YS Jagan: ఏపీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహనరెడ్డి మళ్లీ ఢిల్లీకి వెళ్లనున్నారు. ఈ నెల 4వ తేదీ సాయంత్రం గన్నవరం విమానాశ్రయం నుండి ప్రత్యేక విమానంలో ఢిల్లీకి వెళతారు సీఎం జగన్. ఆ రాత్రి అక్కడే బస చేసి 5వ తేదీ ఉదయం ప్రధాన మంత్రి నరేంద్ర మోడీతో భేటీ కానున్నారు. అనంతరం హోం శాఖ మంత్రి అమిత్ షాతో పాటు పలువురు కేంద్ర మంత్రులను జగన్ కలిసే అవకాశం ఉందని తెలుస్తొంది. ఏపికి రావాల్సిన నిధుల గురించి చర్చించడంతో పాటు ముందస్తు ఎన్నికలకు వెళ్లే అంశంపైనా జగన్ ఢిల్లీ పెద్దలతో చర్చించే అవకాశాలు ఉన్నట్లుగా వార్తలు వినబడుతున్నాయి. ఇప్పటికిప్పుడు ఎన్నికలు జరిగితే వైసీపీకి తిరుగులేదు అన్నట్లుగా ఓ జాతీయ న్యూస్ ఛానల్ నిర్వహించిన సర్వేలో వెల్లడైన నేపథ్యంలో ముందస్తు ఎన్నికలకు వెళ్లడమే మేలు అన్నట్లుగా ఉన్నారని ఊహగానాలు వినబడుతున్నాయి.

ముందస్తు ఎన్నికలకు వెళ్లడం లేదని వైసీపీ పెద్దలు చెబుతున్నప్పటికీ గత ఏడాది కాలం నుండి వైసీపీ ప్రజా ప్రతినిధులు, నేతలను గడపగడపకు మన ప్రభుత్వం పేరుతో జనాల్లో తిప్పుతున్నారు సీఎం వైఎస్ జగన్. కేంద్ర బీజేపీ పెద్దల సహకారం ఉన్న సమయంలోనే ఎన్నికలకు వెళితే వ్యవస్థల తోడ్పాటు కూడా ఉంటుందని భావిస్తున్నారుట. అయితే ఇటీవల ఏపీ పర్యటనకు వచ్చిన బీజేపీ జాతీయ అధ్యక్షుడు జేపీ నడ్డా, కేంద్ర హోంశాఖ మంత్రి అమిత్ షాలు .. జగన్మోహనరెడ్డి సర్కార్ పై తీవ్ర స్థాయిలో ఆరోపణలు, విమర్శలు చేసి వెళ్లారు. అయినప్పటికీ బీజేపీపై వైసీపీ ఎదురుదాడి చేయలేదు. సీఎం జగన్ సైతం బీజేపీ నాయకత్వంపై ఎటువంటి విమర్శలు చేయలేదు. కాకపోతే రాబోయే ఎన్నికల్లో బీజేపీ సహకారం ఉండకపోవచ్చు అని జగన్ ఓ మీటింగ్ లో వ్యాఖ్యానించారు. కేంద్రంలోని బీజేపీతో పేచీ పెట్టుకోవడం ఇష్టం లేకపోవడం వల్లనే జగన్ అమిత్ షా వ్యాఖ్యలపై స్పందించలేదని అనుకుంటున్నారు. అయితే వైసీపీ సర్కార్ పై తీవ్ర ఆరోపణలు చేసిన తర్వాత అమిత్ షా తో సీఎం జగన్ భేటీ అవుతుండటం ప్రాధాన్యతను సంతరించుకున్నది.
