అమ్మాయి దుస్తులు విప్పి.. దారుణహత్య
అమెరికాలో ఎంఎస్-13 గ్యాంగు సభ్యుల కిరాతకం
మాయమాటలు చెప్పి 14 ఏళ్ల అమ్మాయిని ఒక సొరంగంలోకి తీసుకెళ్లి, అక్కడ ఆమె దుస్తులు విప్పి బేస్ బాల్ బ్యాటుతో కొట్టి, కత్తితో ఒళ్లంతా చీరేసి దారుణాతి దారుణంగా హతమార్చారు. ఈ ఘటన అమెరికాలో జరిగింది. అరియానా ఫ్యూన్స్ -డియాజ్ అనే ఆ అమ్మాయిని ఏప్రిల్ 18వ తేదీన అక్కడకు తీసుకెళ్లారు. ఈ దారుణానికి ఎంఎస్-13 అనే గ్యాంగు సభ్యులు బాధ్యులని పోలీసులు చెబుతున్నారు. తమను పోలీసులకు పట్టిస్తుందన్న అనుమానంతోనే వాళ్లీ నేరానికి తెగబడ్డారు. ఈ విషయాన్ని వాషింగ్టన్ పోస్ట్ పత్రిక తన కథనంలో ప్రచురించింది.
ఒక్క రోజు ముందే ఒక వ్యక్తిని ఈశాన్య వాషింగ్టన్ ప్రాంతంలో ఆ గ్యాంగు సభ్యులు కొట్టి, దోచుకున్నారు. అతడికి వేరే గ్యాంగుతో సంబంధాలున్నాయా అని విచారించారు. అతడు ఆ అమ్మాయికి కుటుంబ స్నేహితుడని, అతడిని వదిలిపెట్టాలని ఆమె వారిని వేడుకుందని కోర్టుకు సమర్పించిన పత్రాల్లో పోలీసులు తెలిపారు. అయితే, డియాజ్ పోలీసులకు అంతా చెప్పేస్తుందన్న భయంతో గ్యాంగు సభ్యులు ఆమెపై దారుణంగా దాడిచేసి, దాన్నంతటినీ రికార్డు చేశారు. ఆమెను వారు చంపేశారని ప్రిన్స్ జార్జ్ కౌంటీ అసిస్టెంట్ స్టేట్ అటార్నీ సింథియా బ్రిడ్జి ఫోర్డ్ చెప్పారు.
మేరీలాండ్ ప్రాంతంలోని ఒక వాగు వద్ద డియాజ్ మృతదేహం సుమారు నెల రోజుల క్రితం బయటపడింది. 14 ఏళ్ల వయసున్న అమ్మాయితో పాటు ముగ్గురు టీనేజర్లపై హత్యకేసు నమోదైంది. వారిని పెద్దవారుగానే భావిస్తున్నారు తప్ప బాలనేరస్తులుగా పరిగనించడం లేదు. ఈశాన్య వాషింగ్టన్ ప్రాంతానికి చెందిన జోయల్ ఎస్కోబార్ (17), లోథియాన్ కు చెందిన సింథియా హెర్మండెజ్ (14) ఇద్దరూ బెయిల్ లేకుండా జైల్లోనే ఉండాలని కోర్టు తెలిపింది. ఇక మూడో నిందితుడైన జోస్ ఫ్యూంటెస్ (16)ను ఇంకా కోర్టులో ప్రవేశపెట్టాలి. ఈ కేసులో ఉన్న మరో నిందితుడు దాడిని షూట్ చేశాడు. అతడెవరని పోలీసులు ఇంకా గాలిస్తున్నారు.
తొలుత ఆమె కూడా ఈ గ్యాంగు సభ్యులతో పాటు కలిసే ఉండేదని అంటున్నారు. ఏప్రిల్ 17న తన తల్లికి తెలిసిన ఒక వ్యక్తిని ఆమె లిఫ్ట్ అడిగి, తనను బెన్నింగ్ రోడ్ మెట్రో స్టేషన్ వద్ద దింపాలని కోరింది. అక్కడకు వెళ్లగానే 15 మంది అతడి కారును చుట్టుముట్టి, అతడిని సమీపంలో ఉన్న ఓ పాత ఇంటికి తీసుకెళ్లారు. అక్కడ అతడి వద్ద 500 డాలర్లు దోచుకోవడంతో పాటు బ్యాంకు కార్డు కూడా లాగేసుకున్నారు. అతడికి ఏదైనా గ్యాంగుతో సంబంధం ఉందా అని ఆరా తీశారు. తనను చీకటి గదిలో వేసి కొట్టారని, తన షర్టు తీసేసి ఏవైనా గ్యాంగు టాటూలు ఉన్నాయేమో చూశారని అతడు అన్నాడు. అతడిని వదిలిపెట్టాలని ఫ్యూన్స్ డియాజ్ వారిని వేడుకోవడంతో వదిలేశారు. మర్నాడే ఆమెను ఎస్కోబార్, హెర్మాండెస్, ఫ్యూంటెస్ ముగ్గురూ కలిసి కారులో ఒక అపార్టుమెంటుకు తీసుకెళ్లారు. అక్కడ ఓ వాగు కింద ఉన్న సొరంగంలోకి వెళ్లి, ఆమెపై దాడి చేశారు. ఎస్కోబార్ బేస్ బాల్ బ్యాటుతో కొట్టగా, ఫ్యూంటెస్ కత్తితో దాడి చేసింది. మూడో వ్యక్తి తన ఫోనులో అంతా షూట్ చేశాడని పోలీసులు చెప్పారు.