MLA Quota MLC Election: ఎమ్మెల్యే కోటా ఎమ్మెల్సీ ఎన్నికల్లో అందరూ ఊహించినట్లుగానే క్రాస్ ఓటింగ్ జరిగింది. టీడీపీ అభ్యర్ధి పంచుమర్తి అనురాధ విజయం సాధించారు. ఏపి అసెంబ్లీలో టీడీపీకి నైతికంగా బలం లేకపోవడంతో వైసీపీ ఏడు ఎమ్మెల్సీ స్థానాలకు అభ్యర్ధులను బరిలోకి దింపింది. అయితే అనూహ్యంగా టీడీపీ పంచుమర్తి అనురాధను పోటీకి నిలపడంతో వైసీపీ ఏకగ్రీవంపై పెట్టుకున్న ఆశలు నీరుగారాయి. టీడీపీ ఊహించినట్లుగానే వైసీపీ నుండి క్రాస్ ఓటింగ్ జరిగింది. వాస్తవంగా టీడీపీకి అసెంబ్లీలో 23 మంది ఎమ్మెల్యేల బలం ఉన్నప్పటికీ టీడీపీ నుండి గెలిచిన నలుగురు ఎమ్మెల్యేలు కొద్ది నెలలకే వైసీపీకి మద్దతుగా మారిపోయారు. అయినప్పటికీ టీడీపీ ఎమ్మెల్సీ అభ్యర్ధి పంచుమర్తి అనురాధకు 23 ఓట్లు వచ్చాయి. దీంతో నాలుగు ఓట్లు క్రాస్ అయినట్లు స్పష్టం అవుతోంది.

వైసీపీ అసంతృప్తి ఎమ్మెల్యేలుగా ఉన్న అనం రామనారాయణరెడ్డి, కోటంరెడ్డి శ్రీధర్ రెడ్డి లు టీడీపీ అభ్యర్ధికి ఓటు వేసినట్లుగా భావిస్తున్నా మరో ఇద్దరు ఎవరు అనేది ఇప్పుడు చర్చనీయాంశం అయ్యింది. టీడీపీ పంచుమర్తి అనురాధను పోటీకి దించిన నేపథ్యంలో వైసీపీ అప్రమత్తమై.. ఏ ఒక్కరూ చేజారిపోకుండా 22 మంది ఎమ్మెల్యేలకు ఒక సీనియర్ నేత/ మంత్రిని ఇన్ చార్జిని ఏర్పాటు చేసి బుధవారం రాత్రి క్యాంప్ రాజకీయానికి తెరి తీసింది. అసంతృప్తిగా ఉన్న పలువురు ఎమ్మెల్యేలను బుజ్జగింపులు చేసినట్లుగా వార్తలు వచ్చాయి.
కాగా రెండో ప్రాధాన్యత ఓట్లతో వైసీపీ అభ్యర్ధి జయమంగళం వెంకట రమణ గెలుపొందగా, కోలా గురువులు ఓటమి పాలైయ్యారు. ఎమ్మెల్సీ ఎన్నికల నోటిఫికేషన్ కు ముందే జయమంగళం వెంకట రమణ టీడీపీకి గుడ్ బై చెప్పి వైసీపీలో చేరారు. ఎమ్మెల్సీ హామీతో వైసీపీలో చేరారు. ఇక వైసీపీ నుండి క్రాస్ ఓటింగ్ పాల్పడిన ఇద్దరు ఎమ్మెల్యేలు ఎవరు అనే దానిపై ఇప్పుడు హాట్ టాపిక్ అయ్యింది. ఆ ఇద్దరు ఎవరు అనేది తేల్చే పనిలో వైసీపీ నేతలు ఉన్నారు. ఈ పరిణామంపై సీనియర్ నేతలు చర్చిస్తున్నారని సమాచారం.
ఫలించిన చంద్రబాబు వ్యూహం.. ఎమ్మెల్సీగా ఎన్నికైన పంచుమర్తి అనురాధ