ్చానని కోసేవాడు.
వాళ్ళిద్దరికన్నా మెదడు పనిచేయని ఇప్పటి రాజే నయమని జనం అనుకున్నారు.
ఎందుకంటే అతను అలాంటి కోతలు కోసేవాడు కాదు మరి!
అంచేతనే ఏమో, అంతా కట్టకట్టుకుని పాత రాజునే గెలిపించారు.
రాజుగారికి ఆత్మవిశ్వాసం అహంభావంగా మారడానికి ఎక్కువ కాలం పట్టలేదు.
జనం నమ్మే కోతలేమైనా కోస్తే, తన ప్రతిష్ట పెరుగుతుందని అతనికి అనిపించింది.
అదే మాట పదే పదే మంత్రీ, సేనానులతో అనడం మొదలుపెట్టాడు.
మంత్రీ, సేనాధిపతీ ఆలోచనలో పడ్డారు.
రాజుగారికి బుద్ధిచెప్పకపోతే రాజ్యం చెడుతుందని వాళ్లకి అనిపించింది.
***
మర్నాడు ముగ్గురూ మారువేషాల్లో రాజధానీ నగరంలోనే సంచారం మొదలుపెట్టారు.
ప్రధాన రహదారుల్లో తిరుగుతున్నా తమను ఎవరూ గుర్తుపట్టక పోవడం రాజుకు నచ్చలేదు.
“ఈ వెర్రిజనం మనం సామాన్యులం అనుకుంటున్నారు. మన సత్తా చూపిస్తే తప్ప వీళ్ళకి మన విలువ తెలిసిరాదు!” అన్నాడు రాజు మంత్రీ, సేనానులతో.
“వాళ్ళలా అనుకోవడమే మనకి శ్రీరామ రక్ష ప్రభూ!” అన్నాడు మంత్రి క్లుప్తంగా.
“మనం ఎవరో వెల్లడైపోతే ప్రమాదం కూడా!!” అన్నాడు సేనాని టూకీగా.
రాజుకి చిర్రెత్తింది.
“ఈ క్షణమే మిమ్మల్నిద్దరినీ పదవుల్లోంచి తొలగిస్తున్నాం!” అని ప్రకటించాడు కూడా!
మంత్రీ, సేనానులు మారుమాట్లాడకుండా రాజు వెంట నడవసాగారు.
రాచనగరులో ఎవరింటికి వాళ్ళు చేరారు.
***
ఆ రాత్రి, మొట్టమొదటిసారిగా, రాజు తెగ బోలెడు  ఆలోచించాడు.
తెల్లారాకా తనమీద పోటీ చేసిన రాజవంశీకుల్ని పిలిపించాడు.
చెవులు పనిచేయని వ్యక్తిని సేనాధిపతిగా నియమించాడు.
కళ్ళూ చెవులూ రెండూ పనిచేయని వ్యక్తిని మంత్రిగా నియమించాడు.
ఇక తన నిర్ణయాధికారానికి ఎదురుండదని సంతోషించాడు.
మధ్యాహ్నం కడుపునిండా మెక్కి, గుండెల మీద చెయ్యేసుకుని, గుర్రుకొట్టి నిద్రపోయాడు.
రాత్రి అయ్యాకా కొత్త మంత్రి సేనానులతో నగర సంచారం మొదలుపెట్టాడు.
దారి పొడుగునా రాజు మాట్లాడుతూనే ఉన్నాడు.
కొత్త మంత్రికి మంత్రాంగం ఎలాచెయ్యాలో వివరంగా బోధించాడు.
అతనికి ఏమీ వినపడకపోయినా “చిత్తం, చిత్తం!” అంటూ వచ్చాడు.
సేనానికి, యుద్ధకళ రహస్యాలు నూరిపోశాడు.
కొత్త సేనానికి ఆ విషయం తెలియకపోయినా, నిమిషానికి ఓ సారి బుర్రూపుతూ పోయాడు.
(అలా చెయ్యమని వాళ్లకి వాళ్ళ భార్యలు సలహా ఇచ్చారు!)
అంతలో వాళ్ళు ముగ్గురూ ఓ కూడలి దగ్గిరకొచ్చారు.
అక్కడ నాలుగు బాటలు కలుస్తున్నాయి.
నాలుగు వైపులనుంచీ నలుగురు బలిష్ఠులైన వ్యక్తులు అకస్మాత్తుగా ఊడిపడ్డారు.
వాళ్ళందరి చేతుల్లోనూ పదునైన ఆయుధాలున్నాయి.
వాళ్ళు తిన్నగా రాజు దగ్గిరకెళ్ళి, కత్తి చూపించారు.
రాజుకు మళ్ళీ చిర్రెత్తింది- ఈ సారి కొత్త మంత్రీ, సేనానుల మీద.
“ఏమిటిది మహా మంత్రీ, వీడెవడో వచ్చి నాకే కత్తి చూపిస్తున్నాడు?
మన సేనాని అలా దేభ్యం మొహం వేసుకుని చూస్తాడేమిటి?” అన్నాడు చిరాగ్గా.
“చిత్తం, చిత్తం!” అన్నాడు కొత్త మంత్రి.
“చిత్తమేమిటి, నీ పిండం? వాడికి చెప్పి చావు!” అన్నాడు రాజు భగ్గుమంటూ.
“చిత్తం, చిత్తం!” అని మళ్ళీ అన్నాడు కొత్త మంత్రి.
రాజుకి విషయం అర్థమయ్యింది.
అప్పటికి నిమిషం అయ్యేసరికి లెక్కప్రకారం సేనాని గంభీరంగా బుర్ర ఊపేశాడు!
***
అంతలో దుండగుల్లో ఒకడు రాజు ఒంటిమీదున్న బంగారం వొలవడం మొదలెట్టాడు.
రెండోవాడు వజ్రాలూ, వైడూర్యాలూ, రత్నాలూ, ముత్యాలూ వొలవసాగాడు
మరొకడు రాజు చెవులకున్న కమ్మలు, తమ్మెంట్లు వగైరాలు వొలిచేయసాగాడు. .
వేరొకడొచ్చి రాజు ఒంటిమీదున్న ఉన్ని, పట్టు, జలతారు వస్త్రాలను ఊడదీయసాగాడు.
ఇంకొకడు రాజు తొడుక్కున్న ఖరీదైన పాదరక్షలు లాగేశాడు.
“వాడికి ఆ కత్తి మాత్రం ఎందుకు? అదీ అలంకారప్రాయమే! తీసుకోండి” అన్నాడొకడు.
అది సేనాని గొంతని రాజు గుర్తు పట్టాడు!
“బాగాచెప్పావ్! ఆ జుట్టూ, మీసం కూడా పెట్టుడివే!” అన్నాడు మరొకడు.
ఆ రహస్యం పాతమంత్రికి తప్ప ఎవరికీ తెలియదు! అంటే….?
రాజుకి కడుపు ఉడికిపోయింది!

