Nara Lokesh: స్కిల్ డవలప్ మెంట్ స్కామ్ కేసులో ఏపీ సీఐడీ అధికారులు అరెస్టు చేసిన టీడీపీ అధినేత, మాజీ సీఎం చంద్రబాబును ఈ వేకువ జామున ఏసీబీ కోర్టు లో హజరు పర్చారు. అయితే చంద్రబాబు రిమాండ్ రిపోర్టులో సీఐడీ సంచలన విషయాలను వెల్లడించింది. ఈ కీలక కేసులో ఇప్పటి వరకు జరిగిన విచారణలో ఎవరి పాత్ర ఏమిటి అనేది అనే విషయాలను ప్రస్తావించింది. సీఐడీ చేసిన అభియోగాలపై ప్రభుత్వ న్యాయవాది సుధాకర్ రెడ్డి వాదనలు వినిపించారు. ఇదే సమయంలో చంద్రబాబు స్వయంగా తన వానదలను మెజిస్ట్రేట్ ముందు ఉంచారు.

సీఐడీ రిమాండ్ రిపోర్టులో ఈ స్కామ్ లో లబ్ది పొందేందుకు ప్రభుత్వ నిర్ణయాలకు భిన్నంగా వ్యవహరించారని అభియోగాలు నమోదు చేయడంతో పాటు నాటి మంత్రులు నారా లోకేశ్, అచ్చెన్నాయుడు పేర్లను ప్రస్తావించడం రాజకీయ వర్గాల్లో తీవ్ర సంచలనం అయ్యింది. రిమాండ్ రిపోర్టులో నారా లోకేష్ పేరు చేర్చిన సీఐడీ కిలారు రాజేష్ ద్వారా లోకేష్‌కు డబ్బులు అందాయని అభియోగించింది. స్కిల్ స్కాంలో చంద్రబాబు ప్రధాన సూత్రధారుడని పేర్కొన్న సీఐడీ.. బాబు పై కుట్ర, ప్రజాధనం దుర్వినియోగం, మోసం అభియోగాలు ఉన్నాయని తెలిపింది. ప్రభుత్వం ద్వారా విడుదలైన సొమ్మును షెల్ కంపెనీలు, ఫేక్ ఇన్ వాయిస్ ల ద్వారా మళ్లించారని సీఐడీ పేర్కొంది.

అభియోగాలకు సంబంధించి పలు కీలక డాక్యుమెంట్లు, ఆధారాలను చూపిన సీఐడీ మరింత విచారణకు చంద్రబాబును కస్టడీకి తీసుకోవాల్సి అవసరం కూడా ఉందని తెలిపింది. చంద్రబాబుకు తన వ్యక్తిగత కార్యదర్శి పెండ్యాల శ్రీనివాస్ ద్వారా ముడుపులు అందాయన్న దానిపై ఈడీ విచారణ చేస్తోందని సీఐడీ తెలిపింది. ఈడీ విచారణ కీలక దశలో ఉందని పేర్కొంది. కేసులో మనోజ్ వాసుదేవ్ కు ఈ నెల 5న నోటీసులు ఇచ్చామని సీఐడీ తెలిపింది. తమ నోటీసులకు అతను జవాబు ఇవ్వకుండా విదేశాలకు పారిపోయారని సీఐడీ వివరించింది.

ఈ కేసులో చంద్రబాను కస్టడీ విచారణకు ఇవ్వాలని సీఐడీ కోరుతుండగా, చంద్రబాబు తరపు న్యాయవాదులు తమ వాదనలు వినిపిస్తున్నారు. చంద్రబాబు స్వయంగా తన వాదనలు వినిపిస్తూ ఈ కేసులో తన ప్రమేయం లేదని చెప్పుకొచ్చారు. కేబినెట్ నిర్ణయంపై జరిగిన దానికి క్రిమినల్ కేసు నమోదు చేయడానికి వీలులేదని తమ అరెస్టు అక్రమం అంటూ వాదనలు వినిపించారు. చంద్రబాబు వాదనలను మెజిస్ట్రేట్ రికార్డు చేశారు. చంద్రబాబు తరపున సుప్రీం కోర్టు న్యాయవాది సిద్ధార్ధ్ లూద్రా చంద్రబాబు అరెస్టు అక్రమం అంటూ వాదనలు వినిపించారు.

2021 లో కేసు నమోదు చేస్తే ఇప్పటి వరకూ ఎఫ్ఐఆర్ లో, చార్జి షీటులో చంద్రబాబు పేరు లేకుండా ఇప్పుడు ఎలా నమోదు చేశారు వంటి కీలక ప్రశ్నలను న్యాయమూర్తి సంధించారు. సీఐడీ తరపున ప్రభుత్వ న్యాయవాది సుధాకర్ రెడ్డి వాదనలు వినిపిస్తుండగా కోర్టు తీర్పుపై తీవ్ర ఉత్కంఠ కొనసాగుతోంది. అయితే ఈ కేసులో తాజాగా నారా లోకేష్ పేరు కూడా ప్రస్తావనకు రావడంతో ఆయనను అరెస్టు చేస్తారంటూ వైసీపీ నేతలు అంటున్నారు. తప్పు చేసిన వారు ఎవరైనా జైలు కు వెళ్లాల్సిందేనని అంటున్నారు.