9న జగన్ ’సంకల్పం’ ముగింపు

హైదరాబాద్, జనవరి 01: వైఎస్సార్‌సీపీ అధినేత వైఎస్ జగన్‌మోహన్‌ రెడ్డి చేపట్టిన ‘పజా సంకల్ప యాత్ర’ ఈ నెల తొమ్మిదవ తేదీన ముగియనున్నదని ఆ పార్టీ ప్రధాన కార్యదర్శి సజ్జల రామకృష్ణారెడ్డి తెలిపారు. మంగళవారం సజ్జల మీడియాతో మాట్లాడుతూ 2017 నవంబరు ఆరున కడపజిల్లా ఇడుపులపాయలో ప్రారంభమైన జగన్ పాదయాత్ర ఈనెల తొమ్మిదవ తేదీన శ్రీకాకుళం జిల్లా ఇచ్చాపురంలో పూర్తి కానున్నదని చెప్పారు.
వైఎస్ జగన్ సంకల్పయాత్ర ఇప్పటివరకు 134 నియోజకవర్గాల్లో 120 బహిరంగ సభలు, రెండువేలకుపైగా గ్రామాలు, 3500 కిలోమీటర్లకుపైగా సాగిందన్నారు. ‘ జనవరి తొమ్మిది ఎంతో చారిత్రాత్మికమైన రోజు. ప్రజా సంకల్ప యాత్ర ముగిసేరోజు ’ అని సజ్జల అన్నారు. పాదయాత్రకు మద్దతుగా ఈనెల రెండు నుంచి సంఘీభావ కార్యక్రమాలను నియోజకవర్గ సమన్వయ కర్తలు చేపట్టి జగన్ పాదయాత్ర లక్ష్యాలను ప్రజలకు తెలియజేస్తారు.

ప్రజల సమస్యలను ఆలకిస్తూ, పరిష్కారానికి భరోసా ఇస్తూ జగన్ పాదయాత్రను సాగించారని సజ్జల తెలిపారు.   రాష్ట్రంలోని అన్ని వర్గాలకు చెందిన ప్రజలను కలుసుకున్నారనీ. పాదయాత్రలో పర్యటించని ప్రాంతాలను త్వరలో బస్సు యాత్ర ద్వారా పర్యటించనున్నటు తెలిపారు. తెలంగాణా సీఎం కె చంద్రశేఖరరావు ఆంధ్రాలో ప్రచారం చేస్తే ఓట్లు పడతాయని భావించడం లేదన్నారు. ప్రత్యేక హోదాకు షీఎం కెసిఆర్ మద్దతు ఇవ్వడాన్ని స్వాగతించారు. ఆంధ్రప్రదేశ్ సీఎం చంద్రబాబునాయుడు నిజస్వరూపం గురించి ఎవ్వరూ చెప్పినా సంతోషమని సజ్జల తెలిపారు.