Tollywood Actor: పైన ఫోటోలో ఉన్న చిన్నోడు ఎవరో గుర్తుపట్టారా..? ఒకప్పుడు సౌత్ లో స్టార్ హీరో అతను. తెలుగు, తమిళ ప్రేక్షకులకు అత్యంత సుప్రసిద్ధుడు. నటుడిగా మరియు సింగర్ గా మంచి పేరు తెచ్చుకున్నాడు. రీల్ లైఫ్‌లోనే కాకుండా రియల్ లైఫ్‌లో కూడా లవర్ బాయ్ అనే ఇమేజ్ ను సంపాదించుకున్నాడు. పైగా ఈ రోజు అతని బర్త్‌డే. ఇంతకీ ఆ హీరో ఎవరో గెస్ చేశారా.. మన సిద్ధార్థ్ అండి బాబు. బర్త్‌డే సందర్భంగా సిద్ధార్థ్ గురించి కొన్ని ఆసక్తికర విషయాలు ఇప్పుడు తెలుసుకుందాం.
1979 ఏప్రిల్ 17న తమిళనాడులోని మద్రాసులో తమిళం మాట్లాడే కుటుంబంలో సిద్ధార్థ్ జన్మించాడు. న్యూ ఢిల్లీలోని కిరోరి మాల్ కాలేజీ నుండి బ్యాచిలర్ ఆఫ్ కామర్స్ పట్టా అందుకున్నాడు. ముంబైలోని ఎస్.పి. జైన్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ మేనేజ్మెంట్ అండ్ రీసెర్చ్ నుండి తన ఎమ్బీఏ కంప్లీట్ చేశాడు. చిన్నతనం నుండే సినిమాల్లో కెరీర్‌ను కొనసాగించాలని భావించిన సిద్ధార్థ్.. రచన మరియు దర్శకత్వంపై ప్రత్యేక ఆసక్తిని కనబరిచాడు. స్టడీస్ పూర్తి చేసిన తర్వాత యాడ్ ఫిల్మ్ మేకర్ జయేంద్ర మరియు సినిమాటోగ్రాఫర్ పి.సి. శ్రీరామ్‌ల వద్ద సిద్ధార్థ్ కొన్నాళ్లు శిష్యరికం చేశాడు. వారిద్దరి సహాయంతోనే మణిరత్నం యొక్క కన్నతిల్ ముత్తమిట్టల్ మూవీకి అసిస్టెంట్ డైరెక్టర్ వర్క్ చేశాడు.
ఈ క్రమంలోనే సినీ పరిశ్రమకు చెందిన చాలా మందితో సిద్ధార్థ్‌కు పరిచయం ఏర్పడింది. స్క్రిప్ట్ రైటర్ సుజాత పట్టుబట్టడంతో బాయ్స్ మూవీకి సిద్ధార్థ్ ఆడిషన్ ఇచ్చాడు. అనూహ్యంగా అతను సెలక్ట్ అయ్యాడు. శంకర్ డైరెక్ట్ చేసిన ఈ చిత్రం 2003లో విడుదలై భారీ విజయాన్ని అందుకుంది. దాంతో సిద్ధార్థ్ కు ఆఫర్లు క్యూ కట్టాయి. నువ్వొస్తానంటే నేనొద్దంటానా సినిమాతో సిద్ధార్థ్ తెలుగు ఇండస్ట్రీలోకి అడుగు పెట్టాడు. ప్రభు దేవా తెరకెక్కించిన ఈ చిత్రం 2005లో విడుదలై సంచలన విజయాన్ని నమోదు చేసింది. దాదాపు తొమ్మిది భాషల్లో ఈ మూవీ రీమేక్ చేయబడింది.
2006లో వచ్చిన బొమ్మరిల్లు కెరీర్ కు మరో టర్నింగ్ పాయింట్ గా నిలిచింది. ఈ సినిమాతో సిద్ధార్థ్ స్టార్ అయిపోయాడు. లవ్ బాయ్ ఇమేజ్ తో యూత్ లో భారీ ఫ్యాన్ ఫాలోయింగ్ సంపాదించుకున్నాడు. ఆ తర్వాత ఆట, కొంచెం ఇష్టం కొంచెం కష్టం, ఓయ్!, ఓ మై ఫ్రెండ్, బావ, జబర్దస్త్ వంటి సినిమాలు చేశాడు. కానీ ఇవి ఆశించిన స్థాయిలో విజయం సాధించలేదు. దాంతో చాలా ఏళ్ల నుంచి సిద్ధార్థ్ తమిళంలోనే సినిమాలు చేస్తూ కెరీర్ ను ముందుకు సాగిస్తున్నారు.
సిద్ధార్థ్ పర్సనల్ లైఫ్ విషయానికి వస్తే.. 2003లోనే అతను ఓ ఇంటివాడు అయ్యాడు. న్యూ ఢిల్లీకి చెందిన మేఘన అనే అమ్మాయిని ప్రేమించి పెళ్లి చేసుకున్నాడు. సిద్ధార్థ్, మేఘన దంపతులకు ఒక కుమారుడు కూడా జన్మించారు. అయితే పెళ్లై ఒక కొడుకు పుట్టినా కూడా సిద్ధార్థ్ ఇండస్ట్రీకి చెందిన సోహా అలీ ఖాన్, శృతి హాసన్, సమంత ఇలా చాలా మంది హీరోయిన్లతో లవ్ ఎఫైర్లు నడిపించాడు. దాంతో 2006లో మేఘన సిద్ధార్థ్ కు విడాకులు ఇచ్చింది. మేఘనతో విడిపోయాక సిద్ధార్థ్ సమంతతో ఆల్మోస్ట్ పెళ్లి వరకు వెళ్లాడు. ఓ గుడిలో సమంతతో కలిసి సిద్దార్థ్ ప్రత్యేక పూజలు కూడా చేశాడు. కానీ వీరు వివాహం చేసుకుండానే విడిపోయారు. ఇక ప్రస్తుతం సిద్ధార్థ్ ప్రముఖ హీరోయిన్ అదితి రావు హైదరీతో రిలేషన్ లో ఉన్నాడు. కొద్ది రోజుల క్రితం ఎంగేజ్మెంట్ చేసుకున్న ఈ జంట.. త్వరలోనే మూడు ముళ్ల బంధంతో ఒకటి కాబోతోంది.
https://www.instagram.com/worldofsiddharth/?hl=en