వివేకా హత్య కేసు..! సీబీఐ ముందుకు కీలక అనుమానితులు..!!

(కడప నుండి “న్యూస్ అర్బిట్” ప్రతినిధి)

రాష్ట్రంలో సంచలనంగా మారిన వైఎస్ వివేకానంద రెడ్డి హత్య కేసు దర్యాప్తు కీలక దశకు చేరుకుంది. రెండు నెలల క్రిందట దర్యాప్తు చేపట్టిన సీబీఐ విచారణలో ముందడుగులు వేస్తున్నది. ఇప్పటికే కీలక అనుమానితుల జాబితాను సిద్ధం చేసుకున్న సీబీఐ అధికారులు ఒక్కొక్కరిని, బృందంగానూ పిలిపించి వారి దైన శైలిలో విచారిస్తూ కొన్ని సంచలన నిజాలు రాబడుతున్నారు. ఈ క్రమంలోనే కీలకమైన అనుమానితుడుగా ఉన్న మున్నాతో పాటు కొంత మంది చెప్పుల షాపు డీలర్ లను కూడా ఈ రోజు పిలిపించి కార్యాలయంలో విచారించింది. వారి నుండి కీలకమైన ఆధారాలు సేకరించినట్లు తెలుస్తోంది.

కడప కేంద్ర కారాగారంలోని అతిధి గృహంలో సీబీఐ అధికారులు అనుమానితులను విచారిస్తున్నారు. ఇటీవల మున్నాకు చెందిన బ్యాంకు లాకర్ లో రూ,.48లక్షల నగదు, 25 తులాల బంగారం ఉండటాన్ని గమనించిన సీబీఐ అధికారులు వీటిపై ఆరా తీస్తున్నారు. మున్నా ముగ్గురు భార్యలను సీబీఐ అధికారులు విచారించారు. మూడు నెలలుగా మున్నా చెప్పుల దుకాణం మూసి ఉండటాన్ని సీబిఐ అధికారులు గుర్తించారు. అదే విధంగా మున్నాకు సంబంధించిన కుటుంబ పంచాయతీ వైఎస్ వివేకానంద రెడ్డ్డి చేశారని ఇతర విషయాలను సేకరించారు. రెండు నెలల క్రితం ఒక పర్యాయం విచారణ పూర్తి చేసిన సీబీఐ అధికారులు రెండవ పర్యాయం విచారణ కొనసాగిస్తున్నారు. గత 15 రోజులుగా కడపలోనే తిష్టవేసి ప్రతి అంశాన్ని క్షుణ్ణంగా పరిశోధన చేస్తున్నారు.