Huzurabad By Poll: హూజూరాబాద్ ‌ఉప ఎన్నికల్లో గెలుపెవరిది..? గ్రౌండ్ రిపోర్టు ఇదే..!!

Share

Huzurabad By Poll:  హూజూరాబాద్ అసెంబ్లీ ఉప ఎన్నికలకు సంబంధించి నామినేషన్ల ఉప సంహరణ ప్రక్రియ పూర్తి అయిన తరువాత మొత్తం 30 మంది పోటీలో ఉన్నారు. ప్రధాన రాజకీయ పార్టీల అభ్యర్థులతో పాటు స్వతంత్ర అభ్యర్థులు రంగంలో ఉన్నప్పటికీ ప్రధానమైన పోటీ టీఆర్ఎస్, బీజేపీ మధ్యనే ఉందన్న టాక్ వినబడుతోంది. టీఆర్ఎస్ ఆవిర్భావం నుండి కేసిఆర్ వెన్నంటి ఉన్న ఈటల రాజేందర్ ను భూకబ్జా ఆరోపణలతో కేసిఆర్ మంత్రివర్గం నుండి తొలగించిన సంగతి తెలిసిందే. ఆ నేపథ్యంలో టీఆర్ఎస్ పార్టీకి, ఎమ్మెల్యే పదవికి రాజీనామా చేసి బీజేపీ అభ్యర్థిగా ఈటల రాజేందర్ పోటీ చేయగా ఈటలను ఎలాగైనా ఓడించాలని కేసిఆర్ కంకణం కట్టుకున్నారు. ఇక్కడ టీఆర్ఎస్ అధికార బలం నెగ్గుతుందా ? ఈటల పంతం నెరవేరుతుందా ? అన్నది ఆసక్తిని రేకెత్తిస్తోంది. టీఆర్ఎస్, బీజేపీ ప్రచారంలో హోరెత్తిస్తున్నాయి. అభ్యర్థులు ఎన్నికల్లో గెలుపు కోసం వ్యూహాలను రచిస్తున్నారు. టీఆర్ఎస్ అభ్యర్థి గెల్లు శ్రీనివాస్ యాదవ్ గెలుపునకు ఆ పార్టీ నేతలు దసరా పండుగ వేళ మందు, విందులు, దావత్ లతో భారీగానే ఖర్చు చేస్తున్నట్లు వార్తలు వస్తున్నాయి. ఈటల రాజేందర్ తన సొంత చరిష్మోతో ముందుకు వెళుతున్నారు. టీఆర్ఎస్ మాత్రం అభివృద్ధి, సంక్షేమ పథకాలనే అస్త్రాలుగా ప్రయోగిస్తూ రాజకీయం చేస్తున్నది. తెలంగాణలో అతిపెద్ద పండుగైన దసరా, బతుకమ్మ పండుగ ఎన్నికల వేళ రావడంతో పార్టీల అభ్యర్థులు ఓటర్లను ఆకట్టుకునేందుకు ఈ పండగను వాడుకుంటున్నారు. ఓటర్లకు తాయిలాలు ప్రకటిస్తున్నారు.

Huzurabad Bypoll ground report
Huzurabad Bypoll ground report

Huzurabad By Poll:  వ్యక్తిగత చరిష్మాతో ‘ఈటల’ గెలుపునకు కృషి

ఈటల రాజేందర్ ఇప్పటి వరకూ పోటీ చేసిన ఆరు సార్లు ఎమ్మెల్యేగా గెలిచారు. కేసిఆర్ ను ఎదిరించి ప్రస్తుతం బీజేపీ నుండి పోటీకి దిగిన సంగతి తెలిసిందే. అయితే ఈటల రాజేందర్ బీజేపీ పేరును అంతగా వాడకుండా తన సొంత చరిష్మాతోనే హూజూరాబాద్ లో ప్రచారం చేస్తున్నారు. కారణం ఏమిటంటే హూజూరాబాద్ నియోజకవర్గంలో బీజేపీకి గ్రామ స్థాయిలో క్యాడర్ లేదు. గత ఎన్నికల్లో బీజేపీ అభ్యర్ధికి కేవలం 1600 ఓట్లు మాత్రమే పోల్ అయ్యాయి. ఈ కారణంగా ఈటల రాజేందర్ వ్యక్తిగత ఇమేజ్  ముందుకు కదులుతున్నారు. సీఎం కేసిఆర్  తనకు తీరని అన్యాయం చేశారనీ ఈటల జనాల్లోకి తీసుకువెళ్లి సానుభూతితో విజయం సాధించే ప్రయత్నం చేస్తున్నారు. అధికార పార్టీ ఇస్తున్న డబ్బులు తీసుకుని ఓట్లు మాత్రమే తనకే వేయాలని ఈటల కోరుతున్నారు. ఈటల విజయాన్ని కాంక్షిస్తూ రాష్ట్ర బీజేపీ అధ్యక్షుడు బండి సంజయ్ తో పాటు ఆ పార్టీ ఎంపీలు, ఎమ్మెల్యేలు, నేతలు ప్రచారం చేస్తున్నారు.

