కుమారస్వామి సర్కార్‌కు ఇద్దరు స్వతంత్ర ఎమ్మెల్యేల షాక్

బెంగళూరు, జనవరి 15: కర్నాటకలో కుమార స్వామి నేతృత్వంలోని జెడిఎస్‌-కాంగ్రెస్ ప్రభుత్వానికి ఇద్దరు స్వతంత్ర ఎమ్మెల్యేలు మద్దతు ఉపసంహరించుకున్నారు. స్వతంత్ర ఎమ్మెల్యేలు ఆర్ శంకర్, హెచ్ నాగేశ్‌లు తాము ప్రభుత్వానికి మద్దతు ఉపసంహరించుకుంటున్నట్లు గవర్నర్‌కు లేఖ రాశారు. మంత్రివర్గ విస్తరణ సమయంలో శంకర్ మంత్రి పదవిని కోల్పోయారు.

ప్రస్తుతం శంకర్, నాగేశ్‌లు ఒక హోటల్‌లో ఉన్నారు. అక్కడి నుండే వీరు గవర్నర్‌కు లేఖ పంపించారు. వీరు బిజెపికి మద్దతు ఇస్తున్నట్లు ప్రకటించారు.

మాజీ ముఖ్యమంత్రి యడ్యూరప్ప ఒక హోటల్‌లో 103 మంది బిజెపి ఎమ్మెల్యేలతో భేటీ అయి సమాలోచనలు చేస్తున్నారు.

మరో పక్క ముగ్గురు కాంగ్రెస్ ఎమ్మెల్యేలు కూడా బిజెపిలో చేరుతున్నారని ప్రచారం జరుగుతుంది. ఈ ప్రచారాన్ని కాంగ్రెస్ పార్టీ కొట్టిపారేసింది. తమ ఎమ్మెల్యేలు అందరూ తమతో టచ్‌లోనే ఉన్నారని, జెడిఎస్, కాంగ్రెస్ సర్కార్‌కు వచ్చిన ఇబ్బంది ఏమీ లేదని స్పష్టం చేస్తున్నారు.

‘డబ్బు, అధికారబలంతో బిజెపి రాష్ట్రంలో ప్రభుత్వాన్ని అస్తిరపర్చాలని చూస్తుందని’ ఉప ముఖ్యమంత్రి పరమేశ్వర ఆరోపిస్తున్నారు. వారి ప్రయత్నాలు విఫలం  అవుతాయని ఆయన అన్నారు.

స్వతంత్ర ఎమ్మెల్యేల మద్దతు ఉప సంహరణలో  కుమారస్వామి ప్రభుత్వానికి సంఖ్యాబలం 118కి తగ్గింది.