Breaking: మాజీ మంత్రి వైఎస్ వివేకా హత్య కేసులో ఆరోపణలు ఎదుర్కొంటున్న కడప ఎంపీ వైఎస్ అవినాష్ రెడ్డికి తెలంగాణ హైకోర్టులో బిగ్ షాక్ తగిలింది. ఆయన దాఖలు చేసిన మద్యంతర పిటిషన్ ను హైకోర్టు తోసి పుచ్చింది. సీబీఐ విచారణకు అవినాష్ రెడ్డి సహకరించాల్సిందేనని తేల్చి చెప్పింది. మాజీ మంత్రి వైఎస్ వివేకానందరెడ్డి హత్య కేసులో సీబీఐ దూకుడు పెంచింది. కేసు దర్యాప్తు చివరి దశకు చేరుకోగా ఈ కేసులో కడప ఎంపీ అవినాష్ రెడ్డి, ఆయన తండ్రి భాస్కరరెడ్డిని సైతం అరెస్టు చేయడానికి సిద్దం అవుతోంది. ఈ తరుణంలో సీఆర్పీసీ 160 సెక్షన్ ప్రకారం తనపై కఠిన చర్యలు తీసుకోవద్దని, అదే విధంగా పిటిషన్ పై పూర్తి విచారణ ముగిసే వరకూ తనను సీఆర్పీసీ 160 సెక్షన కింద తదుపరి విచారణ జరగకుండా స్టే ఇవ్వాలంటూ అవినాష్ రెడ్డి తెలంగాణ హైకోర్టులో మధ్యంతర పిటిషన్లు దాఖలు చేశారు.

వైఎస్ వివేకా హత్య కేసుకు సంబంధించి సిబీఐ దర్యాప్తు పారదర్శకంగా జరగడం లేదనీ, తన విచారణ సందర్భంలో న్యాయావాదిని అనుమతించాలని, తన స్టేట్ మెంట్ ప్రతిని తనకు ఇవ్వాలని అవినాష్ రెడ్డి ఇటీవలే కోర్టును కోరారు. అంతే కాకుండా విచారణ సమయంలో ఆడియో, వీడియో రికార్డింగ్ ను కూడా చేయాలని ఆయన హైకోర్టును కోరారు. అయితే అవినాష్ రెడ్డి ఆరోపణలను సీబీఐ ఖండించింది. ఆడియో, వీడియో రికార్డులు కూడా ఉన్నాయని సీబీఐ కోర్టుకు తెలిపింది. ఇరుపక్షాల వాదనలు విన్న హైకోర్టు ఇటీవల తీర్పు రిజర్వు చేసింది. తీర్పు వచ్చే వరకూ అవినాష్ రెడ్డి ని అరెస్టు చేయవద్దంటూ ఆదేశాలు ఇచ్చింది.
కాగా అవినాష్ పిటిషన్లపై హైకోర్టు కొద్ది సేపటి క్రితం తీర్పు వెలువరించింది. అరెస్టు విషయంలో జోక్యం చేసుకోలేమని హైకోర్టు స్పష్టం చేసింది. మధ్యంతర పిటిషన్లను తోసిపుచ్చింది. అయితే విచారణ సమయంలో ఆడియో, వీడియో రికార్డింగ్ చేయాలని, విచారణ రూమ్ లో న్యాయవాదిని కనిపించేంత దూరంలో అనుమతించాలని హైకోర్టు ఆదేశించింది. హైకోర్టు తాజా తీర్పుతో సీబీఐ అధికారులు అవినాష్ రెడ్డి, ఆయన తండ్రి భాస్కరరెడ్డిని ఏ క్షణంలో అయినా అదుపులోకి తీసుకుని విచారించే అవకాశాలు ఉన్నాయని తెలుస్తుంది. ఇప్పటికే అవినాష్ రెడ్డిని సీబీఐ నాలుగు పర్యాయాలు విచారించిన సంగతి తెలిసిందే.
స్థానిక సంస్థల ఎమ్మెల్సీ ఎన్నికల్లో వైసీపీ ఘన విజయం