హైదరాబాద్ లోని రాజ్ భవన్ వద్ద తీవ్ర ఉద్రిక్త పరిస్థితులు నెలకొన్నాయి. ఎమ్మెల్సీ కవిత పై బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు బండి సంజయ్ చేసిన వ్యాఖ్యలను ఖండిస్తూ మేయర్ విజయలక్ష్మి నేతృత్వంలో బీఆర్ఎస్ నేతలు గవర్నర్ కు ఫిర్యాదు చేసేందుకు రాజ్ భవన్ కు చేరుకున్నారు. ఇవేళ సాయంత్రం 5 గంటలకు గవర్నర్ ను కలిసేందుకు అపాయింట్మెంట్ అడగ్గా, రాజ్ భవన్ నుండి ఎలాంటి సమాచారం రాలేదు. దీంతో నగర మేయర్ విజయలక్ష్మి, మహిళా కార్పోరేటర్ లు, బీఆర్ఎస్ మహిళా అభిమానులు పెద్ద సంఖ్యలో రాజ్ భవన్ వద్దకు చేరుకున్నారు. లోపలికి వెళ్లేందుకు అనుమతి లేదుంటూ పోలీసులు వారిని అడ్డుకున్నారు. దీంతో అక్కడ కొద్ది సేపు ఉద్రిక్త పరిస్థితులు నెలకొన్నాయి. రాజ్ భవన్ వద్ద బారికేడ్లు ఏర్పాటు చేసి మహిళా నేతలను పోలీసులు నిలువరించారు. దీంతో ఆగ్రహించిన బీఆర్ఎస్ నేతలు రాజ్ భవన్ ముందు ధర్నాకు దిగారు.

ముందుగానే గవర్నర్ అపాయింట్మెంట్ అడిగినా స్పందించలేదని మేయర్ మండిపడ్డారు. బండి సంజయ్ చేసిన వ్యాఖ్యలను వెనక్కి తీసుకోవాలని, కవితకు క్షమాపణలు చెప్పాలని డిమాండ్ చేసారు. బీఆర్ఎస్ శ్రేణుల ఆందోళనతో రాజ్ భవన్ రోడ్డులో వాహనాల రాకపోకలు నిలిచిపోయాయి. కొద్ది సేపు అక్కడ నిరసన వ్యక్తం చేసిన బీఆర్ఎస్ శ్రేణులు తర్వాత ట్యాంక్ బండ్ వద్దకు వెళ్లి బీఆర్ అంబేద్కర్ విగ్రహం వద్దకు చేరుకుని వినతి పత్రం సమర్పించారు. బీఆర్ఎస్ శ్రేణుల ర్యాలీతో ట్యాంక్ బండ్ పరిసరాల్లో భారీ ట్రాఫిక్ నిలిచిపోయింది. వాహన చోదకులు తీవ్ర ఇబ్బందులు పడ్డారు.
మరో వైపు బండి సంజయ్ అనుచిత వ్యాఖ్యలపై రాష్ట్ర వ్యాప్తంగా బీఆర్ఎస్ శ్రేణులు ధర్నాలు, రాస్తారోకోలు నిర్వహించారు. బండి సంజయ్ ను అరెస్టు చేయాలని డిమాండ్ చేస్తూ పలు పోలీస్ స్టేషన్ లలో ఫిర్యాదులు చేశారు. ఈ ఫిర్యాదులపై లీగల్ ఒపీనియన్ తీసుకుని ముందుకు వెళ్లే ఆలోచనలో పోలీసు వర్గాలు ఉన్నాయి. అన్నీ ఒకే తరహా ఫిర్యాదులు కావడంతో ఒక పీఎస్ కు బదిలీ చేసి దర్యాప్తు చేసే ఆలోచనలో పోలీసులు ఉన్నట్లు సమాచారం. కాగా ఢిల్లీలో ఇడీ కార్యాలయం వద్ద ఉద్రిక్త పరిస్థితులు నెలకొన్నాయి. ఈడీ కార్యాలయంలో ఏడు గంటలకు పైగా కవితను అధికారులు విచారిస్తున్నారు. ఈడీ కార్యాలయం వద్దకు చేరుకున్న బీఆర్ఎస్ శ్రేణులను పోలీసులు అక్కడ నుండి పంపించి వేస్తున్నారు. ఒకవేళ కవితను అరెస్టు చేస్తే బీఆర్ఎస్, ఆప్ ఆధ్వర్యంలో పెద్ద ఎత్తున నిరసన కార్యక్రమాలకు సిద్దమవుతున్నట్లుగా ప్రచారం జరుగుతోంది.