Balakrishna: ఇటీవల కాలంలో చిన్న సినిమా అయినా, పెద్ద సినిమా అయినా థియేటర్స్‌లో యాబై రోజులు ఆడటం గగనం అయిపోయింది. ప్రతి సినిమా రెండు వారాలకు మించి ఉండటం లేదు. ప్రభాస్ హీరోగా రాజమౌళి తెరకెక్కించిన `బాహుబలి` చిత్రమే అత్యధిక థియేటర్స్‌లో 50 రోజులు నిలదొక్కుకుని రికార్డు సృష్టించింది. ఆ తర్వాత ప్రభాస్ రికార్డ్‌ను ఎవరూ బద్దలుకొట్టలేకపోయారు. కానీ, బాలయ్య మాత్రం ఆ రికార్డును తన్ని అవతల పడేశారు. పూర్తి వివరాల్లోకి వెళ్తే..
నటసింహ నందమూరి బాలకృష్ణ, బోయపాటి శ్రీను కాంబినేషన్లో ముచ్చటగా మూడో సారి తెరకెక్కిన చిత్రం `అఖండ`. ద్వారకా క్రియేషన్స్ బ్యానర్‌పై మిర్యాల రవీందర్ రెడ్డి నిర్మించిన ఈ చిత్రంలో ప్రజ్ఞ జైస్వాల్ హీరోయిన్గా నటించగా.. సీనియర్ హీరో శ్రీకాంత్ విలన్‌గా నటించారు. థమన్ ఈ చిత్రానికి సంగీతం సమకూర్చాడు.
భారీ అంచనాల నడుమ డిసెంబర్ 2న విడుదలైన ఈ చిత్రం తొలి రోజే పాజిటివ్ టాక్‌ను సొంతం చేసుకుని బాక్సాఫీస్ వద్ద అదిరిపోయే కలెక్షన్లతో ప్రభంజనం సృష్టించింది. ఇప్పటికీ థియేటర్స్‌లో రన్ అవుతూనే ఉన్న అఖండ.. తాజాగా 25కి పైగా సెంటర్లలో అర్థశతదినోత్సవం జరుపుకోనుంది. బాహుబలి తర్వాత ఈ స్థాయి థియేటర్లలో 50 రోజులు పూర్తి చేసుకున్న సినిమా ఏదైనా ఉందా అంటే అది అఖండనే అంటున్నారు సినీ పండితులు.
దీంతో బాలయ్య స్టామినా చూసి నందమూరి అభిమానులే కాదు తెలుగు ప్రేక్షకులందరూ ఆశ్చర్యపోతున్నారు. కాగా, అఖండ స్ట్రీమింగ్ హక్కులను ప్రముఖ ఓటీటీ సంస్థ డిస్నీ ప్లాస్ హాట్‌స్టార్ దక్కించుకోగా.. జనవరి 21న ఈ సినిమా అందులో స్ట్రీమింగ్ కాబోతోంది.