అభివృద్ధి, సంక్షేమ పథకాలే టిఆర్ఎస్ అస్త్రాలు

మరోవైపు టీఆర్ఎస్ మాత్రం అభివృద్ధి మంత్రంతో ముందుకు సాగుతోంది. సంక్షేమ పథకాలు, అభివృద్ధి పనులతో ఓటర్లను తమ వైపుకు తిప్పుకొంటోంది. ప్రభుత్వం అమలు చేస్తున్న సంక్షేమ పథకాలే తనను గెలిపిస్తాయని టీఆర్ఎస్ అభ్యర్థి గెల్లు శ్రీనివాస్ యాదవ్ ధీమాగా ఉన్నారు. మంత్రి హరీష్ రావు అభ్యర్థి గెలుపు బాధ్యతలను తమ భుజస్కందాలపై వేసుకుని వ్యూహాలను సిద్ధం చేసి అమలు చేస్తున్నారు. నియోజకవర్గ వ్యాప్తంగా ఈటల రాజేందర్ అనుచరులను తమ వైపుకు లాగేశారు. దళిత బంధు పథకాన్ని అమలు చేసి ఎస్సీ సామాజికవర్గ ఓట్లను ఆకర్షించారు. నియోజకవర్గంలోని ప్రతి మండలానికి ఒక మంత్రి. గ్రామాలకు ఎమ్మెల్యేలు, నాయకులు బాధ్యత తీసుకుని గడపగడపకు ప్రచారం చేస్తున్నారు. కుల సంఘాలతో సమావేశాలను నిర్వహిస్తూ వారి అవసరాలను తీరుస్తూ టీఆర్ఎస్ వైపుకు తిప్పుకుంటున్నారు. కాగా కాంగ్రెస్ అభ్యర్థి వెంకట్ బల్మూరి స్థానికేతరుడు కావడంతో నియోజకవర్గంలో ఆ పార్టీ నేతలు అంతగా సహకరించడం లేదన్న మాట వినబడుతోంది. కాంగ్రెస్ పార్టీ సీనియర్ నేతలు పట్టించుకోకపోవడంతో కాంగ్రెస్ అభ్యర్థి ప్రచారం చప్పగా సాగుతోందని అంటున్నారు. ప్రస్తుతం నియోజకవర్గంలో కేసిఆర్ వర్సెస్ ఈటల గా పోటీ నెలకొని ఉందని వార్తలు వస్తున్నాయి. టీఆర్ఎస్ అభ్యర్థి గెల్లు శ్రీనివాస్ యాదవ్, బీజేపీ అభ్యర్ధి ఈటల రాజేందర్ మద్య పోటీ నువ్వా నేనా అన్నస్థాయిలో ఉందనీ, విజయం ఎవరు సాధించినా మెజార్టీ స్వలంగానే ఉంటుందని అంటున్నారు. సానుభూతిపవనాలు వీస్తే ఈటలకు అవకాశం ఉంటుందనీ, లేదా డబ్బు, అభివృద్ధి, సంక్షేమమే పరిగణలోకి తీసుకుంటే టీఆర్ఎస్ అభ్యర్థి గెలిచే అవకాశం ఉందని సమాచారం.


Share

Related posts

TTD Chairman : రఘురామకృష్ణంరాజు అడిగిన దాంట్లో తప్పేముంది??

Comrade CHE

Twitter : సరికొత్త ఫీచర్ ను పరిచయం చేసిన ట్విట్టర్.. ఇకపై ఆ తప్పులు ఉండవు..

bharani jella

మోడీ రామాలయ నిర్మాణానికీ – ప్రభాస్ ఆదిపురూష్ కీ లింక్ ఉందా ?

GRK