మరో ఏడాదిలో లోక్ సభ ఎన్నికలు జరగనున్న తరుణంలో దేశ వ్యాప్తంగా మోడీకి వ్యతిరేకంగా విపక్షాలు కూటమిగా ఏర్పడుతున్నాయి. దీంతో ఎన్డీఏ ను విస్తరించేందుకు బీజేపీ అధిష్టానం దృష్టి పెట్టింది. ఈ క్రమంలోనే రీసెంట్ గా చంద్రబాబును ఢిల్లీకి పిలిపించుకుని అమిత్ షా, జేపీ నడ్డా సమావేశమైయ్యారు. బీజేపీ ఎప్పుడు డోర్ లు తెరుస్తుందా అని చంద్రబాబు చాలా కాలం నుండి ఎదురు చూస్తున్నారు. అమిత్ షా కబురు పెట్టడం ఆలస్యం వెంటనే ఢిల్లీకి వెళ్లి కలిసి వచ్చారు చంద్రబాబు. అయితే అమిత్ షా, జేపీ నడ్డాతో సమావేశంలో ఏ విషయాలపై చర్చించారు అనేది మాత్రం బహిర్గతం చేయలేదు చంద్రబాబు. దీంతో ఎవరికి తోచినట్లుగా వారు కథనాలు వండి వారుస్తున్నారు. చంద్రబాబు ఇంతకు ముందు ఓ జాతీయ మీడియాకు ఇచ్చిన ఇంటర్వ్యూలో ఎన్డీఏలో మళ్లీ చేరడానికి ఎటువంటి ఇబ్బంది లేదని తేల్చి చెప్పడంతో ఆ విషయాలపై చర్చించేందుకు వెళ్లాలరని అయితే ముందుగా తెలంగాణ ఎన్నికల విషయంపైనే చర్చించారని అనుకుంటున్నారు. ఇటువంటి పరిస్థితుల్లో సీఎం జగన్ .. మోడీ, అమిత్ షా లను కలిసేందుకు ఢిల్లీకి వెళుతుండటం రాజకీయ వర్గాల్లో హాట్ టాపిక్ అవుతోంది.
ఓ జాతీయ న్యూస్ ఛానల్ సర్వే లో ఏపీలో వేసీపీ అత్యధికంగా లోక్ సభ స్థానాలు గెలిచే అవకాశం ఉన్నట్లుగా తేల్చి చెప్పిన నేపథ్యంలో ఏపీలో టీడీపీతో కాకుండా వైసీపీతో కలిసి వెళ్లేందుకు బీజేపీ అధిష్టానం సిద్దమైందా అనే వాదన కూడా తెరపైకి వస్తొంది. ఎన్డీఏలో చేరాలని వైసీపీని ఎప్పటి నుండో ఆహ్వానిస్తున్నా వైసీపీ ఒప్పుకునే పరిస్థితి లేదని అంటున్నారు. ఏ రాజకీయ పార్టీతో పొత్తు లేకుండా ఒంటరిగానే ఎన్నికలకు వెళ్తామన్నది వైసీపీ స్టాండ్. ఒక వేళ ఎన్డీఏ కూటమిలో చేరితే వైసీపీకి మద్దతుగా ఉన్న ముస్లిం మైనార్టీ, క్రిస్టియన్ మైనార్టీ వర్గాలు దూరమవుతాయన్న భయం ఆ పార్టీ లో ఉంది. ఇవన్నీ ఆలోచించే అనధికార మిత్ర పక్షంగా ఉండేందుకే వైసీపీ మొగ్గుచూపుతోంది. కేంద్రంలోని బీజేపీతో సఖ్యతగా ఉండటం వల్ల రాష్ట్ర ప్రభుత్వానికి కేంద్రం నుండి పలు విషయాల్లో సహాయ సహకారాలు అందుతున్నాయి. ఇటీవలే పెద్ద ఎత్తున పెండింగ్ బకాయిలను కేంద్రం విడుదల చేసింది. పోలవరం ప్రాజెక్టు సవరించిన అంచనాలకు కేంద్రం ఆమోదించింది. ఈ తరుణంలోనే ముందస్తు ఎన్నికలకు కేంద్ర పెద్దలు ఒప్పుకుంటే తదనుగుణంగా జగన్ చర్యలు చేపట్టే అవకాశం ఉందనే మాట వినబడుతోంది. జగన్ ఢిల్లీ పర్యటన అనంతరం ఈ విషయాలపై ఒక క్లారిటీ వచ్చే అవకాశం ఉంది.
మణిపూర్ లో హింసపై సీఎం బీరెన్ సింగ్ సంచలన వ్యాఖ్యలు..అల్లర్లు, హింస వెనుక వారి హస్తం..?