‘కళా’త్మక దర్శకుడు ‘కన్ను’ మూత

కలకత్తా, డిసెంబరు 30: ప్రముఖ చలన చిత్ర దర్శకుడు పద్మభూషణ్ మ‌ృణాల్‌సేన్(95) కన్ను మూశారు. వయస్సురీత్యా వచ్చిన అనారోగ్య కారణాలతో ఆదివారం ఉదయం 10.30 గంటలకు కలకత్తాలోని తన నివాసంలో తుదిశ్వాస విడిచారు. కలకత్తా కేంద్రంగా ప్రపంచ వేదికపై ఆయన భారతీయ సినిమాకు ఒక గొప్ప ప్రతినిధిగా పేరుగాంచారు. సినిమా ‌ద్వారా సామాజిక పరిస్థితులపై వ్యాఖ్యానించడం, వాస్తవికతను కళాత్మంగా ప్రతిబింబించడంలో మృణాల్ సేన్ మేటి.

నీల్ అక్షర్ నీచే, బైషే శ్రావణ్, భువన్ షోమ్, అక్లేర్ సంథానే వంటి చిత్రాలు ఆయనకు గొప్ప పేరు తెట్టిపెట్టాయి. ఉత్తమ్ కుమార్ కధానాయకుడిగా తీసిన రాత్ భర చిత్రంతో ఆయన ప్రస్తానం మొదలయింది. సమకాలీనులైన సత్యజిత్ రే, రిత్విక్ ఘటక్‌తో పాటు భరతీయ ప్రాంతీయ భాషల సినిమాను అంతర్జాతీయ స్థాయికి తీసుకువెళ్లిన త్రిమూర్తులలో మృణాల్ సేన్ ఒకరు. చలనచిత్ర రంగంలో అత్యున్నత పురస్కారమైన దాదసాహెబ్ ఫాల్కె ఆవార్డు ఆయనను 2005లో వరిచింది.
1923 మే 14 ఫరీదాపూర్‌లో ఆయన జన్మించారు. భువన్ ‌షోమ్‌తో తొలిసారి జాతీయ పురస్కారాల్లో ఉత్తమ దర్శకునిగా అవార్డును అందుకున్నారు. పద్మభూషణ్‌తోపాటుగా 1983లో కేన్స్ జ్యూరీ ప్రైజ్, 1978, 1980, 1981, 1984లలో భారత జాతీయ చలన చిత్ర పురస్కారాలు, 1983, 1981, 1974లో జాతీయ చలనచిత్ర ఉత్తమ పురస్కారాలు, 1985 ఖాందార్ చిత్ర స్క్రీన్ ప్లేకి బెస్ట్ ఫిలింఫేర్ అవార్డు, 1977లో మృగయా చిత్రానికి బెస్ట్ ఫిలిం క్రిటిక్ అవార్డు అందుకున్నారు. బెంగాలీతో మొదలైన మృణాళ్‌సేన్ సినీ ప్రస్థానం హిందీ, తెలుగు, ఒరియా వంటి భారతీయ భాషల్లో సైతం కూడా కొనసాగింది.