విజయవాడ వెస్ట్‌లో ఫత్వా రగడ!

అమరావతి: ముందే అభ్యర్ధులను ప్రకటించి వారిని ఎన్నికల గోదాలో దించాలన్న ముఖ్యమంత్రి చంద్రబాబు వ్యూహం ఆయనకు అక్కడక్కడా చిక్కులు తెచ్చిపెడుతోంది. కృష్ణా జిల్లాలో కొన్ని సీట్లకు ముందే అభ్యర్ధులను ప్రకటించడం వల్ల విజయవాడలో రగడ మొదలయింది.  నిజానికి విజయవాడ వెస్ట్ అభ్యర్ధిని ఇంకా ప్రకటించనే లేదు. అయితే అక్కడ టికెట్ కోసం పెనుగులాట చిత్రమైన మలుపు తిరిగింది.

ప్రస్తుత శాసనసభ్యుడు జలీల్ ఖాన్ 2009 ఎన్నికలలో కాంగ్రెస్ పార్టీ అభ్యర్ధిత్వం కోసం పోటీ పడ్డారు. అప్పుడు ఆయనకు పోటీగా మల్లికా బేగం టికెట్ ఆశించారు. దానితో ఆయన బెజవాడ పాతబస్తీ ముస్లిం మతపెద్దలను ఆశ్రయించారు. వారు ఎన్నికలలో మహిళలు పోటీ చేయడానికి వీలు లేదని ఒక ఫత్వా జారీ చేశారు. చివరకు ఆయనకు టికెట్ దొరకనేలేదు. 2014లో వైసిపి టికెట్‌పై ఎన్నికలలో గెలిచి శాసనసభ్యుడయ్యారు. తర్వాత టిడిపిలోకి ఫిరాయించారు.

ఇప్పడు విజయావాడ వెస్ట్ టిడిపి టికెట్ జలీల్ ఖాన్ కుమార్తె షబనా ఖాటూన్‌కు చంద్రబాబు వాగ్దానం చేశారన్న ప్రచారం జరుగతుండడంతో ఆ టికెట్ ఆశిస్తున్న మాజీ మేయర్  మల్లికా బేగం మరి ఆనాటి ఫత్వా ఇప్పుడు పనికిరాదా అంటున్నారు.

విజయవాడ వెస్ట్ టిడిపి టికెట్ ఆశావహుల్లో మల్లికా బేగంలో పాటు పోలీస్ హౌసింగ్ కార్పొరేషన్ ఛైర్మన్ నాగుల్ మీరా కూడా ఉన్నారు. ఆయన కూడా షబానా అభ్యర్ధిత్వాన్ని వ్యతిరేకిస్తున్నారు. ముందు ఆయన  ఏకంగా రాజీనామా చేస్తానన్నారు. పార్టీ అధినేత చంద్రబాబును కలిసిన తర్వాత శాంతించినట్లు కనబడుతున్నారు కానీ అసంతృప్తితోనే ఉన్నారు.

ఫత్వా వాదనను పట్టుకుని మల్లికా బేగం శనివారం ముస్లిం మతపెద్దలను కలిశారు. అక్కడ తన వాదన వినిపించారు. నిజానికి దీని వల్ల ప్రయోజనం ఉండదని ఆమెకూ తెలుసు. చంద్రబాబు దగ్గర ఇట్లాంటి వాదనలు పనిచేయవని సంగతి మల్లికా బేగంకు తెలియకపోలేదు. ఆయన దగ్గర ఎట్లాంటి వాదన తీసుకువస్తారో చూడాలి.