Nellore: నెల్లూరు జిల్లాలో ఓ యువతిపై జరిగిన దారుణ ఘటన ఆలస్యంగా వెలుగులోకి వచ్చింది. ఈ కేసులో నిందితులు పైశాచిక ఆనందం పొందడం కోసం తీసిన వీడియోనే వారిని నేరస్తులుగా పట్టించింది. విషయంలోకి వెళితే..ఓ యువతిని యువకుడు అటవీ ప్రాంతానికి తీసుకువెళ్లి విచక్షణారహితంగా కొడుతూ హింసించారు. ఒ యువకుడు ఆమెను చేతులతో, కర్రతో కొడుతూ తన స్నేహితుడుతో వీడియో తీయించి పైశాచిక ఆనందం పొందాడు. వేరే వ్యక్తితో సంబంధం పెట్టుకుందన్న అనుమానంతో ఆ యువకుడు ఆమెపై దాడి చేసి విచక్షణారహితంగా కొట్టాడు. అయితే ఈ ఘటన జరిగి రెండు నెలలు అయింది. ఈ ఘటనపై బాధితురాలు పోలీస్ స్టేషన్ లో ఫిర్యాదు చేయలేదు. గత నెల 27వ తేదీన ఆ యువతికి వేరే వ్యక్తితో వివాహం అయ్యింది.

అయితే రెండు రోజులుగా సోషల్ మీడియాలో ఈ వీడియో వైరల్ అయ్యింది. అసలే మహిళలపై జరుగుతున్న అత్యాచారాలు, లైంగికదాడులపై ఆందోళనలు వ్యక్తం అవుతున్న తరుణంలో ఈ వీడియో వైరల్ కావడంతో నిందితుడిని కఠినంగా శిక్షించాలంటూ నెటిజన్ లు డిమాండ్ చేశారు. దీనిపై నెల్లూరు జిల్లా ఎస్పీ విజయరావు వెంటనే స్పదించారు. నిందితులను పట్టుకునేందుకు మూడు బృందాలను ఏర్పాటు చేశారు. పోలీసులు ముందుగా బాధితురాలి వద్ద కు వెళ్లి వివరాలు అడిగి తెలుసుకున్నారు. కేసు నమోదు చేసి దర్యాప్తు ప్రారంభించారు. ఆ యువతిని తీవ్రంగా కొట్టి గాయపర్చిన నెల్లూరు రామకోటయ్య నగర్ కు చెందిన పల్లాల వెంకటేష్, అతనికి సహకరించి ఘటనను వీడియో తీసిన శివను పోలీసులు అదుపులోకి తీసుకున్నారు.
ఈ ఘటనలో బాధిత యువతి నుండి వారిపై ఫిర్యాదు లేకపోయినా సోషల్ మీడియాలో వైరల్ అయిన వీడియో ఆధారంగా నిందితులు కేసులో బుక్ అవ్వడం గమనార్హం. వారు చేసిన తప్పే వారిని పట్టించింది.