Tollywood: రామాయణం.. ఎన్ని సార్లు చదివినా మళ్లీ మళ్లీ చదవాలనిపించే మహాకావ్యం. జీవిత విలువల్ని, వాటిని కాపాడేందుకు మార్గాలను చూపించే పవిత్ర గ్రంథం. సకలగుణాభిరాముడు శ్రీరాముడు నడిచిన మార్గమే రామాయణం. ఆ మార్గంలో ప్రతి ఒక్కరూ నడవాలనీ, ఆదర్శప్రాయమైన జీవితాన్ని గడపాలనీ, ధర్మ మార్గాన్ని అనుసరించాలనీ రామాయణం ఉపదేశిస్తుంది. అటువంటి మహోన్నతమైన ఇతిహాసాన్ని ఇప్పటికే వెండితెరపై ఎన్నో సార్లు ఆవిష్కరించారు.
ముఖ్యంగా తెలుగులో రామాయణం నేపథ్యంలో చాలా చిత్రాలు వచ్చాయి. ఎందరో నటులు శ్రీరాముడిగా నటించి ప్రేక్షకులను మెప్పించారు. అయితే తెలుగు తెరపై శ్రీరాముడి వేషం వేసిన మొట్ట మొదటి నటుడు ఎవరో తెలుసా.. ఎన్టీఆర్, ఏఎన్నార్ మాత్రం కాదు. టాలీవుడ్ లో శ్రీరాముడు అనగానే ప్రేక్షకులకు సీనియర్ ఎన్టీఆర్ గారే గుర్తుకు వస్తారు. అంతలా ఆయన ఆ పాత్రకు న్యాయం చేశారు. కానీ అన్నగారి కంటే ముందు మరికొందరు నటులు శ్రీరాముడి వేషం వేశారు.
తెలుగు తెరపై తొలిసారి రామాయణం నేపథ్యంలో 1932వ సంవత్సరంలో `శ్రీరామ పాదుకా పట్టాభిషేకము` పేరుతో ఒక చిత్రం వచ్చింది. సర్వోత్తం బాదామి డైరెక్ట్ చేసిన ఈ చిత్రంలో యడవల్లి సూర్యనారాయణ శ్రీరాముడిగా, సురభి కమలాబాయి సీతాదేవిగా నటించారు. సెలెక్ట్ పిక్చర్స్ సర్క్యూట్ బ్యానర్ పై నిర్మితమైన ఈ చిత్రం అప్పట్లో మంచి విజయం సాధించింది. తెలుగులో శ్రీరామునిగా నటించిన మొదటి నటుడిగా యడవల్లి సూర్యనారాయణ రికార్డు సెట్ చేశారు.
1945లో పాదుకా పట్టాభిషేకం టైటిల్ తో మరో సినిమా వచ్చింది. కడారు నాగభూషణం తెరకెక్కించిన ఈ చిత్రంలో శ్రీరాముడిగా సి.ఎస్.ఆర్.ఆంజనేయులు నటించారు. పెంటపాడు పుష్పవల్లి సీత పాత్రను పోషించారు. 1966లో పాదుకా పట్టాభిషేకం టైటిల్ తో ఇంకొక చిత్రం రాగా.. ఇందులో కాంతారావు రాముడి వేషం వేసి మెప్పించారు. అలాగే నందమూరి తారకరామారావు గారి కంటే ముందు తెలుగులో అక్కినేని నాగేశ్వరరావుగారే శ్రీరాముడిగా నటించారు. 1944లో వచ్చిన శ్రీ సీతా రామ జననం లో ఏఎన్నార్ గారు రాముడిగా అలరించారు.
1959లో విడుదలైన సంపూర్ణ రామాయణం లో ఎన్టీఆర్ మొదటిసారి శ్రీరాముడిగా కనిపించారు. రాముడంటే ఇలానే ఉంటాడా అనేంత అద్భుతంగా ఆయన నటించారు. తెలుగువారందరికీ రాముడు అంటే ఎన్టీఆర్ అనేలా ముద్రవేశారు. ఆపై లవకుశ, రామదాసు, శ్రీరామాంజనేయ యుద్దం చిత్రాల్లో ఎన్టీఆర్ రాముడిగా నటించి మెప్పించారు.
సీనియర్ ఎన్టీఆర్ గారి తర్వాత నందమూరి వంశంలో వెండితెరపై శ్రీరాముడిగా నటించింది ఇద్దరు మాత్రమే. అందులో ఒకరు బాలకృష్ణ కాగా.. మరొకరు జూనియర్ ఎన్టీఆర్. బాపు దర్శకత్వంలో వచ్చిన శ్రీరామ రాజ్యంలో బాలకృష్ణ రాముడిగా నటిస్తే.. జూనియర్ ఎన్టీఆర్ గుణశేఖర్ తెరకెక్కించిన బలరామాయణంలో రాముడి వేషం వేశాడు.
అలాగే 1971లో వచ్చిన సంపూర్ణ రామాయణంలో టాలీవుడ్ సోగ్గాడు శోభన్ బాబు, 1976లో వచ్చిన సీతా కల్యాణంలో రవికుమార్, శ్రీరామదాసు చిత్రంలో సుమన్, దేవుళ్లు చిత్రంలో శ్రీకాంత్, ఇటీవల వచ్చిన ఆదిపురుష్ సినిమాలో ప్రభాస్ రాముడిగా నటించి ప్రేక్షకులను మెప్పించారు. తెలుగులో ఇప్పటి వరకు ఈ హీరోలకు మాత్రమే శ్రీరాముడిగా నటించే అదృష్టం దక్కింది.