***
“మంత్రిగారూ, సేనాధిపతీ! చివరికి ఇలా దార్లు కొట్టడానికి దిగజారతారా?” అని ఉక్రోషంగా అడిగాడు.
“మా ఉద్యోగాలు ఊడబీకేశావుగా! పెళ్ళాం బిడ్డలతో బతకడం ఎలా?” నిలదీశాడు మంత్రి.
“నన్ను ఒక్కణ్ణిచేసి…. ఇలా దెబ్బ తీస్తారా? ఇది మీకు ఉచితమేనా?” అన్నాడు రాజు.
“ఒక్కడివేంటి? ముచ్చటగా ముగ్గురున్నారుగా?” – వెటకరించాడు సేనాని.
వాళ్ళేం మాటాడుకుంటున్నారో అర్థంకాని కొత్త మంత్రి “చిత్తం చిత్తం” అన్నాడు.
నిమిషం పూర్తయ్యేసరికి గంభీరంగా తలూపేశాడు కొత్త సేనాని!
“వాళ్ళని మాత్రం వదిలేయడం ఎందుకూ? కానీయండి” అని సైగ చేశారు పాత మంత్రీ సేనానీ.
కొత్త మంత్రి, కొత్త సేనానుల్ని కూడా నిలువుదోపిడీ చేసేశారు వాళ్ళ మనుషులు.
చెవులు వినబడని, కళ్ళు కనబడని కొత్త మంత్రీ సేనానులు లబోదిబోమని గోల పెట్టారు.
జనం వాళ్ళ గోల విని లేచి అక్కడికి చేరుకున్నారు.
పాత మంత్రీ, సేనాని అక్కడ జరిగిందంతా వివరించారు.
“ఇప్పుడు చెప్పండి- మేం చేసిందానిలో తప్పేమైనా ఉందా?” అని అడిగాడు మంత్రి.
వింటున్నవాళ్లలో ఓ వృద్ధుడు ఉన్నాడు. అతను  దీర్ఘంగా నిట్టూర్చి ఇలా అన్నాడు-
“లేదు బాబూ మీ తప్పేం లేదు, తప్పంతా మాది!
ఎన్నుకునే అవకాశం ఉన్నప్పటికీ రాజుల్నీ మంత్రుల్నీ ఎన్నుకోడం మా తప్పు.
వెర్రిమొర్రి విధానాలు పాటించే పాలకుల్ని మళ్ళీ మళ్ళీ ఎన్నుకోవడం మా తప్పు.
డబ్బుకూ, మందుకూ అమ్ముడుపోవడం మా తప్పు.
కులానికి, మతానికీ ప్రలోభపడడం మా తప్పే మరి!
మీ పని మీరు చేశారు- మా పని మమ్మల్ని చెయ్యనివ్వండి!!”  అన్నాడు ఆ వృద్ధుడు.

