నెల్లూరుకు ఒకే రోజు జగన్, చంద్రబాబు

నెల్లూరు: ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహనరెడ్డి, టిడిపి అధినేత చంద్రబాబులు ఒకే రోజు నెల్లూరు జిల్లా పర్యటనలో పాల్గొంటున్నారు. ఒక పక్క ముఖ్యమంత్రి, మరో పక్క ప్రతిపక్ష నేత ఒకే రోజు జిల్లాకు వస్తుండటంతో పోటాపోటీ స్వాగతం ఏర్పాట్లకు ఆయా పార్టీల నేతలు సిద్ధమవుతున్నారు. దీంతో నెల్లూరు జిల్లా రాజకీయం ఒక్క సారిగా వేడెక్కింది.

ఈ నెల 15వ తేదీన నెల్లూరులో వైఎస్ఆర్ రైతు భరోసా కార్యక్రమాన్ని ప్రారంభించేందుకు జగన్మోహనరెడ్డి వెళుతుండగా పార్టీ సమీక్షా సమావేశాల్లో పాల్గనేందుకు చంద్రబాబు వెళుతున్నారు. చంద్రబాబు అక్కడ రెండు రోజుల పాటు మకాం పెట్టి నియోజకవర్గాల వారిగా సమీక్షలతో పాటు భవిష్యత్తు కార్యాచరణపై నేతలతో చర్చించనున్నారు.

ఎన్నికల తరువాత తొలి సారిగా ముఖ్యమంత్రి జగన్ నెల్లూరు జిల్లాకు వస్తుండటంతో వైసిపి నేతలు, కార్యకర్తలు సిఎం సభ విజయవంతం చేసేందుకు ముమ్మరంగా సన్నాహాలు చేస్తున్నారు.ఇప్పటికే అమరావతిలో ఆ జిల్లాకు చెందిన వైసిపి ఎమ్మెల్యేలు, నేతలు  సమావేశమై సభా ఏర్పాట్ల గురించి చర్చించారు.

ఈ నేపథ్యంలోనే వైసిపి ఎమ్మెల్యేలు కోటంరెడ్డి శ్రీధర్‌రెడ్డి, కాకాని గోవర్థన్ రెడ్డిల మద్య విభేదాలపై కూడా చర్చించి రాజీ చేశారని ప్రచారం జరుగుతోంది. దీంతో తమ మధ్య ఎటువంటి విభేదాలు లేవనీ, తాము బావ బావమరుదులమనీ వారు చెప్పుకొచ్చారు.

ఒకే రోజు ముఖ్యమంత్రి వైఎస్ జగన్, ప్రతిపక్ష నేత చంద్రబాబు ఇద్దరు జిల్లా కేంద్రంలో జరిగే కార్యక్రమాలకు హజరుకానుండటంతో ఆయా పార్టీల శ్రేణులతో శాంతిభద్రతల సమస్యలు తలెత్తకుండా ఉండేందుకు పోలీసులు తగిన విధంగా బందోబస్తు చర్యలకు ప్రణాళిక సిద్ధం చేస్తున్నారు.