AP Assembly Budget Session: ఏపి అసెంబ్లీ బడ్జెట్ సమావేశాల చివరి రోజు శుక్రవారం కూడా టీడీపీ సభ్యులు తమ ఆందోళనను కొనసాగించారు. సభలో ప్రశ్నోత్తరాలు ప్రారంభమైన కొద్దిసేపటికే టీడీపీ సభ్యులు స్పీకర్ పోడియం వద్దకు వెళ్లి కల్తీ సారా మరణాలపై ఆందోళనకు దిగారు. నినాదాలు చేస్తూ సభలో నిరసన వ్యక్తం చేశారు. టీడీపీ సభ్యుల ఆందోళన మధ్యనే సభ్యుల ప్రశ్నోత్తరాలు కొనసాగించారు. దేశ చరిత్రలో 32 లక్షల ఇళ్ల పట్టాలు ఇచ్చిన ఘనత సీఎం వైఎస్ జగన్ దేనని వైసీపీ నేతలు పేర్కొన్నారు. ఇదొక మహాయజ్ఞమని, దీన్ని ఎవరూ ఆపలేరని అన్నారు. కావాలనే కొంత మంది కోర్టులకు వెళ్లి అడ్డుకున్నారని వైసీపీ నేతలు మండిపడ్డారు.

తొలుత మద్య నిషేదంపై మహిళలకు జగన్ రెడ్డి ఇచ్చిన హామీ గోవిందా గోవిందా అంటూ టీడీఎల్పీ నిరసన తెలిపింది. మహిళల తాళిబొట్లు తెంచారంటూ తాళిబొట్లు చేతపట్టుకుని నిరసన ర్యాలీ నిర్వహించారు. 42 మంది మరణాలపై చర్చ జరగాలని డిమాండ్ చేస్తూ సచివాలయ అగ్నిమాపక కేంద్రం నుండి అసెంబ్లీకి నిరసన ర్యాలీ నిర్వహించారు. మృతుల ఫోటోలకు నివాళులర్పిస్తూ నల్ల కండువాలతో టీడీపీ నేతలు ప్రదర్శనలో పాల్గొన్నారు. కల్తీ సారా మరణాలు జగన్ రెడ్డి హత్యలేనని నినాదాలు చేశారు. మద్య నిషేదం అంటూ మహిళల మెడల్లో తాళ్లు తెంచుతున్నారంటూ ప్లకార్డులతో ప్రదర్శన నిర్వహించారు. కల్తీ సారా బాధిత కుటుంబాలకు రూ.25 లక్షల పరిహారం ఇవ్వాలని టీడీపీ నేతలు డిమాండ్ చేశారు.