EBC Nestham: వైసీపీ ప్రభుత్వం అధికారంలోకి వచ్చినప్పటి నుండి ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహనరెడ్డి ఎన్నికల సమయంలో ఇచ్చిన హామీలన్నీ అమలునకు చర్యలు తీసుకుంటున్న విషయం తెలిసిందే. రాష్ట్ర ఆర్థిక పరిస్థితి ఇబ్బందికరంగా ఉన్నప్పటికీ అప్పులు తెచ్చిమరీ నవరత్న పథకాలను కొనసాగిస్తున్నారు. ఇబ్బడి ముబ్బడిగా అప్పులు చేసి రాష్ట్రాన్ని అప్పులాంధ్ర ప్రదేశ్ గా తీర్చిదిద్దుతున్నారని జగన్ సర్కార్ పై ప్రతిపక్షాలు విమర్శిస్తున్నా సీఎం జగన్ ఆ విమర్శలు ఏమీ పట్టించుకోవడం లేదు. సంక్షేమ పథకాలను యథావిధిగా కొనసాగిస్తున్నారు. ఇప్పుడు తాజాగా అగ్రవర్ణాల్లోని పేద మహిళల కోసం ఈబీసీ నేస్తం పథకం అమలునకు జగన్ సర్కార్ ముహూర్తం ఖరారు చేసింది. ఈబీసీ నేస్తం ఫథకంలో లబ్దిపొందేందుకు అర్హులైన అభ్యర్థులు తమ పేర్లు నమోదు చేసుకోవాలని అధికారులు కోరారు. ఈ పథకం ద్వారా లబ్దిదారులకు సంవత్సరానికి రూ.15 వేలు చొప్పున మూడేళ్లలో రూ.45 వేల ఆర్థిక సాయాన్ని ప్రభుత్వం అందించనున్నది. అగ్ర కులాలకు చెందిన 45 నుండి 60 సంవత్సరాల మధ్య వయసు కల్గిన మహిళలు ఈబీసీ నేస్తం పథకం పొందేందుకు అర్హులు.

EBC Nestam: ఈబీసీ మహిళల జీవన ప్రమాణాల మెరుగుకే
ఈ పథకం జీవో విడుదల అయిన రోజుకు 45 నుండి 60 సంవత్సరాలు నిండిన ఈబీసీ మహిళలకు వారి జీవన ప్రమాణాలు మెరుగుపరచడం కోసం ఆర్థిక సాయం అందించడం ముఖ్య ఉద్దేశం. లబ్దిదారులకు ఆర్థిక సాయంగా సంవత్సారనికి రూ.15వేల చొప్పున మూడేళ్లకు రూ.45వేలు అందించనున్నారు. దీని కోసం 2021 – 22 బడ్జెట్ కింద ప్రభుత్వం సంవత్సరానికి 670 – 605 కోట్లు, అలా మూడేళ్లకు రూ.1810 – 2011 కోట్లు కేటాయించింది.
పథకం వర్తింపునకు నిబంధనలు ఇవి
వైఎస్ఆర్ చేయూత, కాపు నేస్తంలో ఉన్న లబ్దిదారులతో పాటు ఎస్సీ, ఎస్టీ, బీసీ మైనార్టీ మహిళలు అర్హులు కారు. కేవలం ఈబీసీ మహిళలు మాత్రమే అర్హులు. లబ్దిదారుల పేరుతో ఆధార్ కార్డు, బ్యాంకు అకౌంట్ బుక్ ఉండాలి. ఇక వార్షిక ఆదాయం గ్రామాల్లో అయితే లక్షా 20వేలు, పట్టణాల్లో అయితే లక్షా 44వేలు మించకూడదు. ఈ పథకం లో లబ్దిదారులకు పల్లపు భూమి 3 ఎకరాల కన్నా తక్కువగా ఉండాలి. లేదా మెట్ట భూమి పది ఎకరాల కన్నా తక్కువగా ఉండాలి. కుటుంబంలో ఎవరూ ప్రభుత్వ ఉద్యోగి గానీ పెన్షనర్ గాని ఉండకూడదు. అయితే ఈ నిబంధనల్లో పారిశుద్ధ్య కార్మికులకు మినహాయింపు ఇచ్చారు. కుటుంబంలో ఎవరి పేరు మీద ఫోర్ వీలర్ ఉండకూడదు. కుటుంబంలో ఎవరూ కూడా ఇంకమ్ ట్యాక్స్ కడుతున్న వారు ఉండకూడదు. 2021 సెప్టెంబర్ 29 నాటికి 45 సంవత్సరాలు కంటే ఎక్కువ, 60 సంవత్సరాల లోపు ఉన్న అగ్రకుల మహిళలు ఈ నెల 7వ తేదీ లోపు సమీప గ్రామ వార్డు, సచివాలయాల్లో దరఖాస్తు చేసుకోవాల్సి ఉంది.