****

అలా, రాజరికం చరిత్ర చెత్తబుట్టలో చేరిపోయింది!
 – మందలపర్తి కిషోర్

 

author avatar
Siva Prasad

Related posts

Holi celebrations: హోలీ కి తెలుపు రంగు దుస్తులనే ఎందుకు ధరిస్తారో తెలుసా.. దీని వెనక ఇంత కథ నడిచిందా..?

Saranya Koduri

Kia sonet: అతి తక్కువ ధరలో ఇండియాలో లాంచ్ అయిన కియా సోనెట్ కార్.. ఫెసిబిలిటీస్ ఇవే..!

Saranya Koduri

Oscar 2024: కొత్త సంవత్సరంలో ఆస్కార్ గెలుచుకోవడానికి సిద్ధమైన ఇండియన్ 12 సినిమాలు ఇవే..!

Saranya Koduri

Allu Arjun: బన్నీ కి భారీ షాక్ ఇచ్చిన శ్రీ లీల… ఫుల్ గా ఏకేస్తున్న ఫ్యాన్స్..!

Saranya Koduri

Venkatesh: వెంకీ మామా ఏంటి నీకు ఈ ఘోర అవ‌మానం… ఎంత పెద్ద త‌ప్పు చేశావ్‌..!

Saranya Koduri

Charmi: ” నీ హగ్గులు, లవ్ చాలా మిస్ అవుతున్నా.. తిరిగి మళ్లీ నా లైఫ్ లోకి రా “.. చార్మి సెన్సేషనల్ పోస్ట్..!

Saranya Koduri

Chiranjeevi: చిరు ఫామ్ హౌస్ ఖరీదు తెలిస్తే షాక్ అవ్వాల్సిందే… సీఎం కి కూడా ఈ రేంజ్ ఉండదేమో..!

Saranya Koduri

Balakrishna: బాల‌య్య ప‌క్క‌న ఆ హీరోయిన్… ప‌ర్‌ఫెక్ట్ ఫిగ‌ర్రా బాబు..!

Saranya Koduri

Junior NTR: నందమూరి ఫ్యామిలీ తారక్ ని అందుకే దూరం పెడుతుందా.. బయటపడ్డ అసలు నిజం..!

Saranya Koduri

Chiranjeevi: ప్రశాంత్ వర్మ దర్శకత్వంలో సినిమా వదులుకున్న చిరు.. ఎందుకో తెలుసా..!

Saranya Koduri

Samantha: జీవితంలో అతిపెద్ద తప్పు చేశాను అంటూ మరోసారి తన ఆవేదనను బయటపెట్టిన సమంత..!

Saranya Koduri

నీ ఓటు…మన ఓటు…ప్రతి ఓటు

Deepak Rajula

Google Discover: గూగుల్ డిస్కవర్ లో పొలిటికల్ కంటెంట్ అంతా రాజకీయ నాయకుల న్యూస్ మీడియా దే…ఎన్నికల తరుణం లో అక్కడా ఇక్కడా వీరే!

Deepak Rajula

ఎల్లో జర్నలిజం నడుమ జాతీయ పత్రికా దినోత్సవం…పత్రికా స్వేచ్ఛ ఒక భ్రమ

Deepak Rajula

TDP ChandraBabu: కార్యకర్తలపై కేసులు.. బాబోరీ వెరైటీ కూతలు..!!

sekhar

Leave a Comment